గాజాపై ఐరాస భద్రతా మండలి తీర్మానం .. వీటో పవర్ వాడిన అమెరికా

గాజాలో కాల్పుల విరమణపై ఐరాస భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాన్ని తన అసాధారణ అధికారాలతో అమెరికా(America) అడ్డుకుంది. 

Updated : 09 Dec 2023 15:54 IST

న్యూయార్క్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య భీకరపోరు(Israel-Hamas Conflict) సాగుతోంది. ఈ దాడులతో గాజాలోని సామాన్య ప్రజల బతుకు ఛిద్రమవుతోంది. ఈ క్రమంలో గాజా(Gaza)లో తక్షణమే కాల్పులు విరమణ జరగాలని ఐరాస భద్రతా మండలి(UN Security Council) డిమాండ్‌ను అమెరికా (USA) వ్యతిరేకించింది. అందుకోసం తన వీటో పవర్‌ను ఉపయోగించింది.

రెండు దశాబ్దాలుగా ‘ఒకేఒక్కడు’.. ఐదోసారి అధికారానికి ‘సై’!

గాజాలో తక్షణమే కాల్పుల విరమణ కోసం భద్రతా మండలిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతిపాదించిన ముసాయిదాకు 13 మంది అనుకూలంగా ఓటేశారు. బ్రిటన్ ఓటింగ్‌కు దూరం జరిగింది. గాజాలో మానవతా సంక్షోభ నివారణ నిమిత్తం ఇటీవల ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ అసాధారణ అధికారాన్ని ఉపయోగించారు. యూఎన్‌ ఛార్టర్‌లోని ఆర్టికల్‌ 99ను ప్రయోగించారు. ఈ ప్రత్యేక అధికారంతో అంతర్జాతీయంగా ఆందోళనలను కలిగించే పరిస్థితుల్లో భద్రతా మండలిని సమావేశపరచవచ్చు. దీనిలో భాాగంగా సమావేశమైన మండలిలో ఓటింగ్‌ జరిగింది. అయితే మండలిలో శాశ్వత సభ్యదేశమైన అమెరికా తన వీటో అధికారంతో తీర్మానాన్ని అడ్డుకుంది. మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉన్నాయి.

అమెరికా(America), ఇజ్రాయెల్‌(Israel) దేశాలు  కాల్పుల విరమణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అది హమాస్‌ పుంజుకునేందుకు ఉపయోగపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే గాజాలో పౌరుల రక్షణ కోసం, బందీల విడుదల కోసం యుద్ధంలో స్వల్ప విరామాలకు మాత్రం అమెరికా అనుకూలంగా ఉంది. ఆ దేశ ప్రతినిధి రాబర్ట్‌ వుడ్‌ మాట్లాడుతూ.. ‘ఈ తీర్మానం వాస్తవికతకు దూరంగా ఉంది.  దానివల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం ఉండదు. ఇజ్రాయెల్‌, పాలస్తీనా ప్రజలు శాంతి, భద్రతల మధ్య జీవించాలని అమెరికా బలంగా కోరుకుంటోంది. అయితే ఈ అస్థిరమైన కాల్పుల విరమణకు అంగీకరిస్తే.. హమాస్‌ మరో యుద్ధానికి ప్రణాళిక రచిస్తుంది. శాంతిపై, రెండు దేశాల సిద్ధాంతంపై హమాస్‌కు విశ్వాసం లేదు’ అని అన్నారు.

ప్రస్తుత ముసాయిదాలో సవరణలు చేయాలని అమెరికా సూచించింది. అక్టోబర్‌ ఏడున ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడిని ఖండించాలని డిమాండ్ చేసింది. ఆ నరమేధంలో 1200 మంది అసువులుబాసారు. 240 మంది బందీలుగా మారారని ఇజ్రాయెల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.  హమాస్ చర్యల పట్ల ఎలాంటి ఖండన లేకపోవడంతో ఓటింగ్‌కు దూరమయ్యామని బ్రిటన్ తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని