Pandemic: నియంత్రణ లేకుంటే.. యూఎస్‌ నుంచే కొవిడ్‌ తరహా మహమ్మారి!

కరోనా తరహా తదుపరి మహమ్మారి అమెరికా మాంసం సరఫరా నుంచే వ్యాపించవచ్చని తాజా అధ్యయనం హెచ్చరించింది.

Updated : 23 Jul 2023 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాలో పుట్టినట్లు భావిస్తోన్న కొవిడ్‌-19 మహమ్మారి (Covid Pandemic) యావత్‌ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన విషయం తెలిసిందే. దీన్నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నప్పటికీ.. మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా తరహా తదుపరి మహమ్మారి అమెరికా మాంసం సరఫరా నుంచే వ్యాపించవచ్చని తాజా అధ్యయనం హెచ్చరించింది. ‘అమెరికాలో జంతు మార్కెట్లు, జంతుకారక వ్యాధులు’ పేరుతో హార్వర్డ్‌ లా స్కూల్‌, న్యూయార్క్‌ యూనివర్సిటీలు చేపట్టిన తాజా అధ్యయన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది.

జంతువుల నుంచి మానవులకు సంక్రమించే (జంతుకారణ) వ్యాధులనే జూనోటిక్‌ వ్యాధులంటారు. గాలి, నీరు, ఆహారం, వస్తువుల ద్వారా కూడా ఇవి సంక్రమిస్తాయి. ఎబోలా, జికాతో పాటు ఇతర ప్రాణాంతక వ్యాధులు ఎక్కువగా ఇలాగే వ్యాపించాయి. ఈ క్రమంలోనే అమెరికాలో జంతువుల నుంచి మానవులకు సాంక్రమిక వైరస్‌లు తేలికగా వ్యాప్తిచెందే అవకాశం ఉందని.. ఇవే మహమ్మారి తరహాలో వ్యాప్తికి దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. జంతువులకు అత్యంత సన్నిహితంగా మెలిగే ఫార్మ్‌లు, వాటి చర్మ వాణిజ్యం వంటివి వ్యాధి వ్యాప్తికి ఆస్కారం ఉన్న ప్రాంతాలని తాజా అధ్యయనంలో ఒకరైన యాన్‌ లిండర్‌ అనే పరిశోధకురాలు పేర్కొన్నారు. వివిధ అవసరాల కోసం ఏటా 22కోట్ల జంతువులు అమెరికాలోకి దిగుమతి అవుతున్నాయని.. వివిధ ఖండాల్లోని జంతువులను, వ్యాధికారకాలను కలుపుతూ అత్యంత వేగంగా వాటిని వ్యాప్తి చేస్తున్నామని అన్నారు.

ఎగుమతి నిషేధం.. అమెరికాలో గం‘ధర’గోళం

సీడీసీ ప్రకారం, అమెరికాలో బర్డ్‌ ఫ్లూ మానవులకు సంక్రమించడమనేది అత్యంత అరుదు అని నేషనల్‌ చికెన్‌ కౌన్సిల్‌కు చెందిన ఆష్లే పీటెర్‌సన్‌ వెల్లడించారు. అయితే, పంది, పౌల్ట్రీ ఫారాల్లో పనిచేసే కార్మికులకు వీటి నుంచి ముప్పు ఎక్కువగా ఉందని మరో నిపుణుడు డెల్సియన్నా విండెర్స్‌ స్పష్టం చేశారు. ఇటువంటి సమయంలో కోళ్లు, పంది ఫారాలతో పాటు కబేళాలపై నియంత్రణ పెంచాల్సింది ఉండగా.. అమెరికా ప్రభుత్వం మాత్రం నియంత్రణను తగ్గిస్తోందని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని