Japan nuclear plant: జపాన్‌ అణుప్లాంట్‌లో పెరిగిన నీటి మట్టం

జపాన్‌లోని ఓ అణు విద్యుత్తు కేంద్రంలో భూకంపం కారణంగా నీటి మట్టం పెరిగినట్లు గుర్తించారు. ఇక్కడ కొన్ని వ్యవస్థలు కూడా పనిచేయడంలేదు. 

Updated : 03 Jan 2024 16:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జపాన్‌(Japan)లో భూకంపానికి గురైన ఇషికావా ప్రిఫెక్చర్‌లో తాజాగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నోటో ప్రాంతంలోని షికా అణు విద్యుత్తు ప్లాంట్‌లో నీటిమట్టం పెరిగినట్లు తనిఖీల్లో తేలింది. దీనిని నిర్వహిస్తున్న హోకురికు ఎలక్ట్రిక్‌ పవర్‌ కంపెనీ సిబ్బంది సునామీ హెచ్చరికల అనంతరం తనిఖీలు చేశారు. సముద్రపు జలాలను తీసుకొనే చోట నీటి మట్టం దాదాపు మూడు మీటర్లు పెరిగినట్లు గుర్తించారు. సాధారణంగా ఈ ప్లాంట్‌లోని కూలింగ్‌ వ్యవస్థ కోసం సముద్ర జలాలను వినియోగిస్తారు. 

ఈ ప్లాంట్‌లోని 1వ రియాక్టర్‌ వద్ద  నిర్మించిన నాలుగు మీటర్ల రక్షణ గోడ కొన్ని సెంటీమీటర్ల మేరకు ఒరిగిపోయినట్లు సిబ్బంది గుర్తించారు. బయటి నుంచి విద్యుత్తును లోపల రియాక్టర్లకు పంపించే ట్రాన్స్‌ఫార్మర్‌ పైపులు దెబ్బతిన్నాయి. కొన్ని వ్యవస్థలు పనిచేయడంలేదు. దీంతోపాటు భూకంపం కారణంగా ఏర్పడ్డ పగుళ్ల నుంచి చమురు లీకేజీ అవుతున్నట్లు అనుమానాలున్నాయి. బయటకు వచ్చిన చమురును గుర్తించేందుకు వీలుగా పనులు చేపట్టారు. ఈ ప్లాంట్‌లోని 1,2 నెంబర్ల రియాక్టర్లు చాలా కాలంగా ఉపయోగంలో లేవని చెబుతున్నారు. రియాక్టర్‌లోని సంక్లిష్ట పరికరాలకు ఇతర మార్గాల్లో విద్యుత్తు సరఫరా చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

మరో పదేళ్లు పశ్చిమాసియాలోనే అమెరికా పాగా..!

మరోవైపు ఇషికావా ప్రిఫెక్చర్‌లోని షికా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో స్వల్ప స్థాయి పేలుడు సంభవించి, ఏదో కాలిపోతున్న వాసన వచ్చిందని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ మంగళవారం తెలిపింది.

వేల సంఖ్యలో ప్రజలకు నిలిచిన విద్యుత్తు, నీరు..!

భూకంపం వచ్చి 48 గంటలు దాటినా మధ్య జపాన్‌లో వేల కుటుంబాలకు నీరు, విద్యుత్తు అందుబాటులోకి రాలేదు. ఇషికావా, వాజిమా, సుజు నగరాల్లో 40 వేల గృహాలకు బుధవారం ఉదయం వరకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించలేదు. ఇషికావాలో 95 వేల ఇళ్లకు నీటి సరఫరా నిలిచిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని