WHO: ప్రాణాంతక ‘మెర్స్‌’ కలకలం.. అబుదాబీలో ఒక కేసు

ప్రాణాంతక మెర్స్‌-కోవ్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) మళ్లీ కలకలం రేపింది. అబుదాబీలో ఓ 28ఏళ్ల యువకుడిలో ఈ వైరస్‌ వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.

Published : 25 Jul 2023 13:40 IST

జెనీవా: కొవిడ్‌-19 మహమ్మారి (Covid 19) నుంచి ప్రపంచ దేశాలు కోలుకుంటున్నప్పటికీ.. పలు దేశాల్లో మాత్రం ఈ తరహా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్‌ కుటుంబానికి చెందిన ప్రాణాంతక మెర్స్‌-కోవ్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) మళ్లీ కలకలం రేపింది. అబుదాబీలో ఓ 28ఏళ్ల యువకుడిలో ఈ వైరస్‌ వెలుగు చూసింది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా నిర్ధారించింది. అయితే, అతడు సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి పరీక్షించగా.. ఎవ్వరిలోనూ వైరస్‌ గుర్తించలేదని తెలిపింది.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అల్‌ ఐన్‌ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం పీసీఆర్‌ పరీక్షలు జరపగా మెర్స్‌-కోవ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే, అతడితో పాటు సన్నిహితంగా మెలిగిన 108 మందిని పరీక్షించగా.. ఎవ్వరిలోనూ వైరస్‌ జాడలు కనిపించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. దీంతో ఒంటెల వంటి జంతువుల నుంచే ఇది సోకి ఉండవచ్చని అనుమానించారు. అయితే, ఇన్‌ఫెక్షన్‌ బారిన పడిన ఈ వ్యక్తి ఒంటెలతో సమీపంగా మెలిగిన దాఖలాలు లేవని సమాచారం. మరోవైపు ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపైనా డబ్ల్యూహెచ్‌వో, యూఏఈ ఆరోగ్యశాఖ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు.

నియంత్రణ లేకుంటే.. యూఎస్‌ నుంచే కొవిడ్‌ తరహా మహమ్మారి!

ది మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనావైరస్‌ (MERS-CoV) తొలిసారి 2012లో సౌదీ అరేబియాలో బయటపడింది. ఇప్పటివరకు ఈ వైరస్‌ బ్రిటన్‌, అమెరికాతో సహా 27 దేశాల్లో వెలుగు చూసింది. అత్యంత ప్రాణాంతకమైన ఈ వైరస్‌ సోకిన బాధితుల్లో 35శాతం మంది మరణించారు. మొత్తంగా ఇప్పటివరకు 2605 కేసులు నమోదు కాగా 936 మరణాలు చోటుచేసుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మెర్స్‌-కోవ్‌ అనేది జూనోటిక్‌ వైరస్‌గా పరిగణిస్తారు. అంటే జంతువుల నుంచి మానవులకు సోకే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఈ కేసులు ఎక్కువగా బయటపడుతుంటాయి. ఇన్‌ఫెక్షన్‌కు గురైన ఒంటెల నుంచి ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ సోకడం వల్ల జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందితోపాటు మరికొన్ని సమయాల్లో నిమోనియా లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్‌ సోకిన వ్యక్తుల్లో మరణాలు రేటు చాలా అధికంగా ఉంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని