Moscow: మాస్కోలో ఉగ్రదాడి ఘటన.. నెలక్రితమే హెచ్చరించిన అమెరికా

Moscow Shooting: మాస్కోలోని సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి గురించి అగ్రరాజ్యం అమెరికా నెల క్రితమే రష్యాను హెచ్చరించిందట. ఈ మేరకు శ్వేతసౌధం వెల్లడించింది.

Updated : 23 Mar 2024 10:13 IST

వాషింగ్టన్‌: రష్యా (Russia) రాజధాని మాస్కో (Moscow)లో జరిగిన భీకర ఉగ్రదాడి (Terror Attack)తో యావత్‌ ప్రపంచం ఉలిక్కిపడింది. క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాల్‌లోకి ముష్కరులు జరిపిన కాల్పుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించుకుంది. అయితే, ఈ ఘటనపై అగ్రరాజ్యం అమెరికా (USA).. గతంలోనే రష్యాను హెచ్చరించడం గమనార్హం.

మాస్కో ఘటనపై వైట్‌హౌస్‌ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి అడ్రియెన్నీ వాట్సన్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘మాస్కోలో ప్రణాళికాబద్ధమైన ఉగ్రదాడి జరిగే అవకాశముందని దాదాపు నెల రోజుల క్రితం అమెరికా ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. కాన్సర్ట్‌లు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలను లక్ష్యంగా ఈ దాడులు జరగొచ్చని తెలిసింది. ఈ సమాచారాన్ని వాషింగ్టన్‌ వెంటనే రష్యా అధికారులతో పంచుకుంది. సామూహిక హత్యలు, కిడ్నాప్‌ల వంటి ముప్పుల గురించి నిఘా వర్గాల నుంచి సమాచారం అందిన వెంటనే అమెరికా ఆ దేశాలను అలర్ట్‌ చేస్తుంది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ పాలసీని బైడెన్‌ సర్కారు విధిగా పాటిస్తోంది’’ అని వాట్సన్‌ వెల్లడించారు.

సంగీత కచేరీలో ముష్కరుల కాల్పులు.. 60 మంది మృతి

రష్యాకు అండగా ఉంటాం: మోదీ

ఈ ఉగ్రదాడి ఘటనను భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) తీవ్రంగా ఖండించారు.  ఈ విపత్కర పరిస్థితుల్లో రష్యా ప్రజలకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. బాధిత కుటుంబాలు త్వరగా ఈ బాధ నుంచి బయటపడాలని, క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షించారు.

శుక్రవారం రాత్రి మాస్కోలోని అతిపెద్ద కాన్సర్ట్‌ హాల్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సాయుధ ముష్కరులు హాల్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 145 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపే వారు పారిపోయారు. దుండుగుల్లో ఒకరిని పట్టుకున్నట్లు సమాచారం. గత రెండు దశాబ్దాల్లో రష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి ఇది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని