గాజాలో సైన్యం తనిఖీలు.. రోగి మృతి.. ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో

గాజాలోని రోగులకు వైద్య సాయం అందిస్తున్న డబ్ల్యూహెచ్‌వో బృందాలను తనిఖీల పేరుతో ఇబ్బందులకు గురిచేయడంపై ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

Published : 12 Dec 2023 21:22 IST

గాజా/జెనీవా: సహాయక బృందాలను సైన్యం సుదీర్ఘ సమయం తనిఖీలు చేయడం వల్ల గాజాలోని రోగులకు అత్యవసర చికిత్స అందడం ఆలస్యమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆరోపించింది. ఈ పరిస్థితిపై డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనామ్‌ (Tedros Adhanom) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తనిఖీల కారణంగా అత్యవసర చికిత్స అవసరమైన ఒక రోగి చనిపోగా.. పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో వీడియోలు, ఫొటోలను షేర్ చేశారు. ఇజ్రాయెల్‌ సైన్యాన్ని ఉద్దేశించి ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 

హమాస్‌ ఉగ్రవాదులను నాశనం చేయడం లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దళాలు గాజాపై భీకర దాడులు చేస్తున్నాయి. కాల్పుల విరమణ అనంతరం దాడులను మరింత తీవ్ర తరం చేసిన ఇజ్రాయెల్‌ సైన్యం, గాజాకు వెళ్లే సరిహద్దులతోపాటు అక్కడి పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ క్రమంలో నగరంలో పలు చోట్ల చెక్‌పాయింట్లను ఏర్పాటు చేసింది. శనివారం ఉత్తర గాజాలోని అల్-అహ్లీ ఆసుపత్రికి డబ్ల్యూహెచ్‌వో బృందం ఔషధాలు, అత్యవసర వైద్య సామాగ్రితో బయల్దేరాయి. మార్గం మధ్యలో రెండు సార్లు తనిఖీల పేరుతో సైన్యం డబ్ల్యూహెచ్‌వో బృందాలను అడ్డుకుందని, పాలస్తీనా రెడ్‌క్రాస్‌ సిబ్బందిని కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాత విడిచిపెట్టారని టెడ్రోస్‌ తెలిపారు. 

ఈవెంట్లోనే చంపేస్తా.. వివేక్‌ రామస్వామికి బెదిరింపులు

తిరుగు ప్రయాణంలో అత్యవసర చికిత్స అవసరమైన రోగితో వెళుతున్న అంబులెన్స్‌ సిబ్బందిని అడ్డుకుని కొన్ని గంటలపాటు ప్రశ్నించిన తర్వాత విడిచిపెట్టారని, అప్పటికే అంబులెన్స్‌లో ఉన్న రోగి ప్రాణాలు కోల్పోయాడని టెడ్రోస్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. గాజా ప్రజలకు అవసరమైన వైద్య సాయం పొందే హక్కు ఉందని, యుద్ధ సమయంలో కూడా ఆరోగ్య వ్యవస్థను కాపాడాలని కోరారు. 

మరోవైపు గాజా జనాభాలో సగం మంది తీవ్ర ఆకలితో అలమటిస్తున్నారని యూఎన్‌ వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం (UNWFP) వెల్లడించింది. అక్కడి ప్రజలకు అవసరమైన ఆహార సాయం అందించేందుకు మరో సరిహద్దును తెరవాలని ఇజ్రాయెల్‌ సైన్యాన్ని కోరింది. గాజాలో ప్రతిరోజూ పదిమందిలో తొమ్మిది మంది తీవ్ర ఆకలి బాధను అనుభవిస్తున్నారని, ఆలస్యం చేస్తే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని