Respiratory illness: చైనాకు రాకపోకలు నిషేధించండి: బైడెన్‌ను కోరిన సెనెటర్లు

Respiratory illness: అమెరికాలో కొత్త రకం ఇన్ఫెక్షన్ల కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది. దీంతో చైనాకు ప్రయాణాలపై నిషేధం విధించాలని అగ్రరాజ్య సెనెటర్లు డిమాండ్ చేస్తున్నారు.

Published : 02 Dec 2023 10:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా (China)లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల (Respiratory illness) వ్యాప్తి నానాటికీ పెరుగుతుండటం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇదే సమయంలో బ్యాక్టీరియల్‌ నిమోనియాకు సంబంధించిన ఒక కొత్త రకం ఇన్ఫెక్షన్‌.. అమెరికా (USA) సహా పలు దేశాలను వణికిస్తోంది. దీంతో ఈ మిస్టరీ వ్యాధి పట్ల రిపబ్లికన్‌ సెనెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అమెరికా, చైనా మధ్య ప్రయాణాలపై నిషేధం (Travel Ban) విధించాలని కోరుతూ అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden)కు లేఖ రాశారు.

‘‘చైనాలో శ్వాసకోశ వ్యాధి వేగంగా వ్యాప్తిస్తోంది. ప్రజా ఆరోగ్య సంక్షోభంపై చైనా సర్కారు స్పష్టమైన సమాచారం బయటపెట్టదని మనకు తెలిసిందే. కరోనా సమయంలో ఆ దేశం వైరస్‌ మూలాల గురించి నిజాలను దాచిపెట్టి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పుడు మరోసారి అక్కడ ఇన్ఫెక్షన్లు కలకలం రేపుతున్నాయి. దీనిపై డబ్ల్యూహెచ్‌వో చర్యలు తీసుకునేదాకా మనం ఎదురుచూడకూడదు. అమెరికన్ల ఆరోగ్యం, మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు తక్షణమే ఇరు దేశాల మధ్య ప్రయాణాలపై నిషేధం విధించాలి. ఈ కొత్త వ్యాధి గురించి పూర్తిగా తెలిసేదాకా ఈ ఆంక్షలు కొనసాగాలి’’ అని రిపబ్లికన్‌ సెనెటర్లు ఆ లేఖలో కోరారు.

దేశాలను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌

చైనాలో నిమోనియా వ్యాప్తి తర్వాత అమెరికాలో ఇటీవల కొత్త రకం శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు అలాబామా, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, జార్జియా, మిస్సిస్సిపీ, న్యూ మెక్సికో, ప్యూర్టోరికో, టెక్సాస్‌ సహా 11 రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నమోదైనట్లు సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) గణాంకాలు చెబుతున్నాయి. వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌’గా పిలుస్తున్న ఈ రుగ్మత ప్రధానంగా 3-8 ఏళ్ల వయసు చిన్నారులకు సోకుతోంది. ఈ వ్యాధి బాధితుల ఊపిరితిత్తులకు స్కాన్‌ నిర్వహించినప్పుడు తెల్లరంగు మచ్చల్లాంటివి కనిపిస్తాయి. అయితే చైనాలో పెరిగిన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు ఈ కొత్త వ్యాధికారకంతో సంబంధం లేదని అమెరికా అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, తమ దేశంలో పెరుగుతున్న శ్వాసకోశ కేసులపై చైనా ఇటీవల స్పందించింది. అవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలే అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ఓ మీడియాతో అన్నారు. ఈ వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు తాము అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు, ఈ ఇన్ఫెక్షన్లపై చైనా నుంచి డబ్ల్యూహెచ్‌వో సమాచారం కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని