USA: కొన్ని దశాబ్దాల తర్వాత.. ద.కొరియాలో లంగరేసిన అణు క్షిపణుల జలాంతర్గామి..!

అమెరికా (USA) అణు క్షిపణులను ప్రయోగించే ఓ భారీ సబ్‌మెరైన్‌ కొన్ని దశాబ్దాల తర్వాత దక్షిణ కొరియా (South Korea)లో లంగరేసింది. 

Published : 18 Jul 2023 15:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరగడంతో అమెరికా (USA) బలగాల కదలికలు కూడా ఎక్కువయ్యాయి. తాజాగా అణుక్షిపణులను ప్రయోగించే సామర్థ్యమున్న అమెరికా జలాంతర్గామి దక్షిణ కొరియా(South Korea)ను సందర్శించింది. 1980ల తర్వాత ఒక ఎస్‌ఎస్‌బీఎన్‌ ఆ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి. ఉత్తర కొరియా అణుదాడి చేస్తే ప్రతిస్పందించాల్సిన తీరుపై అమెరికా మిత్రపక్షాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ విషయాన్ని శ్వేతసౌధం ఇండో-పసిఫిక్‌ సమన్వయకర్త కుర్ట్‌ క్యాంప్‌బెల్‌ సియోల్‌లో ధ్రువీకరించారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, ద.కొరియా ప్రెసిడెంట్‌ యొన్‌ సుక్‌ యోల్‌ సంయుక్త ప్రకటనకు అనుగుణంగా ఈ ఎస్‌ఎస్‌బీఎన్‌ సందర్శన జరిగింది.

ఒక్క అక్షరం ఎంత పనిచేసింది.. అమెరికా రహస్యాలు రష్యా మిత్రదేశం చేతికి..!

‘‘అమెరికా సబ్‌మెరైన్‌ బుసాన్‌ పోర్టులో నేడు నిలిచింది. కొన్ని దశాబ్దాల తర్వాత జరిగిన అమెరికన్‌ న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ పర్యటన ఇది’’ అని క్యాంప్‌బెల్‌ తెలిపారు. ఆయన సియోల్‌లో న్యూక్లియర్‌ కన్సల్టేటీవ్‌ గ్రూప్‌ సమావేశానికి వచ్చిన సందర్భంగా ఈ విషయం వెల్లడించారు. దక్షిణ కొరియా రక్షణకు అమెరికా కట్టుబడి ఉందని చెప్పేందుకే తన పర్యటన అని ఆయన పేర్కొన్నారు. ఉత్తర కొరియా నుంచి ఇటీవల కాలంలో కవ్వింపు చర్యలు పెరగడంతో అమెరికా వైపు నుంచి స్పందన తీవ్రత పెరుగుతోందనడానికి ఇది నిదర్శనంగా నిలిచింది. 

అమెరికా నౌకాదళంలో అత్యంత శక్తిమంతమైన ఒహయో శ్రేణికి చెందిన యూఎస్‌ఎస్‌ కెంటకీ బుసాన్‌ రేవులో లంగరేసింది. ఇది 20 ట్రైడెంట్‌ 2 డీ5 క్షిపణులను ప్రయోగించగలదు. ఒక్కో క్షిపణి 8 వార్‌ హెడ్‌లను 12వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై ప్రయోగించగలవు. సాధారణంగా అణు క్షిపణులను ప్రయోగించే సబ్‌మెరైన్లు విదేశీ రేవుల్లో బహిరంగంగా లంగర్‌ వేయవు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని