దేశాలను వణికిస్తున్న వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌

బ్యాక్టీరియల్‌ నిమోనియాకు సంబంధించిన ఒక కొత్త రకం ఇన్‌ఫెక్షన్‌.. చైనా, డెన్మార్క్‌, అమెరికా, నెదర్లాండ్స్‌ను వణికిస్తోంది.

Published : 02 Dec 2023 04:25 IST

వాషింగ్టన్‌: బ్యాక్టీరియల్‌ నిమోనియాకు సంబంధించిన ఒక కొత్త రకం ఇన్‌ఫెక్షన్‌.. చైనా, డెన్మార్క్‌, అమెరికా, నెదర్లాండ్స్‌ను వణికిస్తోంది. ‘వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌’గా పిలుస్తున్న ఈ రుగ్మత ప్రధానంగా     3-8 ఏళ్ల వయసు చిన్నారులకు సోకుతోంది. ఈ వ్యాధి బాధితుల ఊపిరితిత్తులకు స్కాన్‌ నిర్వహించినప్పుడు తెల్లరంగు మచ్చల్లాంటివి కనిపిస్తాయి. అందువల్లే దానికి ఆ పేరు పెట్టారు. మైకోప్లాస్మా నిమోనియే అనే బ్యాక్టీరియాలోని కొత్త వేరియంట్‌తో ఈ ఇన్‌ఫెక్షన్‌ కలుగుతున్నట్లు భావిస్తున్నారు. చాలారకాల యాంటీబయాటిక్స్‌ దీనిపై పనిచేయవని నిపుణులు చెబుతున్నారు. డెన్మార్క్‌లో ఇది మహమ్మారి స్థాయికి చేరుతోందని కథనాలు వస్తున్నాయి. నెదర్లాండ్స్‌లోనూ ఆందోళనకర రీతిలో వ్యాప్తి చెందుతోంది. అమెరికాలోని ఒహాయోలో ఈ కేసులు నమోదవుతున్నాయి. దీని  బారినపడిన చిన్నారులు ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌.. దగ్గు, తుమ్ములు, సంభాషణలు, శ్వాస ద్వారా వ్యాప్తి చెందుతుంది. శ్వాస నుంచి వెలువడే చిన్నపాటి తుంపర్లలో ఈ వ్యాధి కారక సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ వ్యాధి సోకినవారిలో జ్వరం, దగ్గు, శ్వాసలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటీవల చైనాలో పెరిగిన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లకు ఈ కొత్త వ్యాధికారకంతో సంబంధం లేదని అమెరికా అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని