USA: కారు రివర్స్‌మోడ్‌లో పెట్టడంతో కంపెనీ సీఈవో మృతి..!

అమెరికాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రముఖ కంపెనీ సీఈవో మరణించారు. ఆమె వినియోగించిన టెస్లాకారు కిటికీ విండో అత్యంత బలంగా ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడటానికి అవకాశమే లభించలేదని భావిస్తున్నారు. 

Updated : 10 Mar 2024 11:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కారు మోడ్‌ను పొరబాటున మార్చడంతో అమెరికాలోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన మహిళా సీఈవో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని సంపన్నుల్లో ఒకరైన చావో కుటుంబానికి చెందిన ఏంజెలా (50) ప్రముఖ షిప్పింగ్‌ కంపెనీ ఫార్‌మోస్ట్‌ గ్రూప్‌నకు సీఈవోగా పనిచేస్తున్నారు. ఆమెకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. శుక్రవారం రాత్రి ఆమె హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లోని స్నేహితురాళ్లతో కలిసి టెక్సాస్‌లోని ఆస్టిన్‌ సమీపంలోని తన ప్రైవేటు అతిథి గృహానికి వెళ్లారు. దాదాపు 900 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. మిల్లర్‌ సెలయేరు ఇక్కడి నుంచి ప్రవహిస్తుంటుంది.  ఓ రెస్టారెంట్‌లో రాత్రి వరకు గడిపి తిరిగి ప్రధాన భవనానికి బయల్దేరారు. 

మార్గం మధ్యలో ఒక త్రీపాయింట్‌ టర్న్‌ వచ్చింది. దానిని దాటే క్రమంలో.. ఏంజెలా పొరబాటున తన టెస్లా ఎక్స్‌ ఎస్‌యూవీ కారును రివర్స్‌ మోడ్‌లోకి మార్చారు. అంతే అది వేగంగా వెనక్కి వెళ్లి ఓ కొలనులో బోల్తాపడింది. వెంటనే తన స్నేహితురాలికి ఆమె భయంతో ఫోన్‌ చేశారు. కానీ, వాహనం తిరగబడటంతో వేగంగా నీటిలో మునిగిపోయింది. దీంతో ఆమె స్నేహితురాలు, అతిథి గృహం మేనేజర్‌, పోలీసులు అక్కడికి చేరుకొని ఏంజెలాను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. 

నెతన్యాహుపై బైడెన్‌ ఆగ్రహం

కానీ, ఆమె వాడుతున్న టెస్లాకారులో అత్యంత బలమైన గ్లాస్‌ను వినియోగించడంతో కిటికి బద్దలు కొట్టడం అసాధ్యంగా మారింది. దీనికి తోడు షాక్‌ కొడుతుందనే భయాలు సహాయకుల్లో నెలకొన్నాయి. ఎట్టకేలకు మరో వాహనం సాయంతో కారును నీటి బయటకు తీసి చూడగా.. అప్పటికే ఏంజెలా నిర్జీవంగా కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీరు వెంచర్‌ క్యాపిటలిస్టు జిమ్‌ బ్రెయార్‌కు ఏంజెలా భార్య. అమెరికా మాజీ రవాణాశాఖా మంత్రి ఎలాయినే చావోకు ఆమె సోదరి. సెనెటర్‌ మిట్చ్‌ మెక్‌కొన్నెల్లేకు మరదలు వరుస అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని