Vivek Ramaswamy: రష్యాకు రామస్వామి ఆఫర్‌..!

చైనా నుంచి రష్యాను దూరం చేయడం చాలా ముఖ్యమని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వ పోటీదారు వివేక్‌ రామస్వామి పేర్కొన్నారు. తాను పుతిన్‌కు మంచి డీల్‌ను ఆఫర్‌ చేస్తానని ప్రకటించారు. 

Updated : 01 Sep 2023 12:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రిపబ్లికన్‌ పార్టీ తరపున అమెరికా (USA) అధ్యక్ష పదవి రేసులో నిలిచేందుకు పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) రష్యా (Russia) విషయంలో విభిన్న వైఖరిని ప్రకటించారు. అమెరికాకు ప్రధాన అడ్డంకిగా మారిన చైనా(China)ను ఎదుర్కొనే సమయంలో రష్యా చాలా కీలకమైందని ఆయన అభిప్రాయపడ్డారు. మాస్కోను ఎట్టి పరిస్థితుల్లో బీజింగ్‌ పక్షాన చేరనీయకూడదన్నారు. తాను ఎన్నికల్లో గెలిచి శ్వేత సౌధంలో అడుగుపెడితే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రష్యాకు మంచి డీల్‌ను ఆఫర్‌ చేస్తానని ప్రకటించారు.

‘జార్జియా’ ఎన్నికల కేసులో నిర్దోషిని

రామస్వామి ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను అధ్యక్షుడినైతే.. ప్రస్తుతం ఉక్రెయిన్‌-రష్యా మధ్య ఉన్న సరిహద్దులను యథాతథంగా ఉంచేసేలా చేయడంతోపాటు.. నాటోలో ఉక్రెయిన్‌కు స్థానం ఇవ్వకపోవడం, ఆంక్షల తొలగింపు వంటి నిర్ణయాలు తీసుకొంటానని వెల్లడించారు. దీనికి ప్రతిగా రష్యా కూడా చైనాతో సైనిక బంధం నుంచి వైదొలగాల్సి ఉంటుందన్నారు. ‘‘స్పష్టమైన దార్శనికతతో ఉన్నాను. పుతిన్‌ అంగీకరించేలా ఓ ఒప్పందం చేసుకొంటాను. అది అమెరికన్ల ప్రయోజనాలను కూడా కాపాడుతుంది. అదేంటంటే.. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నియంత్రణ రేఖలను యథాతథంగా ఉంచేస్తాను. కీవ్‌కు నాటోలో స్థానం ఇవ్వం. పుతిన్‌ ఒప్పందాన్ని అంగీకరించేందుకు ఇవి చాలు. ఇందుకు ప్రతిగా మెరుగైన ఆఫర్లు కూడా అమెరికాకు లభించాలి. చైనాతో సైనిక బంధం నుంచి వైదొలగాలి. వాస్తవానికి ఈ బంధం నేడు అమెరికా ఎదుట ఉన్న అతిపెద్ద ముప్పు. 1972లో నిక్సన్‌ చేసిన దానికి పూర్తిగా రివర్స్‌లో చేస్తాను’’ అని వివరించారు. 

పశ్చిమార్ధ గోళం నుంచి రష్యా సైనిక బలగాలు తగ్గించుకొనేలా చేస్తానని రామస్వామి పేర్కొన్నారు. మాస్కోతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరిస్తానన్నారు. అప్పుడు చైనాతో అవసరం మాస్కోకు తగ్గిపోతుందని వివరించారు. ప్రస్తుతం తాము రష్యాతో సంబంధాలు తెంచుకోవడం వల్లే చైనా పశ్చిమ దేశాలకు విలువైనదిగా మారిందన్నారు. నార్డ్‌స్ట్రీమ్‌ గ్యాస్‌ పైపులైన్‌పై బాంబింగ్‌ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని