nuclear weapons deal: అమెరికా-దక్షిణ కొరియాల మధ్య అణ్వస్త్ర డీల్‌..!

అమెరికా-దక్షిణ కొరియా మధ్య కీలకమైన అణు ఒప్పందం జరిగింది. ఇది కొరియా ద్వీపకల్పంలో వివాదాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.  

Published : 27 Apr 2023 20:23 IST

 

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా(US)-దక్షిణ కొరియా(South Korea) మధ్య అత్యంత కీలకమైన ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌ కింద ఉత్తర కొరియాను అదుపు చేసేందుకు అమెరికా అణ్వాయుధాలతో కూడిన జలాంతర్గామిని దక్షిణకొరియా తీరంలో మోహరించనుంది. దీంతోపాటు సియోల్‌ నూక్లియర్‌ ప్లానింగ్‌ ఆపరేషన్స్‌లో భాగం కానుంది. దీనికి బదులుగా దక్షిణ కొరియా సొంతంగా అణ్వాయుధాలు తయారు చేయాలనుకొన్న ప్రణాళికలను వదులుకోనుంది. దీనిని ‘వాషింగ్టన్‌ డిక్లరేషన్‌’గా వ్యవహరిస్తున్నారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాట్లాడుతూ ‘‘ఈ ఒప్పందం వల్ల ఉత్తరకొరియాను నిలువరించే క్రమంలో భాగస్వాముల మధ్య సమన్వయం పెరుగుతుంది’’  అని వ్యాఖ్యానించారు. 

ఇప్పటికే ఉన్న ఒప్పందాల ప్రకారం యుద్ధ సమయాల్లో దక్షిణ కొరియాను రక్షించాల్సిన బాధ్యత అమెరికాపై ఉంది. దీనికి తోడు అవసరమైన సమయంలో అమెరికా అణ్వాయుధాలను వినియోగిస్తానని కూడా హామీ ఇచ్చింది. కానీ, దక్షిణ కొరియాలోని కొన్ని వర్గాలు అమెరికా మాటలను నమ్మడంలేదు. ఈ నేపథ్యంలో సొంతంగా అణ్వస్త్రాలను అభివృద్ధి చేసుకోవాలనే డిమాండ్‌ మొదలైంది. మరోవైపు ఉత్తరకొరియా కూడా అణుబాంబులను అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా - దక్షిణ కొరియా మధ్య వాషింగ్టన్‌ డిక్లరేషన్‌ జరగటం గమనార్హం.

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూ సుక్‌ యోల్‌ శ్వేత సౌధంలో మాట్లాడుతూ ‘‘వాషింగ్టన్‌ డిక్లరేషన్‌ రూపంలో దక్షిణ కొరియాకు అద్భుతమైన హామీ లభించింది’’ అని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య కొన్ని నెలల పాటు జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. మరోవైపు ఈ ఒప్పందాన్ని చైనా తీవ్రంగా విమర్శించింది. ఈ ఒప్పందం ‘‘ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలను పెంచి, వివాదాలను ముదిరేలా చేస్తుంది’’ అని పేర్కొంది. 

అమెరికా వద్ద 14 ఒహాయో శ్రేణి అణుశక్తి బాలిస్టిక్‌ మిసైల్‌ సబ్‌మెరైన్లు ఉన్నాయి. వీటిల్లో 8 వాషింగ్టన్‌ రాష్ట్రంలో ఉండగా.. మిగిలిన ఆరు జార్జియా వద్ద సముద్ర జలాల్లో ఉన్నాయి. ఈ సబ్‌మెరైన్లకు బూమర్స్‌ అనే నిక్‌నేమ్‌ ఉంది. ఈ సబ్‌మెరైన్‌ 77 రోజుల పాటు నీటిలో ఉండేలా డిజైన్‌ చేశారు. దీనిలో విధులు నిర్వహించేందుకు బ్లూ, గోల్డ్‌ అనే రెండు బృందాల సిబ్బంది ఉంటారు. ఈ సబ్‌మెరైన్‌ అత్యధికంగా 20 ట్రైడెంట్‌-2 బాలిస్టిక్‌ క్షిపణులను తీసుకెళ్లగలదు. ఈ క్షిపణులు 7,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని