నియంతపై బామ్మ పోరు.. అధ్యక్ష ఎన్నికల్లో 80ఏళ్ల సామాన్యురాలి పోటీ

Venezuela: నియంతగా పేరున్న వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోపై ఈసారి 80 ఏళ్ల బామ్మ పోటీకి దిగారు.

Published : 25 Mar 2024 16:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణ అమెరికాలోని వెనిజువెలా (Venezuela) దేశంలో మరికొద్ది నెలల్లో అధ్యక్ష ఎన్నికలు (presidential elections) జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్‌ మదురో అధికార పార్టీ తరఫున మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనపై పోటీకి ఈసారి ప్రతిపక్షం తరఫున కొరీనా యారిస్‌ బరిలోకి దిగారు. విపక్షాల అభ్యర్థి మరియా మచాడోపై నిషేధం విధించడంతో చివరి నిమిషంలో యారిస్‌ను పోటీకి దించారు.

రాజకీయ నేపథ్యం లేకుండానే..

80 ఏళ్ల కొరీనా యారిస్‌ ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్‌, హిస్టరీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఫిలాసఫర్‌గా, ప్రొఫెసర్‌గా కెరీర్‌ కొనసాగిస్తున్న ఆమెకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. 2022లో ప్రతిపక్ష కూటమికి ప్రైమరీ ఎన్నికలు నిర్వహించే నేషనల్‌ ప్రైమరీ కమిషన్‌లో సభ్యురాలిగా చేరారు. గతేడాది చివర్లో జరిగిన ప్రైమరీ ఎన్నికలు ఈమె ఆధ్వర్యంలోనే జరిగాయి. ఆ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు సాధించిన మరియా మచాడోపై ఇటీవల నిషేధం పడటంతో విపక్షాలు యారిస్‌ను తమ అభ్యర్థిగా ఎంచుకున్నాయి.

కిమ్‌ కూర్చొని మాట్లాడుకుందాం.. చర్చలకు జపాన్‌ ప్రతిపాదన

విపక్షాలపై నికోలస్‌ ఉక్కుపాదం..

గత దశాబ్దకాలంగా అధికారంలో కొనసాగుతున్న నికోలస్‌ మదురో.. నియంతృత్వ పాలనతో విపక్షాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. 2013లో అప్పటి అధ్యక్షుడు చావెజ్‌ మరణంతో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన నికోలస్‌ తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రతిపక్షాలపై అణచివేత మొదలుపెట్టారు. ఇందుకోసం పలు కఠిన చట్టాలను అమల్లోకి తెచ్చారు. 2018లో నాలుగు నెలల ముందే ఎన్నికలకు వెళ్లిన ఆయన.. తనపై పోటీకి దిగిన అనేకమందిని జైల్లో పెట్టించారు.

ఈసారి ఆయనకు పోటీగా 56 ఏళ్ల మరియా మచాడో అధ్యక్ష బరిలోకి దిగారు. గతేడాది జూన్‌లో ఆమె ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ తర్వాత కొద్దిరోజులకే ప్రభుత్వ కంప్ట్రోలర్‌ జనరల్‌ ఆమెపై అనర్హత వేటు వేశారు. పలు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 15  ఏళ్ల పాటు ప్రభుత్వ పదవులు చేపట్టకుండా నిషేధం విధించారు.

అయినప్పటికీ ఆమె దీనిపై న్యాయపోరాటం చేస్తూనే ప్రైమరీల్లో పోటీ చేశారు. గతేడాది అక్టోబరులో వెలువడిన ఫలితాల్లో ఆమెకు 93శాతం ఓట్లు దక్కాయి. అయితే, ఇటీవల ఆమెపై నిషేధాన్ని వెనిజువెలా ఉన్నత కోర్టు సమర్థించడంతో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. దీంతో తన స్థానంలో కొరీనా యారిస్‌ను నిలబెట్టారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రతిపక్ష కూటమి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ఏడాది జులైలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని