Ukraine Updates: మరోసారి క్రిమియాపై ఉక్రెయిన్‌ గురి.. క్షిపణి దాడుల్లో రష్యా ‘ఎస్‌400’ ధ్వంసం!

రష్యాపై ఉక్రెయిన్‌ మరోసారి విరుచుకుపడింది. క్రిమియాలోని రష్యన్‌ గగనతల రక్షణవ్యవస్థను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది.

Published : 15 Sep 2023 02:19 IST

కీవ్‌: ఇటీవల రష్యా ఆక్రమిత క్రిమియా (Crimea)లోని సెవెస్తపోల్‌ నౌకాశ్రయంపై విరుచుకుపడిన ఉక్రెయిన్‌.. తాజాగా మాస్కోకు చెందిన అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ (Air Defence System)ను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (SBU), నౌకాదళం కలిసి.. క్రిమియా పశ్చిమాన ఉన్న యెవ్‌పటోరియా సమీపంలోని రష్యన్ స్థావరంపై క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేసినట్లు కీవ్‌ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. అక్కడ ధ్వంసం చేసిన ఎస్‌300, ఎస్‌400 గగనతల రక్షణ వ్యవస్థల విలువ రూ.9 వేల కోట్లుగా ఉంటుందని తెలిపింది.

మేం ఎలా జీవించాలో చెప్పే హక్కు అమెరికాకు లేదు! రష్యా

మరోవైపు.. తమ గగనతల రక్షణ వ్యవస్థ క్రిమియాలో రాత్రికి రాత్రే 11 ఉక్రెయిన్‌ డ్రోన్‌లను కూల్చేసినట్లు రష్యా తెలిపింది. పెట్రోలింగ్ నౌకపై దాడిని అడ్డుకున్నట్లు పేర్కొంది. దీంతోపాటు నల్ల సముద్రంలో ఓ ఉక్రెయిన్‌ బోట్‌ను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. సెవెస్తపోల్‌ నౌకాశ్రయంపై ఉక్రెయిన్‌ జరిపిన దాడుల్లో రెండు రష్యన్‌ నౌకలకు నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. 24 మందికి గాయాలయ్యాయి. క్రిమియాలో రష్యాకు ఇది ప్రధాన నౌకాస్థావరం. ఇటీవలి కాలంలో క్రిమియాపై జరిగిన అతి పెద్ద దాడుల్లో ఇదొకటని యుద్ధ విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా దౌత్యవేత్తలపై రష్యా వేటు..!

రష్యా- అమెరికాల మధ్య ఘర్షణాపూరిత వాతావరణం మరింత వేడెక్కేలా కనిపిస్తోంది. అమెరికాకు చెందిన ఇద్దరు దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు రష్యా విదేశాంగశాఖ తాజాగా ప్రకటించడమే దీనికి కారణం. స్థానిక అమెరికా ఎంబసీలోని ఫస్ట్‌ సెక్రెటరీ, సెకండ్‌ సెక్రెటరీ జెఫ్రీ సిలిన్, డేవిడ్ బెర్న్‌స్టెయిన్‌లు వారం రోజుల్లో దేశం విడిచి వెళ్లాలంటూ అమెరికా రాయబారి లిన్నే ట్రేసీకి సమాచారం అందించింది. ఆతిథ్య దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఆమోదయోగ్యం కాదని, వాటిని అణిచివేస్తామని రష్యా స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు