Vivek Ramaswamy: ఈవెంట్లోనే చంపేస్తా.. వివేక్‌ రామస్వామికి బెదిరింపులు

వివేక్‌ రామస్వామిని చంపేస్తానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆయనతో పాటు ప్రచార ఈవెంట్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరినీ చంపుతానంటూ సందేశం పంపాడు.

Updated : 12 Dec 2023 12:05 IST

వాషింగ్టన్‌: రిపబ్లికన్‌ పార్టీ (Republican) తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy)కి బెదిరింపులు వచ్చాయి. ఓటర్‌ నోటిఫికేషన్‌కు ప్రతిస్పందనగా ఓ వ్యక్తి వివేక్‌ను చంపేస్తానంటూ సందేశం పంపాడు. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది.

అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న వివేక్‌ ప్రచారంలో భాగంగా రాబోయే ఈవెంట్ల సమాచారం గురించి ఓటర్లకు నోటిఫికేషన్లను పంపించారు. దీనికి వచ్చిన స్పందనల్లో ఓ వ్యక్తి వివేక్‌ను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. రాబోయే ఈవెంట్లు తనకు మంచి అవకాశాన్ని కల్పించబోతున్నాయని.. ఆ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరినీ చంపుతానంటూ సందేశం పంపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు న్యూహాంప్‌షైర్‌లోని డోవర్‌ నుంచి ఈ సందేశాలు వచ్చినట్లు గుర్తించారు. టైలర్‌ ఆండర్సన్‌(30) అనే వ్యక్తి ఈ బెదిరింపు సందేశాలు పంపినట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు ఎఫ్‌బీఐ అఫిడవిట్‌లో వెల్లడించింది. నిందితుడిపై నేరం రుజువైతే.. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 2.50 లక్షల డాలర్ల జరిమానా పడే అవకాశం ఉంది.

భూటాన్‌లో చైనా అక్రమ గ్రామాలు

తనకు బెదిరింపులు రావడంపై రామస్వామి స్పందించారు. ‘‘బెదిరింపు సందేశాలకు వేగంగా స్పందించి నిందితుడిని అరెస్టు చేసినందుకు దర్యాప్తు సంస్థలకు నా కృతజ్ఞతలు. నా చుట్టూ ఉండి నన్ను రక్షించిన నా బృందాలకు ధన్యవాదాలు’’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), భారతీయ అమెరికన్లు నిక్కీ హేలీ ( Nikki Haley), వివేక్‌ రామస్వామితో పాటు ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డి శాంటిస్‌ (Ron DeSantis), న్యూజెర్సీ మాజీ గవర్నర్‌ క్రిస్‌ క్రిస్టీ (Chris Christie)లు పోటీ పడుతున్నారు. ఈ రేసులో 60 శాతం రిపబ్లికన్‌ ఓటర్ల మద్దతుతో డొనాల్డ్‌ ట్రంప్‌ అగ్రగామిగా ఉన్నారు. రెండో స్థానంలో వివేక్‌ రామస్వామి కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని