US on Indian Elections: ‘భారత ప్రజలు, ప్రభుత్వానికి అభినందనలు’.. లోక్‌సభ ఎన్నికలపై అమెరికా స్పందన

US on Indian Elections: భారత్‌లో లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలు, ప్రభుత్వానికి అమెరికా అభినందనలు తెలియజేసింది.

Published : 05 Jun 2024 08:52 IST

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. స్పష్టమైన ఆధిక్యంతో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారాన్ని చేపట్టనుంది. ప్రధానమంత్రి మోదీ మరోసారి పాలనా పగ్గాలు అందుకోనున్నారు. ఈ సందర్భంగా మన దేశ ప్రజలు, ప్రభుత్వానికి అమెరికా అభినందనలు తెలియజేసింది.

‘‘భారీ ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన భారత ప్రభుత్వాన్ని, అందులో పాల్గొన్న ఓటర్లను అభినందిస్తున్నాం. గెలుపోటములపై మేం స్పందించబోం. అది మా విదేశాంగ విధానం. ఎవరు గెలిచినా భారత ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగుతాయని ఆశిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ అభిప్రాయపడ్డారు. భారత ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకున్నాయనే ఆరోపణలను కొట్టిపారేశారు. ఆయా దేశాల్లోని పరిణామాలపై తాము సందర్భానుసారంగా స్పందిస్తామని తెలిపారు. అంతమాత్రాన అది జోక్యం చేసుకోవడం కాదని చెప్పారు.

‘ఇండియా’ మెరిపించినా.. ఎన్డీయేకే పీఠం

మిల్లర్‌ మంగళవారం మీడియాతో మాట్లాడే సమయానికి భారత్‌లో ఎన్నికల ఫలితాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఆయన విజేతలకు శుభాకాంక్షలు తెలపడానికి నిరాకరించారు. తుది ప్రకటన వెలువడే వరకు ఫలితాలపై స్పందించబోమని స్పష్టం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ, ఎన్డీయే కూటమికి ‘యూఎస్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌’ అభినందనలు తెలియజేసింది. ఈ సందర్భంగా భారత ప్రజలకు శుభకాంక్షలు చెప్పింది. భారత్‌ - అమెరికా మధ్య వ్యాపార, వాణిజ్యం బంధాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

భారత ఎన్నికల సంఘం తుది ఫలితాలను బుధవారం తెల్లవారుజామున ప్రకటించింది. అధికార భాజపా 240, కాంగ్రెస్‌ 99 స్థానాల్లో గెలుపొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని