Weapons in Space: అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా-రష్యా మాటల యుద్ధం

అంతరిక్షంలో ఆయుధాల నిరోధక అంశానికి సంబంధించి అమెరికా, రష్యా దేశాలు ఐరాసలో తీర్మానాలు ప్రవేశపెట్టాయి.

Updated : 21 May 2024 18:04 IST

ఐక్యరాజ్య సమితి: అంతరిక్షంలో ఆయుధాల నిరోధక అంశానికి సంబంధించి అగ్రరాజ్యం అమెరికా (USA), రష్యాల మధ్య కొన్ని నెలలుగా మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో వాషింగ్టన్‌పై మాస్కో మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. అంతరిక్షంలో ఆయుధాలు ఉంచాలని అమెరికా భావించిందని పేర్కొంది. ఐక్యరాజ్య సమితిలో రష్యా (Russia) తీర్మానాన్ని అమెరికా వీటోతో అడ్డుకున్న నేపథ్యంలో ఈవిధంగా స్పందించింది.

‘బాహ్య అంతరిక్షాన్ని ఆయుధరహిత ప్రాంతంగా చూడటం అమెరికా నిజమైన ప్రాధాన్యం కాదని, అక్కడ ఆయుధాలను ఉంచడం, సైనిక ఘర్షణకు వేదికగా మార్చడమే లక్ష్యంగా ఉన్నాయని మరోసారి నిరూపించారు’ అని రష్యా విదేశాంగ అధికార ప్రతినిధి మారియా జకరోవా ఆరోపించారు.

ఆ రక్తంతో వేల మందికి హెచ్‌ఐవీ.. ఏంటీ ‘రక్తం కుంభకోణం’?

అంతరిక్షంలో ఉపగ్రహ విధ్వంసకర ఆయుధాన్ని రష్యా రహస్యంగా అభివృద్ధి చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని అగ్రరాజ్యం గతంలోనే ఆరోపించింది. ఈ క్రమంలోనే గత వారం మాస్కో ఓ ఉపగ్రహాన్ని పంపించిందని.. అది ఆ ఆయుధమేనని తెలిపింది. అయితే, అవి నిరాధార ఆరోపణలని తోసిపుచ్చిన రష్యా.. అటువంటి వ్యవస్థ తమ వద్ద లేదని తెలిపింది. అంతేకాకుండా అమెరికా వద్దే అటువంటి ఆయుధాలు ఉన్నాయంటూ దీటుగా స్పందించింది.

ఈ క్రమంలోనే అంతరిక్షంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక తీర్మానాలను ఐరాస భద్రతా మండలిలో ఈ రెండు దేశాలు ప్రతిపాదించాయి. అమెరికా తీర్మానాన్ని చైనా మద్దతుతో రష్యా ఇటీవల అడ్డుకోగా.. తాజాగా మాస్కో ప్రతిపాదనను అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలు వీటో చేశాయి. దీనిపై స్పందించిన రష్యా.. అణ్వాయుధాలపైనే అమెరికా దృష్టి సారించిందని, అంతరిక్షంలో ఆయుధాలను పూర్తిగా నిషేధించడంపై ఆ దేశం ఆసక్తి చూపడం లేదని విమర్శించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని