Qatar: మరో పదేళ్లు పశ్చిమాసియాలోనే అమెరికా పాగా..!

అమెరికా (USA) సేనలు పశ్చిమాసియాలోనే మరో పదేళ్లు కొనసాగనున్నాయి. ఈ మేరకు ఖతార్‌ (Qatar)లోని స్థావరాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. 

Updated : 03 Jan 2024 11:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా (USA) మరో పదేళ్లపాటు పశ్చిమాసియాలోనే కొనసాగనుంది. ఇందుకోసం నిశ్శబ్దంగా ఏర్పాట్లు చేసుకొంది. ఈ మేరకు ఖతార్‌(Qatar)లోని తమ భారీ సైనిక స్థావరాన్ని మరో పదేళ్ల పాటు కొనసాగించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని అమెరికా పత్రికలు వెల్లడించాయి. అయితే.. దీనిపై అమెరికా, ఖతార్‌ ఇప్పటి వరకూ ఎలాంటి బహిరంగ ప్రకటనా చేయలేదు. పశ్చిమాసియాలో దోహాకు వాషింగ్టన్‌ ఇచ్చే ప్రాధాన్యం ఈ ఒప్పందంతోనే తెలిసిపోతోంది. కొన్నాళ్ల క్రితం గాజాలో బందీలుగా ఉన్న అమెరికన్లను విడిపించడంలో కూడా ఖతార్‌ కీలక పాత్ర పోషించింది.

వేల భవనాలు, కార్లు ధ్వంసం

అమెరికాకు చెందిన అల్‌ ఉదీద్‌ ఎయిర్‌ బేస్‌ వాయువ్య దోహాలోని ఎడారి ప్రాంతంలో ఉంది. పశ్చిమాసియాలో అమెరికాకు ఇదే అతిపెద్ద సైనిక స్థావరం. దీనిలో 10,000 మంది సైనికులను మోహరించింది. వాషింగ్టన్‌ గగనతల ఆపరేషన్లకు ఇది కీలకం. ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌, పశ్చిమాసియాపై ఇక్కడి నుంచే కన్నేసి ఉంచుతుంది. ఎర్ర సముద్రంలో ఇరాన్, హౌతీల ముప్పు పెరగడంతో అమెరికా మరికొన్నాళ్లు ఈ ప్రాంతంలో బలమైన స్థావరం ఉండాలని కోరుకుంటోంది. గత నెల అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఈ స్థావరాన్ని సందర్శించి.. ఖతార్‌కు ధన్యవాదాలు తెలిపారు. కానీ, స్థావరం పొడిగింపుపై నోరు మెదపలేదు. హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో ఇరుపక్షాల కాల్పుల విరమణ చర్చలకు దోహా వేదికగా నిలిచింది. తాజాగా హమాస్‌ రాజకీయ నాయకులు ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఎయిర్‌ బేస్‌ పొడిగింపుపై ఆస్టిన్‌ మౌనం వహించినట్లు తెలుస్తోంది.

అతిపెద్ద యుద్ధ నౌకను వెనక్కి పిలిపించిన అమెరికా..! 

మధ్యధరా సముద్రంలో అమెరికా మోహరించిన అతిపెద్ద విమాన వాహక నౌక గెరాల్‌ ఆర్‌ ఫోర్డ్‌ తిరుగు ప్రయాణమైంది. అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి జరిగిన తర్వాత అమెరికా ఈ నౌకను మధ్యధరా సముద్రం తూర్పు ప్రాంతానికి తరలించింది. తమ గ్లోబల్‌ ఫోర్స్‌ అవసరాలను తిరిగి విశ్లేషించుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అమెరికా సిక్స్త్‌ ఫ్లీట్‌ వెల్లడించింది. ఈ యుద్ధ నౌక బరువు లక్ష టన్నులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని