Ukraine: ఆయుధ సామగ్రి కొనుగోలులో అవినీతి.. రూ.330 కోట్లు మాయం!

ఆయుధాల కొనుగోలు పేరిట ఉక్రెయిన్‌ రక్షణశాఖ అధికారులతో కుమ్మక్కైన ఓ ఆయుధ సంస్థ ప్రతినిధులు.. రూ.330 కోట్లు పక్కదారి పట్టించారు.

Published : 28 Jan 2024 23:03 IST

కీవ్: రష్యాతో యుద్ధం వేళ ఆయుధాల కొనుగోలు కోసం ఉక్రెయిన్‌ రక్షణశాఖ అధికారులతో కుమ్మక్కైన ఓ ఆయుధ సంస్థ ప్రతినిధులు.. రూ.330 కోట్లు పక్కదారి పట్టించారు. ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (SBU) దర్యాప్తులో ఈ విషయం తేలింది. ఈ కేసులో మొత్తం ఐదుగురిపై అభియోగాలు మోపినట్లు ఎస్‌బీయూ తెలిపింది. ఒకరు ఉక్రెయిన్‌ (Ukraine) సరిహద్దు దాటి పారిపోయేందుకు యత్నించగా.. అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

2022 ఆగస్టులో రష్యాతో భీకర యుద్ధం సాగుతోన్న వేళ.. లక్ష మోర్టార్‌ షెల్స్‌ కొనుగోలు కోసం ఆయుధ సంస్థ ‘ల్వివ్ ఆర్సెనల్‌’తో అధికారులు దాదాపు 40 మిలియన్ల డాలర్ల (రూ.330 కోట్లు) ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మొత్తాన్ని స్వీకరించిన సదరు సంస్థ ప్రతినిధులు.. మరో విదేశీ సంస్థకు బదిలీ చేస్తే అది ఆయుధ సామగ్రి సరఫరా చేస్తుంది. కానీ, ఆ నిధులను వేరే ఖాతాలకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో డెలివరీ నిలిచిపోయింది. అయితే, ఆ నిధులను జప్తు చేశామని, రక్షణ బడ్జెట్‌లో చేర్చుతామని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ వెల్లడించారు.

తన్నుకున్న ఎంపీలు.. ముష్టిఘాతాలతో దద్దరిల్లిన మాల్దీవుల పార్లమెంటు

ఐరోపా సమాఖ్య, నాటో కూటమిలో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న ఉక్రెయిన్‌.. ఈ క్రమంలోనే స్థానికంగా అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. 2019లో ఇదే హామీపై జెలెన్‌స్కీ అధికారంలోకి వచ్చారు. మరోవైపు.. ఈ అవినీతి కేసులో నేరం రుజువైతే నిందితులకు 12 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని