వేల భవనాలు, కార్లు ధ్వంసం

జపాన్‌ పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసిన భూకంపం తాకిడికి ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 55కు చేరింది. తీవ్రంగా గాయపడినవారు 17 మంది ఉన్నారు.

Updated : 03 Jan 2024 22:25 IST

జపాన్‌ పశ్చిమతీరాన్ని అతలాకుతలం చేసిన భూకంపం
55కు చేరిన మృతుల సంఖ్య

వాజిమా: జపాన్‌ పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసిన భూకంపం తాకిడికి ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 55కు చేరింది. తీవ్రంగా గాయపడినవారు 17 మంది ఉన్నారు. వేలాది భవనాలు, వాహనాలు, బోట్లు ధ్వంసమయ్యాయి. మరిన్ని బలమైన కంపనాలు సంభవించే అవకాశం ఉందని ఎవరూ ఇళ్లలో ఉండరాదంటూ కొన్ని ప్రాంతాల్లో అధికారులు మంగళవారం ప్రజలను హెచ్చరించారు. భూకంపం అనంతరం కొనసాగే భూప్రకంపనలు ఇషికవా రాష్ట్రంలోని ఇషికవా నగరం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రంగా కొనసాగాయి. మృతులంతా ఇషికవా రాష్ట్ర వాసులు కావడం గమనార్హం. అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సౌకర్యం, నీటి సరఫరా, సెల్‌ఫోన్‌ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదు.

సోమవారమే 155 ప్రకంపనలు

జపాన్‌లో భూకంపానికి సంబంధించి కీలక విషయాలు మెల్లగా వెల్లడవుతున్నాయి. ఒక్క సోమవారమే దేశంలో తీవ్రమైన 155 ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు. రిక్టర్‌ స్కేల్‌పై వీటి తీవ్రత 3-7.6 మధ్యలో నమోదైంది. మంగళవారం కూడా ఆరు సార్లు భూమి కంపించింది.  భవనాలు కూలడం, అగ్నిప్రమాదాల కారణంగానే అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయినట్లు జపాన్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. ఇక నీగట, టొయామ, ఫుకూయ్‌, గిఫూ నగరాల్లో క్షతగాత్రులను గుర్తించారు. 45 వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

అసైచి వీధిలో 200 కట్టడాలు దగ్ధం..

పర్యాటక ప్రదేశమైన వాజిమా నగరంలోని అసైచి వీధిలో భూకంపం కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రాంతం కేవలం 280 చదరపు మీటర్లలోనే ఉండటంతో అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. మంటల ధాటికి 200 భవనాలు కాలిపోయాయి. ఈ విషయాన్ని జపాన్‌ పబ్లిక్‌ బ్రాడ్‌కాస్టర్‌ ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. ఈ నగరంలోనే ఇప్పటివరకు 14 మరణాలు నమోదయ్యాయి. కొన్ని భవనాలు ఇప్పటికీ మంటల్లోనే ఉన్నాయి. ఈ నగరంలో 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. నగరానికి వచ్చే ప్రధాన రహదారులన్నీ బీటలు వారి.. వాహనాలు కదలడం అసాధ్యంగా మారింది.

  • ఇక సుజు ప్రాంతంలో 50కి పైగా భవనాలు కూలిపోయాయని అధికారులు ధ్రువీకరించారు. వీటిల్లో ఓ ప్రార్థనా మందిరం కూడా ఉంది. ఇక్కడి పోర్టును సునామీ అలలు తాకడంతో చాలా పడవలు బోల్తాపడ్డాయి.
  • షికా ప్రాంతంలో సోమవారం అత్యధికంగా 7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇక్కడ టోగి వైద్యశాల భవనం ధ్వంసమైంది. చాలా ఇళ్లు కూలిపోయాయి.
  • హిమి ప్రాంతంలో అత్యధికంగా కర్రలతో నిర్మించిన ఇళ్లు ఉంటాయి. తాజాగా వచ్చిన భూకంపంలో ఇవి చాలా వరకు దెబ్బతిన్నాయి.
  • మరోవైపు అర్ధంతరంగా నిలిపివేసిన నాలుగు బుల్లెట్‌ రైళ్ల సేవలను జపాన్‌ పునరుద్ధరించింది. వీటి కారణంగా దాదాపు 1,400 మంది చిక్కుకుపోయారు. ఈ రైళ్లు టొయమా స్టేషన్‌, కంజావా స్టేషన్ల మధ్య చిక్కుకున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని