Gaza: 38 వేల ఆహార పొట్లాలు జారవిడిచి..! గాజాకు అమెరికా సాయం షురూ

ఆకలితో అలమటిస్తోన్న గాజావాసులకు ఉపశమనంగా సైనిక రవాణా విమానాల సాయంతో అమెరికా మొదటిసారి 38 వేల ఆహార పొట్లాలను జారవిడిచింది.

Published : 02 Mar 2024 22:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌ భీకర దాడుల (Israel Hamas Conflict)తో గాజాలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు ఆరు లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని ఐరాస ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో గాజావాసులకు ఉపశమనం కల్పించేందుకు అమెరికా (USA) రంగంలోకి దిగింది. మూడు సీ-130 సైనిక రవాణా విమానాల సాయంతో మొదటిసారి దాదాపు 38 వేల ఆహార పొట్లాలను జారవిడిచింది. ఇటీవల గాజా సిటీలో సాయం కోసం ఎదురు చూస్తోన్న అమాయకులపై ఇజ్రాయెల్‌ బలగాలు జరిపిన కాల్పుల్లో 100 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్‌ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

గాజాలో ఆకలి కేకలు.. బైడెన్‌ కీలక నిర్ణయం

‘‘ఈ క్లిష్ట పరిస్థితుల్లో గాజాకు మానవతా సాయం ఎంతో అవసరం. దాన్ని అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఈ క్రమంలోనే జోర్డాన్‌ సమన్వయంతో ఆహార పొట్లాల పంపిణీ ప్రారంభించారు. ఇది నిరంతర ప్రక్రియ అని వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ల్యాండింగ్‌, దాదాపు 19 టన్నుల బరువు మోసుకెళ్లగల సామర్థ్యం కారణంగా మారుమూల ప్రాంతాలకు సహాయక సామగ్రి చేరవేతలో ‘సీ-130’ విమానాలను అమెరికా విస్తృతంగా ఉపయోగిస్తోంది. గతంలో అఫ్గానిస్థాన్‌, ఇరాక్‌, హైతీ తదితర దేశాల్లో సహాయ కార్యక్రమాలకు వినియోగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని