Green Card-USA: గ్రీన్‌కార్డు ‘జీవిత కాలం’ లేటు

అమెరికాలో పౌరసత్వానికి తొలి మెట్టుగా భావించే గ్రీన్‌ కార్డు కోసం 10.5 లక్షల మందికిపైగా ప్రవాస భారతీయ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.

Updated : 07 Sep 2023 08:41 IST

4 లక్షల మంది భారతీయులకు ఎదురుచూపులే
వేచి చూస్తున్నవారు 10.5 లక్షల మందికిపైనే..

వాషింగ్టన్‌: అమెరికాలో పౌరసత్వానికి తొలి మెట్టుగా భావించే గ్రీన్‌ కార్డు కోసం 10.5 లక్షల మందికిపైగా ప్రవాస భారతీయ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అందులో 4 లక్షల మందికి గ్రీన్‌ కార్డు జీవిత కాలం లేటయ్యే అవకాశముంది. క్యాటో సంస్థకు చెందిన డేవిడ్‌ జే బయర్‌ జరిపిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది నాటికి అమెరికాలో ఉద్యోగ ఆధారిత గ్రీన్‌ కార్డు కోసం 18 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అందులో 10.5 లక్షల మందికిపైగా (63 శాతం) భారతీయులున్నారు. చైనా నుంచి 2.5 లక్షల మంది (14 శాతం) ఎదురు చూస్తున్నారు. వలస వచ్చినవారు శాశ్వతంగా అమెరికాలో ఉండేందుకు ఇచ్చే ఈ గ్రీన్‌ కార్డుపై దేశాల వారీగా పరిమితి ఉండటంతో ఏళ్లకు ఏళ్లు పడుతోంది. ఏటా జారీ చేసే గ్రీన్‌ కార్డుల్లో ఒక్కో దేశానికి 7 శాతానికి మించి ఇచ్చే అవకాశం లేదు. దీంతో  10.5 లక్షల మంది భారతీయులకు రావాలంటే ఎంత సమయం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. కొత్తగా దరఖాస్తు చేయాలనుకునేవారు జీవిత కాలం కంటే అధికంగా వేచి ఉండాల్సిందే. ఇప్పటికే 4 లక్షల మంది జీవిత కాలం వేచి ఉన్నా వచ్చే పరిస్థితి లేదు.

  • ఈ ఏడాది మార్చి నాటికి 80,324 మంది ఉద్యోగులకు సంబంధించిన గ్రీన్‌ కార్డుల పిటిషన్లు వలస విభాగంవద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీరి భార్యా పిల్లలతో కలిపి ఇవి 1,72,635గా ఉన్నాయి. మరో 13 లక్షల మంది దరఖాస్తులు వేచి ఉండేవారి జాబితాలో ఉన్నాయి. 2,89,000 మంది దరఖాస్తులు అడ్జస్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేటస్‌ పేరుతో పెండింగ్‌లో ఉన్నాయి.
  • విదేశాల్లోని అమెరికా కాన్సులేట్లలో ఉద్యోగ ఆధారిత గ్రీన్‌ కార్డు దరఖాస్తులు మరిన్ని పెండింగ్‌లో ఉన్నాయి. వీటి వివరాలు తెలియరాలేదు.
  • 1,23,234 శాశ్వత కార్మిక ధ్రువీకరణ పత్రం దరఖాస్తులు అమెరికా ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇవీ గ్రీన్‌ కార్డు క్యూలో ఉన్నట్లే.
  • గ్రీన్‌ కార్డుల బ్యాక్‌లాగ్‌లో 50శాతం ఈబీ-2కు చెందినవే. అమెరికా వ్యాపారాలకు సంబంధించిన ఉద్యోగాలు చేస్తూ అత్యున్నత డిగ్రీలు కలిగిన వారిని ఈ కేటగిరీ కింద పరిగణిస్తారు.
  • డిగ్రీ చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారిని ఈబీ-3 కేటగిరీ కింద పరిగణిస్తారు. వీరివి 19శాతం పెండింగ్‌లో ఉన్నాయి.
  • బీ-2, ఈబీ-3 కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న భారతీయులు 134 సంవత్సరాలు వేచి ఉండాలి. మొత్తం దరఖాస్తుల్లో 4,24,000 మంది జీవిత కాలంలో గ్రీన్‌ కార్డును చూడలేరు. ఇందులో 90శాతం మంది భారతీయులే.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని