Gaza Conflict: గాజా ఆసుపత్రిలో ‘రక్తపాతం’.. ఆందోళన వ్యక్తం చేసిన WHO

గాజాలో అతిపెద్ద ఆసుపత్రి ‘అల్‌-షిఫా’లో అత్యవసర విభాగంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 17 Dec 2023 20:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హమాస్‌ ఉగ్రవాదుల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ చేస్తోన్న దాడులతో గాజా (Israel Hamas conflict) వణికిపోతోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో దాదాపు సగం భవనాలు నాశనమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అక్కడున్న ప్రధాన ఆసుపత్రులు కూడా ధ్వంసం కావడం కలవరపెడుతోంది. ముఖ్యంగా గాజాలో అతిపెద్ద ఆసుపత్రి ‘అల్‌-షిఫా’లో అత్యవసర విభాగంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పరిస్థితిని ‘రక్తపాతం’గా అభివర్ణించిన డబ్ల్యూహెచ్‌వో.. అక్కడ సాధారణ పరిస్థితులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది.

తీవ్ర దాడులతో ఇజ్రాయెల్‌ సైన్యం (IDF) విరుచుకుపడుతోన్న వేళ.. వైద్య సామగ్రి అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బృందం గాజాలోని పలు ఆసుపత్రులకు వెళ్లింది. ఈ సందర్భంగా అల్‌-షిఫా ఆసుపత్రికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడి అత్యవసర విభాగంలో నెలకొన్న పరిస్థితులను చూసిన డబ్ల్యూహెచ్‌వో బృందం.. అదో ‘రక్తపాతం’గా అభివర్ణించింది.

యుద్ధంతోనే బందీల విడుదల సాధ్యం: నెతన్యాహు

‘ఆసుపత్రి భవనం, వెలుపల వేల మంది నిరాశ్రయులు తలదాచుకుంటున్నారు. నీరు, ఆహార కొరత తీవ్రంగా ఉంది. ఇప్పటికే వందల మంది రోగులతో నిండిపోగా, ప్రతి నిమిషానికో బాధితుడు వస్తున్నాడు. తీవ్ర గాయాలతో వచ్చిన వారిని నేలపైనే ఉంచుతున్నారు. వారికి అవసరమైన నొప్పి నివారణ ఔషధాలు కూడా అందుబాటులో లేవు. ఆక్సిజన్‌ సరఫరా సరిగా లేకపోవడంతో ఆపరేషన్ థియేటర్లు పనిచేయడం లేదు’ అని డబ్ల్యూహెచ్‌వో బృందం పేర్కొంది.

గాజాలోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన అల్‌-షిఫాలో కొద్దిమంది వైద్యులు, వాలంటీర్లు ఉన్నారని డబ్ల్యూహెచ్‌వో బృందం వెల్లడించింది. ఆసుపత్రిలో సవాళ్లతో కూడిన పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. తక్షణమే పునరుజ్జీవనం అవసరమని అభిప్రాయపడింది. ఇంధనం, ఆక్సిజన్‌, ఔషధాలు, ఆహారం, నీరు క్రమంగా అందితేనే రానున్న రోజుల్లో ఇక్కడ సాధారణ పరిస్థితులు తీసుకురావచ్చని పేర్కొంది. ఇదిలాఉంటే, ఇజ్రాయెల్‌ చేస్తోన్న భీకర దాడులతో గాజాలో ఇప్పటివరకు 18వేల మంది చనిపోయినట్లు అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని