USA: మేము ఉక్రెయిన్‌కు అణు తూటాలను ఇస్తున్నాం : అమెరికా

ఉక్రెయిన్‌కు అత్యంత శక్తిమంతమైన అణు తూటాలను సరఫరా చేయాలని అమెరికా తొలిసారి నిర్ణయించింది. వీటితో ట్యాంకులు, సాయుధ వాహనాలను ధ్వంసం చేయడం చాల తేలిక.  

Published : 07 Sep 2023 15:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. ఉక్రెయిన్‌కు డిప్లిటెడ్‌ యురేనియంతో చేసిన అణు తూటాలను అందించనున్నామని అమెరికా (USA) బహిరంగంగా ప్రకటించింది. ఆ దేశానికి ప్రకటించిన బిలియన్‌ డాలర్ల సైనిక సాయంలో భాగంగా ఈ చర్యను చేపట్టినట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌ ఆక్రమిత భాగాల నుంచి రష్యా దళాలను పారదోలడానికి వీటిని వినియోగించనున్నారని అమెరికా పేర్కొంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ కీవ్‌లో పర్యటిస్తున్న వేళ ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఈ ప్యాకేజీలో భాగంగా 120 ఎంఎం యురేనియం ట్యాంక్‌ తూటాలు, ఎం1 అబ్రమ్‌ ట్యాంకులు, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు, లాంగ్‌ రేంజ్‌ రాకెట్‌ లాంఛర్లు, శతఘ్ని గుండ్లు ఇవ్వనుంది. 

గ్రీన్‌కార్డు ‘జీవిత కాలం’ లేటు

సాయుధ వాహనాలకు ఉండే కవచాలను ఛేదించడానికి వీటిని వినియోగిస్తారు. త్వరలోనే ఉక్రెయిన్‌కు 31 ఎం1 అబ్రమ్‌ ట్యాంకులు అందనున్నాయి. ఇవి వినియోగించేందుకు వీలుగా ఈ తూటాలను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఎన్ని యురేనియం రౌండ్లను అందిస్తోందో మాత్రం అమెరికా వెల్లడించలేదు. ఇప్పటికే ఈ రకం తూటాలను ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా హెచ్చరించింది. గతంలో ఉక్రెయిన్‌కు ఛాలెంజర్‌-2 ట్యాంకులు వినియోగించేందుకు వీలుగా బ్రిటన్‌ యురేనియం తూటాలను అందించింది. అమెరికా ఇవ్వటం మాత్రం ఇదే తొలిసారి. 

డిప్లిటెడ్‌ యురేనియం అంటే ఏమిటి ?

అణ్వాయుధాలు తయారు చేయడానికి యురేనియం వినియోగిస్తారు. ఇది యూ-238 రూపంలో ఉంటుంది. దీనిలో 0.72శాతం మాత్రమే యూ-235 యురేనియం ఉంటుంది. ఇది మాత్రమే అణ్వాయుధాల్లో వాడతారు. ముడి యురేనియంను శుద్ధిచేసి దీనిని వెలికి తీస్తారు. ఈ క్రమంలో వచ్చే ఉప ఉత్పత్తిని డిప్లిటెడ్‌ యురేనియం అంటారు. ఇది అణు విచ్ఛిత్తిని సృష్టించలేదు. కానీ, చాలా దళసరిగా ఉంటుంది. సాధారణంగా లెడ్‌ వంటి లోహాల కంటే బలంగా ఉంటుంది. ఇది భారీ తూటాల తయారీకి ఇది చాలా అనువైంది. డిప్లిటెడ్‌ యురేనియం అమర్చిన తూటాను పేల్చితే ఓ బలమైన ఆయుధం వలే పనిచేస్తుంది. ఈ క్రమంలో ట్యాంకులకు అమర్చే బలమైన లోహ కవచాలను కూడా చీల్చుకొని వెళుతుంది. దీనికి తోడు అది కొన్ని వందల డిగ్రీల సెంటీగ్రేడ్‌ వేడిని అందుకొంటే స్వయంగా మండుతుంది.  అమెరికా 1970 నుంచి వీటితో కవచ ఛేదక తూటాలను తయారు చేయడం మొదలుపెట్టింది. దీంతోపాటు ట్యాంక్‌ కవచాలు తయారు చేసే మిశ్రమాల్లో కూడా వాడుతోంది.  అమెరికా ఇప్పటికీ ఈ రకం యురేనియంతో ఆయుధాలను చేస్తోంది. వీటిల్లో ఎం1ఏ2 అబ్రమ్స్‌ ట్యాంకులు వాడే ఎం829ఏ4 తూటాలు కీలకమైనవి.  2003లో ఇరాక్‌పై అమెరికా చేపట్టిన యుద్ధంలో దాదాపు 10 వేల రౌండ్ల డిప్లిటెడ్‌ యురేనియం(డీయూ) తూటాలు వాడినట్లు ది గార్డియన్‌ 2014లో కథనం వెలువరించింది. ఇరాక్‌లోని 300 ప్రదేశాల్లో డియూ తూటాల అవశేషాలను గుర్తించారు. వీటిని శుభ్రం చేయడానికి అప్పట్లోనే కనీసం 30 మిలియన్‌ డాలర్లు అవుతుందని అంచనావేశారు. ఇరాక్‌ యుద్ధంలో అమెరికా 300 టన్నుల డిప్లిటెడ్‌ యురేనియం వాడినట్లు ఆరోపణలున్నాయి.  ఈ దెబ్బకు ఇరాక్‌లోని ఫలూజా నగరంలో హిరోషిమా, నాగసాకీ కంటే అత్యధిక రేడియేషన్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని