Venice: ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్‌ కొనాల్సిందే!

పర్యటకుల సంఖ్యను కట్టడి చేసేందుకు ఇటలీలోని వెనిస్‌ సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.

Published : 24 Apr 2024 00:12 IST

రోమ్‌: ప్రపంచంలోని అత్యంత అందమైన నగరాల్లో ఇటలీలోని వెనిస్‌ (Venice) ఒకటి. 100కు పైగా దీవులుగా విస్తరించిన ఈ నగరంలోని కాలువలపై పడవ విహారం సందర్శకులకు మరిచిపోలేని అనుభూతి ఇస్తుంది. దీంతో ఏటా పెద్దఎత్తున పర్యటకులు ఇక్కడికి పోటెత్తుతుంటారు. అయితే.. విపరీతమైన రద్దీ కాస్త ఈ ప్రాంతానికి తలకుమించిన భారంగా మారింది. ఈనేపథ్యంలోనే నగర సందర్శనకు వచ్చేవారి సంఖ్యను కట్టడి చేసేందుకు స్థానిక యంత్రాంగం సిద్ధమైంది. సందర్శకుల నుంచి ప్రవేశరుసుం వసూలుచేయనున్నట్లు ప్రకటించింది. ఇలాంటి చర్యలు తీసుకోవడం ప్రపంచంలో ఇదే మొదటిసారి.

ఇక భారతీయులకు బహుళ ప్రవేశ, దీర్ఘకాల షెన్‌జెన్‌ వీసా

ఏప్రిల్‌ 25న తొలిసారి సందర్శకుల నుంచి 5 యూరోల (రూ.444) చొప్పున డే-ట్రిప్ ప్రవేశరుసుం వసూలుచేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ‘‘ఇదొక ప్రయోగాత్మక విధానం. ఇలా చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి’’ అని వెనిస్ మేయర్ లుయిగి బ్రుగ్నారో వెల్లడించారు. రద్దీని నివారించి.. నగరాన్ని మరింత నివాసయోగ్యంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. టికెట్‌ తీసుకోనిపక్షంలో 50- 300 యూరోల మధ్య జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పారు. అయితే.. ఈ ఏడాదిలో 29 రద్దీ రోజుల్లో మాత్రమే ఈ రుసుం వసూలుచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

స్థానికులకే ఇళ్లు దొరకట్లేదు..!

వెనిస్‌కు పర్యటకుల తాకిడి కొనసాగుతోంది. 2022లో 32 లక్షల మంది బస చేశారు. అయితే.. ఇక్కడి ప్రతీ నివాసం హోటల్‌గానో, రెస్టారంట్‌గానో మారిపోతోంది. స్థానికులకు ఇల్లు అద్దెకు దొరకడం గగనమైంది. దీంతో ఒకప్పుడు 1.20 లక్షలుగా ఉన్న నగర జనాభా ప్రస్తుతం 50 వేలకు పడిపోయింది. ఈక్రమంలో స్థానికుల నుంచి పర్యటకుల రద్దీ విషయంలో ఆగ్రహం వ్యక్తమైంది. ప్రవేశరుసుం చాలాకాలంగా చర్చల్లో ఉన్నప్పటికీ.. పర్యటక ఆదాయాన్ని దెబ్బతీస్తుందని, సందర్శకుల కదలికలపై ఆంక్షలకు దారితీస్తుందని వాయిదా వేశారు. ఎట్టకేలకు దాని అమలుకు సిద్ధమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని