Israel-Hamas: బందీల విడుదలపై హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఒప్పందం..?

గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ అంగీకరించినట్లు ‘ది వాషింగ్టన్‌ పోస్టు’ కథనం ప్రచురించింది. ఈ సమయంలో బందీలను విడుదల చేసేందుకు హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది.

Updated : 19 Nov 2023 12:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హమాస్‌ (Hamas)ను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్‌ (Israel) గాజా (Gaza)పై విరుచుకుపడుతోంది. ఈ దాడుల కారణంగా అక్కడి ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. హమాస్‌ చేతిలో బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్‌ తీవ్రంగా యత్నిస్తోంది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకొంటున్నట్లు అమెరికా పత్రికలు చెబుతున్నాయి. కాల్పుల విరమణకు హమాస్‌- ఇజ్రాయెల్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు ‘ది వాషింగ్టన్‌ పోస్టు’ కథనం ప్రచురించింది.

తమ వద్ద బందీలుగా ఉన్న అమెరికా పౌరులతో సహా 50 మందిని దశల వారీగా విడుదల చేసేందుకు హమాస్‌ అంగీకరించినట్లు ఆ పత్రిక పేర్కొంది. దీంతో కొన్ని వారాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ఇజ్రాయెల్‌ విరామం ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అమెరికా, ఖతార్‌ మధ్యవర్తిత్వంలో దోహాలో జరిగిన చర్చల్లో హమాస్‌- ఇజ్రాయెల్‌కు మధ్య ఆరు పేజీల ఒప్పందం కుదిరినట్లు కథనంలో పేర్కొంది.

దక్షిణ గాజా నుంచీ వెళ్లిపోండి

ఒప్పందం ప్రకారం.. పౌరులకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు ఐదు రోజుల పాటు కాల్పుల విరమణ అమలు చేసే అవకాశం ఉందని వెల్లడించింది.  వాషింగ్టన్‌ పోస్టు ప్రకారం.. మరికొన్ని రోజుల్లో కాల్పుల విరమణ ప్రారంభం కానుంది. అయితే, వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ ప్రతినిధి బందీల పరిస్థితి, ఒప్పందంపై మాట్లాడేందుకు నిరాకరించినట్లు కథనంలో పేర్కొంది.

ఇజ్రాయెల్‌-హమాస్‌లు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీరించినట్లు వస్తున్న వార్తలను వైట్‌హౌస్‌ తోసిపుచ్చింది. ‘‘ఇరువైపులా కాల్పుల విరమణకు మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదు’’ అని వైట్‌హౌస్‌ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై జరిగిన మెరుపు దాడిలో 1200 మంది చనిపోగా.. 240 మంది పౌరులను హమాస్‌ బందీలుగా చేసుకొంది. వీరిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని