WHO: ‘డెత్‌ జోన్‌గా అల్‌-షిఫా’.. డబ్ల్యూహెచ్‌వో ఆందోళన

గాజాలో అతి పెద్దదైన ‘అల్‌-షిఫా’ ఆస్పత్రిని ‘డెత్‌ జోన్‌’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మరణాలు, అక్కడి పరిస్థితిపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 19 Nov 2023 18:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హమాన్‌ (Hamas)ను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్‌ (Israel)దాడులను తీవ్రతరం చేసింది.ఆస్పత్రులు, పాఠశాలపై కూడా దాడులు చేస్తోంది. గాజాలో అతి పెద్దదైన ‘అల్‌-షిఫా’ ఆస్పత్రి (al-Shifa hospital)ని ఖాళీ చేసి రోగులు, పౌరులు, సిబ్బంది సురక్షిత ప్రాంతానికి పయనమయ్యారు. యుద్ధంతో ఆస్పత్రి లోపల బయట ఇలా ఎటు చూసినా మృతదేహాలే. దీంతో ఈ ఆస్పత్రిని ‘డెత్‌ జోన్‌’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. అంతేకాకుండా, అక్కడి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది.

‘అల్‌-షిఫా’ ఆస్పత్రిని కేంద్రంగా చేసుకొని హమాస్‌ కార్యకలాపాలు సాగిస్తోందని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్‌ హెచ్చరికల అనంతరం రోగులు, పౌరులు, వైద్య సిబ్బంది వేరే చోటికి తరలివెళ్లినట్లు గాజా ఆరోగ్య విభాగం వర్గాలు తెలిపాయి. అయితే.. తాము అలాంటి ఆదేశాలేమీ జారీ చేయలేదని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. వేరేచోటికి వెళ్లాలని భావిస్తున్న వారికి సురక్షితమైన దారి కల్పిస్తామని మాత్రమే చెప్పినట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ ఆస్పత్రిని ఆక్రమించిన ఇజ్రాయెల్‌ సేనలు దాడులు కొనసాగిస్తున్నాయి.

బందీల విడుదలపై హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఒప్పందం..?

అక్కడి పరిస్థితిపై డబ్ల్యూహెచ్‌వో (WHO) బృందం పరిశోధన జరిపింది. కాల్పులకు సంబంధించిన సాక్ష్యాలను.. ఆస్పత్రి ప్రవేశద్వారం వద్ద అధిక సంఖ్యలో మృతదేహాలను చూశామని బృందం తెలిపింది. అంతేకాకుండా, అక్కడ మరణించిన ఓ 80 మంది వ్యక్తుల అవశేషాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. వీటి ఆధారంగా అధ్యయనం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ  ‘అల్‌-షిఫా’ ఆస్పత్రిని ‘డెత్‌ జోన్‌’గా ప్రకటించింది. ఇజ్రాయెల్‌ హెచ్చరించిన తర్వాత కొందరు రోగులు వేరే ప్రాంతానికి బయలుదేరారు. కదలలేని స్థితిలో ఉన్న ఎంతో మంది రోగులు ఆస్పత్రిలో ఉన్నట్లు స్థానిక మీడియా కథనాల్లో పేర్కొంది. వారిలో నెలలు నిండక ముందే జన్మించిన శిశువులు కూడా ఉన్నారు. ఔషధాలు, యాంటీ బయాటిక్స్‌ లేక కొందరు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని