US Warns Pak: ఇరాన్‌తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్‌కు అమెరికా హెచ్చరిక

US Warns Pak: పాకిస్థాన్‌, ఇరాన్‌ తాజాగా ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో వాణిజ్యపరమైనవీ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్‌ను అమెరికా హెచ్చరించింది.

Published : 24 Apr 2024 08:20 IST

US Warns Pak | వాషింగ్టన్‌: ఇరాన్‌తో (Iran) వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే యోచనలో ఉన్న దేశాలు పునరాలోచించుకోవాలని అగ్రరాజ్యం అమెరికా సూచించింది. లేనిపక్షంలో ఆంక్షలు తప్పవని మంగళవారం హెచ్చరించింది. పాకిస్థాన్‌ను (Pakistan) ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

పాక్‌ పర్యటనలో ఉన్న ఇరాన్‌ (Iran) అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాకిస్థాన్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ సోమవారం చర్చలు జరిపారు. వారి సమక్షంలో ఎనిమిది ఒప్పంద పత్రాలపై ఇరుదేశాల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 1,000 కోట్ల డాలర్లకు చేర్చాలనేది వీటిలో ఒకటి. పాక్‌లో ఎన్నికలు జరిగిన తర్వాత ఒక దేశాధినేత అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి తాజా హెచ్చరికలు వెలువడ్డాయి.

అమెరికా వర్సిటీల్లో గాజా అలజడి

మరోవైపు పాకిస్థాన్‌ (Pakistan) బాలిస్టిక్‌ క్షిపణుల కార్యక్రమానికి సరఫరాదారులుగా ఉన్న సంస్థలపై అమెరికా గతవారం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీటిలో చైనాకు చెందిన మూడు కంపెనీలు ఉన్నాయి. ఆయా సంస్థలు సామూహిక విధ్వంసక ఆయుధాలను వ్యాప్తి చేస్తున్నాయని.. అందుకే వాటిపై చర్యలు తప్పడం లేదని అగ్రరాజ్య విదేశాంగ అధికార ప్రతినిధుల్లో ఒకరైన వేదాంత్‌ పటేల్‌ వివరించారు. ఇవన్నీ బెలారస్‌, చైనా కేంద్రంగా పనిచేస్తున్నాయన్నారు. పాకిస్థాన్ (Pakistan) బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి ఇవి మద్దతునిస్తున్నట్లు స్పష్టంగా తేలిందని పేర్కొన్నారు.

మరో కార్యక్రమంలో పెంటగాన్‌ మీడియా కార్యదర్శి ప్యాట్‌ రైడర్‌ మాట్లాడుతూ.. ‘‘పాక్‌తో అమెరికా సత్సంబంధాలు కొనసాగిస్తోంది. ఆ ప్రాంతంలో వారు మాకు కీలక భద్రతా భాగస్వామి’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని