Ukraine: ఒడెస్సా పోర్టులో రష్యా భారీ విధ్వంసం..!

ఉక్రెయిన్‌ ఆధీనంలోని ఏకైక ప్రధాన పోర్టు అయిన ఒడెస్సాపై రష్యా భారీగా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పోర్టులోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ధాన్యం ఎగుమతులను దెబ్బతీయడానికే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. 

Published : 25 Sep 2023 15:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌(Ukraine)కు ఉన్న ఏకైక ప్రధాన పోర్టు అయిన ఒడెస్సాపై రష్యా (Russia) విరుచుకుపడింది. ఈ దాడిలో పోర్టు, ధాన్యం నిల్వ గోదాములు, ఓ హోటల్‌ తీవ్రంగా దెబ్బతిన్నాయి. రష్యా ఆధీనంలోని క్రిమియా నౌకాదళ స్థావరం ప్రధాన కార్యాలయంపై ఉక్రెయిన్‌ క్షిపణి దాడి చేసిన కొన్ని రోజుల్లోనే ఇది చోటు చేసుకోవడం గమనార్హం. మొత్తం 12 కల్బిర్‌ క్షిపణులు, 19 డ్రోన్లు, రెండు ఒనెక్స్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణులను ప్రయోగించింది. వీటిల్లో కల్బిర్‌ క్షిపణులను సబ్‌మెరైన్లు, నౌకలపై నుంచి ప్రయోగించినట్లు ఉక్రెయిన్‌ వర్గాలు వెల్లడించాయి. వీటిల్లో అత్యధికశాతాన్ని తాము కూల్చివేశామని కీవ్‌ వర్గాలు పేర్కొన్నాయి.  

ఈ దాడిలో ఒడెస్సా నౌకాశ్రయంలోని ఆహార ధాన్యాల గోదాములు, ఇతర పోర్టు మౌలిక వసతులు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ధాన్యపు ఒప్పందం అమలుకు అవసరమైన పరికరాలు, ప్రదేశాలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్‌ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఒనెక్స్‌ క్షిపణులు పోర్టును బాగా దెబ్బతీసినట్లు సమాచారం. కాకపోతే ప్రాణనష్టం నుంచి ఉక్రెయిన్‌ తప్పించుకొంది. ఈ దాడుల్లో ఓ హోటల్‌ కూడా తీవ్రంగా దెబ్బతింది. 

‘ఆరోపణలు నిజమని తేలితే..’: భారత్‌తో ఉద్రిక్తతల వేళ కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు

నల్లసముద్రంలోని అంతర్జాతీయ జలాలు కాకుండా.. పొరుగు దేశాల జలాల్లో నుంచి మాత్రమే ధాన్యం రవాణ చేసేలా మార్గాలను ఉక్రెయిన్‌ ప్రస్తుతం పరీక్షిస్తోంది. ఇందుకోసం నాటో సభ్యదేశాలైన బల్గేరియా, రొమానియా తీరాలను వాడుకుంటోంది. ఈ మార్గంలో రవాణ చేసిన తొలి రెండు షిప్‌మెంట్‌లు తాజాగా తుర్కియే చేరుకొన్నాయి. ప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థల్లో ఉక్రెయిన్‌, రష్యా రెండూ కీలకమైనవే. మరోవైపు ఉక్రెయిన్‌ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను తాము కూల్చేసినట్లు రష్యా ప్రకటించింది. వీటిల్లో కొన్ని క్రిమియా దిశగా దూసుకొచ్చాయని పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని