Kim Jong Un: సరిహద్దుల్లో సూదిమొనంత ఆక్రమించినా సహించం: కిమ్‌

సరిహద్దుల్లో అతి చిన్న ఆక్రమణను సైతం తీవ్రంగా పరిగణిస్తామని కిమ్‌ హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కొరియాను అతిపెద్ద శత్రువుగా ప్రకటించారు.  

Updated : 16 Jan 2024 12:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సరిహద్దుల్లో సూదిమొనంత స్థలం ఆక్రమించినా దక్షిణ కొరియా యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్ (Kim Jong Un) హెచ్చరించారు. ఉభయ కొరియాల మధ్య పునరేకీకరణ, సహకారం కోసం ఏర్పాటుచేసిన ఏజెన్సీలను ఆయన రద్దు చేశారు. ఇరు దేశాల మధ్య సముద్ర సరిహద్దులను, నార్తర్న్‌ లిమిట్‌ లైన్‌ను గుర్తించబోమని ఆయన తేల్చి చెప్పారు. సియోల్‌ను యుద్ధంలో ఆక్రమించుకునేలా రాజ్యాంగ సవరణలు చేయాలని సూచించారు. ఈ విషయాన్ని ఉత్తర కొరియాకు చెందిన ది కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. 

పశ్చిమాసియా గడ్డపై మరో ఘర్షణ.. ఇరాక్‌పై ఇరాన్‌ క్షిపణి దాడి

ఉత్తర కొరియాలోని సుప్రీం పీపుల్స్‌ అసెంబ్లీలో కిమ్‌ ప్రసంగిస్తూ దక్షిణ కొరియాను అతిపెద్ద శత్రువుగా పేర్కొంటూ చట్టాల్లో మార్పులు చేయాలన్నారు. పునరేకీకరణ కోరడం అతిపెద్ద తప్పుగా ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘కొరియా ద్వీపకల్పంలోని సియోల్‌ను పూర్తిగా ఆక్రమించుకొని లొంగదీసుకొనేలా అనుమతిలిస్తూ చట్ట సవరణలు చేయాలని నా అభిప్రాయం. రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా (దక్షిణ కొరియా) మా భూమి, సముద్ర, గగనతలాల్లో 0.001 మి.మీ. సరిహద్దు అతిక్రమణకు పాల్పడినా.. దానిని యుద్ధ కవ్వింపుగానే పరిగణిస్తాము’’ అని కిమ్‌ ప్రకటించారు. పునరేకీకరణ ఎప్పటికీ సాధ్యం కాదని కిమ్‌ అభిప్రాయపడుతున్నట్లు కేసీఎన్‌ఏ వార్తా సంస్థ వెల్లడించింది. తమ పూర్వీకులు ఈ దిశగా చేసిన ప్రతి పనిని ఆయన నిలిపివేస్తున్నారు.

ఈ ఏడాది నూతన సంవత్సర వేళ కూడా కిమ్‌ ఉభయ కొరియాల పునరేకీకరణ సాధ్యం కాదని వెల్లడించారు. అమెరికా, దక్షిణ కొరియాలు కవ్విస్తే వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని కోరారు. మరోవైపు ఉ.కొరియా ఆయుధ పరీక్షలను కూడా వేగవంతం  చేసింది. ఆదివారం హైపర్‌ సోనిక్‌ క్షిపణిని పరీక్షించినట్లు ప్రకటించింది. కొన్నాళ్ల క్రితం దక్షిణ కొరియా దిశగా లైవ్‌ ఫైర్‌ డ్రిల్స్‌ కూడా నిర్వహించింది. నిఘా ఉపగ్రహాన్ని కూడా ఆ దేశం ప్రయోగించడం అమెరికా, దక్షిణ కొరియా దేశాలకు తలనొప్పిగా మారింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని