CAA: పౌరసత్వ చట్టంపై అమెరికా కీలక వ్యాఖ్యలు

CAA: భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం కల్పించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన సీఏఏ అమలుకు కేంద్రం ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా అమెరికా స్పందించింది.

Updated : 15 Mar 2024 09:03 IST

వాషింగ్టన్‌: పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు కోసం భారత్‌ ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్‌పై అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశం తమని ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొంది. దీన్ని ఎలా అమలు చేయనున్నారో నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ గురువారం అన్నారు.

‘‘మార్చి 11న వచ్చిన సీఏఏ నోటిఫికేషన్‌పై మేం ఆందోళన చెందుతున్నాం. దీన్ని ఎలా అమలు చేయనున్నారో నిశితంగా గమనిస్తున్నాం. మత స్వేచ్ఛ, చట్ట ప్రకారం అన్ని వర్గాల వారిని సమానంగా చూడడం ప్రజాస్వామ్య మూల సూత్రం.’’ అని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు మిల్లర్‌ సమాధానమిచ్చారు.

ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు వీలుగా కేంద్రం సీఏఏ-2019ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి 2019లోనే పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం లభించాయి. కానీ, విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంతో దీన్ని వెంటనే అమల్లోకి తీసుకురాలేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికలకు ముందు దీని అమలు విధివిధానాలను పేర్కొంటూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని వల్ల ముస్లింల పౌరసత్వం పోదని కేంద్రం స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని