Ukraine: పుతిన్‌ కలల వంతెనపై దాడి చేసింది మేమే: మొదటిసారి అంగీకరించిన ఉక్రెయిన్‌

గత ఏడాది ప్రారంభం నుంచి రష్యా-ఉక్రెయిన్‌(Russia-Ukraine) దేశాల మధ్య తీవ్రస్థాయి ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కెర్చ్‌ వంతెనపై గతేడాది జరిగిన దాడికి ఉక్రెయిన్‌ బాధ్యత స్వీకరించింది. 

Published : 27 Jul 2023 11:51 IST

కీవ్‌:  రష్యా-క్రిమియా(Russia-Crimea)ను కలిపే కెర్చ్‌ వంతెన(Kerch Bridge)పై గత ఏడాది భారీ పేలుడు జరిగింది. దాంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కలల వంతెన కొంత భాగం కూలింది. అప్పట్లో దాడి చేసింది తామేనని మొదటిసారి ఉక్రెయిన్(Ukraine) అంగీకరించింది. ఈ మేరకు ఆ దేశ నిఘా సంస్థ బాధ్యత తీసుకుంది.

ఉక్రెయిన్‌ నిఘా సంస్థ(ఎస్‌బీయూ) చీఫ్ వాసిల్‌ మాల్యుక్‌ ఈ దాడి గురించి స్పందించారు. ఆయన మాటలు అక్కడి టీవీలో ప్రసారం అయ్యాయి. ‘మేం ఎన్నో ఆపరేషన్లు నిర్వహించాం. అందులో కొన్ని ప్రత్యేకమైన ఆపరేషన్లు ఉన్నాయి. వాటిలో మేం విజయం సాధించిన తర్వాత వాటి వివరాలు బహిరంగంగా చెప్పగలం. గత ఏడాది అక్టోబర్ 8వ తేదీన క్రిమియా వంతెనపై జరిపిన దాడి అలాంటి వాటిలో ఒకటి. అలాగే మేం ఇతరుల చర్యల గురించి ఎట్టిపరిస్థితుల్లో మాట్లాడం’ అని మాల్యుక్ వెల్లడించారు. 

ఉక్రెయిన్‌కు అమెరికా నిఘా తూనీగలు

గత ఏడాది రష్యా అధ్యక్షుడు పుతిన్ 70వ పుట్టినరోజు చేసుకున్న మరుసటి రోజే క్రిమియా వంతెనపై దాడి(Crimea bridge blast) జరిగింది. ఆ వంతెనపై ట్రక్కు బాంబు పేలడంతో సమీపంలోని రైలు వంతెనపై చమురు ట్యాంకర్లు మంటల్లో చిక్కుకొన్నాయి. ఆ దాడి తీవ్రతకు వంతెన కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు అప్పట్లో అధికారులు వెల్లడించారు.

అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన ఈ నల్ల సముద్రంపై ఆధిపత్యం కోసం తీవ్రంగా యత్నిస్తోన్న రష్యా.. 2014లో క్రిమియా ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత 2018లో 3 బిలియన్‌ డాలర్లు వెచ్చించి కెర్చ్‌ జలసంధిపై రోడ్డు, రైలు వంతెనను నిర్మించింది. ఈ వంతెనపై దాడికి తాము కారణం కాదని ఇంతకాలం తోసిపుచ్చిన ఉక్రెయిన్‌(Ukraine).. తాజాగా తొలిసారి బాధ్యత తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని