Donald Trump: కోర్టులో కునుకు తీసిన ట్రంప్‌..?

తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందారన్న కేసులో భాగంగా కోర్టు ఎదుట హాజరైన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌.. విచారణ సమయంలో కునుకు తీసినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. దీనిపై ఆయన బృందం స్పందించింది. 

Published : 17 Apr 2024 00:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా ఎన్నికల బరిలో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌కు గట్టి పోటీ ఇస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) కోర్టు కేసులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తప్పుడు పత్రాలతో బ్యాంకులను మోసం చేసి రుణాలు పొందారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన న్యూయార్క్‌ న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో ట్రంప్‌ నిద్రలోకి జారుకున్నారని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

విచారణ సమయంలో కుర్చీలో చేతులు కట్టుకుని కూర్చున్న ట్రంప్‌.. మెల్లగా తన కళ్లు మూస్తూ మధ్యలో ఆవలించారని పేర్కొన్నాయి. నిద్రను నియంత్రించేందుకు ఆయన ప్రయత్నించారని తెలిపాయి. విచారణ వేళ కోర్టు గదిలో కూర్చునేందుకు అనుమతి తీసుకున్న కొందరు జర్నలిస్టులు ఇదంతా గమనించారు. 

సాంకేతిక తప్పిదం.. వేరే జంటకు విడాకులు!

అదంతా అబద్ధం..

గతంలోనూ ఆయన నిద్రపోతున్నట్లు అనిపించిన దాఖలాలు ఉన్నాయి. ఈసారి మాత్రం ట్రంప్‌ న్యాయవాది అప్రమత్తం చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. వాటిని ఆయన అంతగా పట్టించుకోలేదని తెలుస్తోంది. నిద్ర కమ్ముకురావడంతో కాసేపు తన తలను కిందకు దించినట్లు పేర్కొన్నాయి. అయితే, కోర్టు రూమ్‌లో ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలను ఆయన బృందం ఖండించింది. ఆయన అలా చేయలేదని వివరణ ఇచ్చింది. మీడియా చేస్తున్న ప్రచారం అసత్యమని కొట్టిపారేసింది. కొందరు నెటిజన్లు ట్రంప్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో కామెంట్లు పోస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని