UK Blood scandal: ఆ రక్తంతో వేల మందికి హెచ్‌ఐవీ.. ఏంటీ ‘రక్తం కుంభకోణం’?

దేశ ఆరోగ్య విభాగం చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఘటనగా నిలిచిన కలుషిత రక్తం ఉదంతంపై బ్రిటన్‌ ప్రభుత్వం తాజా నివేదిక విడుదల చేసింది.

Updated : 20 May 2024 19:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాలుగు దశాబ్దాల క్రితం బ్రిటన్‌లో వెలుగుచూసిన ‘రక్తం కుంభకోణం’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. కలుషిత రక్తాన్ని ఎక్కించిన కారణంగా వేలాదిమంది హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ బారినపడిన ఈ దారుణ పరిణామానికి సంబంధించి తుది నివేదిక వెల్లడైంది. బ్రిటన్‌ ఆరోగ్య విభాగం చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఘటనగా నిలిచిన ఆ ఉదంతంపై అక్కడి ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించింది.

అసలేం జరిగింది..?

రక్తం గడ్డకట్టే సామర్థ్యం లేని ‘హిమోఫిలియా’ వ్యాధి బాధితుల కోసం బ్రిటన్‌ ప్రభుత్వం 1970 దశకంలో కొత్త (blood plasma) చికిత్సను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి ఫ్యాక్టర్‌ VIII పేరుతో రూపొందించిన రక్తాన్ని బ్రిటన్‌ ఆరోగ్య కేంద్రం (నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌) అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. దీన్ని రక్తమార్పిడి అవసరమైన వేలాది మంది బాధితులకు అందించారు. అయితే, ఈ చికిత్స తీసుకున్న కొన్నేళ్ల తర్వాత అనేక మందిలో దుష్ర్పభావాలు కనిపించడం మొదలైంది.

3 వేల మంది మృతి..

ఫ్యాక్టర్‌ VIII చికిత్స తీసుకున్న అనేకమంది కాలేయ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నట్లు గుర్తించారు. కొన్నేళ్ల తర్వాత అది ‘హెచ్‌ఐవీ (1980ల్లో దాన్ని ఎయిడ్స్‌కు కారక వైరస్‌గా గుర్తించారు)’, ‘హెపటైటిస్‌-సీ’గా నిర్ధరించారు. బాధితుల సంఖ్య 30 వేలకు పైగా ఉన్నట్లు అంచనా. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఇన్‌ఫెక్షన్‌కు గురైనవారిలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గుర్తించారు. ఇలా కొన్నేళ్లలోనే దాదాపు 3వేల మంది బాధితులు చనిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి. దేశ ఆరోగ్య చరిత్రలో ఇదో అతిపెద్ద ‘రక్తం కుంభకోణం’గా దీన్ని పేర్కొంటున్నారు.

రక్తం కలుషితం..

ఫ్యాక్టర్‌ VIII చికిత్సకు ఉపయోగించిన రక్తంలో ఖైదీలతో పాటు మత్తు బానిసలు వంటి ప్రమాదకర దాతల నుంచి స్వీకరించిన ప్లాస్మాను ఫార్మా కంపెనీలు వినియోగించినట్లు గుర్తించారు. ఇలా వేల మంది దాతల నుంచి గ్రహించిన ప్లాస్మా కావడం.. అందులో ఒక్కరికి ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా అనేకమందికి సోకే ప్రమాదం ఉందని గ్రహించారు. ప్రసవం, సర్జరీలు, ప్రమాదాల బారినపడిన రోగులకు ఈ కలుషిత రక్తం, ప్లాస్మా ఉత్పత్తులు ఎక్కించడం ద్వారా అనేకమంది హెచ్‌ఐవీ, హెపటైటిస్ బారిన పడినట్లు తేలింది.

ముందస్తు హెచ్చరికలు చేసినా..

అనేక మంది నుంచి సేకరించిన ప్లాస్మాను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవద్దని 1953లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. అయినప్పటికీ.. బ్రిటన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి చికిత్సకు అవసరమైన ప్లాస్మాను దిగుమతి చేసుకొందనే ఆరోపణలు వచ్చాయి. ఆ రక్తం కలుషితమైందని ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పటికీ.. అందుకు ఆధారాలు లేవని బ్రిటన్‌ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసింది. ముప్పు గురించి కూడా బాధితులకు అందించలేదు. వారికి సరైన చికిత్స, సహాయం అందించడంలోనూ ప్రభుత్వం విఫలమైందనే వాదన ఉంది. అంతేకాకుండా కలుషిత రక్తం ఉదంతాన్ని అప్పటి ప్రభుత్వాలు, అధికారులు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని బాధితులు ఆరోపించారు.

ఈ వైద్య నిర్లక్ష్యం గురించి వాస్తవాలు బయటపెట్టాలని.. పరిహారం ఇవ్వాలని 1980 నుంచీ బాధితులు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. చివరకు 2017లో ప్రధాని థెరిసా మే నేతృత్వంలోని ప్రభుత్వం.. పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. దాదాపు 5వేల మంది బాధితులు, సాక్షుల నుంచి వివరాలు సేకరించి నివేదిక రూపొందించింది. తాజా పరిణామంపై బాధితులు హర్షం వ్యక్తంచేశారు. తమ ఆత్మీయులను గుర్తుచేసుకుంటూ.. ఫ్లకార్డులు ప్రదర్శించారు. ‘సత్యం గెలిచిన రోజు’ అంటూ 1500 మంది బాధితుల తరఫున పోరాటం చేసిన డెస్‌ కొల్లిన్స్‌ అనే న్యాయవాది పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని