Russia: నల్లసముద్రంలో రష్యాకు మరో భారీ దెబ్బ.. ఉక్రెయిన్‌ దాడితో కుంగిన యుద్ధనౌక..!

రష్యాకు ఈ యుద్ధంలో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్‌ సముద్ర డ్రోన్‌ జరిపిన దాడిలో ఓ యుద్ధ నౌక ఒరిగిపోయి కదలలేని స్థితికి చేరినట్లు తెలుస్తోంది. ఈ దాడి దృశ్యాలను కూడా ఉక్రెయిన్‌ మీడియా విడుదల చేసింది. 

Updated : 04 Aug 2023 15:33 IST

(source : @ukrpravda_news)

ఇంటర్నెట్‌డెస్క్‌: నల్ల సముద్రంలో రష్యాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. శుక్రవారం ఉదయం ఉక్రెయిన్‌కు చెందిన కిల్లర్‌ డ్రోన్‌ చేసిన దాడిలో రష్యా వాణిజ్య పోర్టు నోవోరోసిస్క్‌లో నౌకాదళానికి చెందిన ల్యాండింగ్‌ షిప్‌ ‘ఒలెనోగోర్స్కీ గోర్న్యాక్‌’ తీవ్రంగా దెబ్బతింది. దాడి తీవ్రతకు ఆ నౌక ఓ వైపు ఒరిగిపోయింది. నౌకాదళంతో సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ నిర్వహించామని ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ విభాగం వర్గాలు ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించాయి. ఈ కిల్లర్‌ సముద్ర డ్రోన్‌లో 450 కిలోల టీఎన్‌టీని అమర్చి ‘ఒలెనోగోర్స్కీ’పై దాడి చేసినట్లు తెలిపాయి. ఈ దాడి సమయంలో యుద్ధనౌకలో 100 మంది సిబ్బంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ‘‘ఈ దాడి దెబ్బకు రష్యా నౌక తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఇది పనిచేయలేని స్థితికి చేరింది’’ అని ఉక్రెయిన్‌ భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్‌ వార్తా సంస్థలు సోషల్‌ మీడియా ఖాతాల్లో ఉంచాయి. దీనిలో ఓ చిన్న పడవ భారీ యుద్ధనౌక వైపు దూసుకెళ్లి ఢీకొన్న దృశ్యాలున్నాయి.

రష్యాలోనే రెండో అతిపెద్ద వాణిజ్య పోర్టు..

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నౌకాశ్రయం తర్వాత రష్యాలో రెండో అతిపెద్ద వాణిజ్య రేవు నోవోరోసిస్క్‌.  ప్రపంచ చమురు మార్కెట్‌లోని 2 శాతానికి సమానమైన 18 లక్షల పీపాల క్రూడ్‌ ఈ నౌకాశ్రయం నుంచే ఎగుమతవుతుంది. ఈ నౌకాశ్రయంపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు రష్యా రెండు యుద్ధ నౌకలను మోహరించింది. వీటిల్లో ఒలెనోగోర్స్కీ,సువోరోవెట్స్‌ అనే నౌక ఉన్నట్లు భావిస్తున్నారు. గాల్లో దూసుకొచ్చే ఉక్రెయిన్‌ డ్రోన్లను కూల్చడమే దీని ప్రధాన విధి. ఈ నౌకపై రెండు ట్విన్‌ 57 ఎంఎం ఏకే 725 శతఘ్నులున్నాయి. దీనిని డ్రోన్లతో పోరాడేందుకు 2022లో బారెంట్స్‌ సముద్రంలోని రష్యా ఉత్తర దళం నుంచి నల్లసముద్రంలోకి తరలించారు.   

తొలిసారి రష్యా వాణిజ్య పోర్టుపై ఉక్రెయిన్‌ సముద్ర డ్రోన్‌ దాడి..!

శుక్రవారం తెల్లవారుజామున రెండు మానవరహిత డ్రోన్లు క్రస్నడోర్‌లోని నోవోరోసిస్క్‌ ఓడరేవులో దాడులు చేశాయని రష్యా పేర్కొంది. ఈ దాడులను తిప్పికొట్టామని వెల్లడించింది. తమకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ చెబుతోంది. తాజాగా ఆ యుద్ధ నౌకను పోర్టు నోవోరోసిస్క్‌ తీరానికి లాక్కెళ్లేందుకు కొన్ని నౌకలు శ్రమిస్తున్న వీడియో తాజాగా సోషల్‌మీడియాలో దర్శనమిచ్చింది. ఈ దాడి ఘటన కాస్పియన్‌ చమురు కన్షార్టియం పైపులైన్‌ వద్ద చోటు చేసుకొంది. ఈ పైపులైన్‌ కజకిస్థాన్‌ నుంచి నల్లసముద్రానికి చమురును సరఫరా చేస్తుంది. ఈ దాడి తర్వాత కొద్దిసేపు నౌకాశ్రయంలో కార్యకలాపాలను నిలిపివేశారు.

రష్యాను పీడిస్తున్న కిల్లర్‌ డ్రోన్ల భయం..

ఇప్పటికే ఉక్రెయిన్‌ కిల్లర్‌ సముద్ర డ్రోన్లు రష్యా నౌకలపై పలుమార్లు దాడులు చేశాయి. దూరం నుంచే వీటిని ఆపరేట్‌ చేసి దాడులకు దిగే అవకాశం ఉండటంతో.. ఇటీవల నల్లసముద్రంలోని ప్రధాన నౌకాదళ స్థావరమైన సెవస్టపోల్‌ నుంచి జలాంతర్గాములను ముందుజాగ్రత్తగా రష్యా నోవోరోసిస్క్‌  నౌకాశ్రయానికి తరలించింది.  

ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన తొలినాళ్లలో నల్ల సముద్రంపై రష్యా దళాలకు మాస్క్‌వా అనే యుద్ధ నౌక నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సముద్రంలో ఉక్రెయిన్‌కు చెందిన స్నేక్‌ ఐలాండ్‌ను ఇదే నౌక దాడి చేసి ఆక్రమించింది. కానీ, గతేడాది ఏప్రిల్‌లో ఉక్రెయిన్‌ దళాలు దీనిపై కచ్చితమైన గురితో క్షిపణులను ప్రయోగించాయి. దీనికి అమెరికా అందించిన ఇంటెలిజెన్స్‌ను ఉక్రెయిన్‌ సమర్థంగా వాడుకొందనే అనుమానాలున్నాయి. నాటి దాడిలో ఈ నౌక ఎంతగా దెబ్బతిందంటే.. తీరానికి లాగే లోపే సముద్రంలో మునిగిపోయింది. పదుల సంఖ్యలో సిబ్బంది కూడా చనిపోయినట్లు భావిస్తున్నారు. ఈ నౌకతోపాటే దీనిలో పెద్ద ఎత్తున భద్రపర్చిన ఆయుధాలు సముద్రం పాలయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్యలో తగిలిన అతిపెద్ద ఎదురు దెబ్బ ఇదే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు