BA.2.86: కరోనా కొత్త వేరియంట్‌ వెలుగులోకి.. అప్రమత్తమైన WHO, సీడీసీ!

అమెరికాలో కరోనా కొత్త రకం వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది. బీఏ.2.86గా పేర్కొన్న ఈ వేరియంట్‌ను.. అమెరికాతోపాటు డెన్మార్క్‌, ఇజ్రాయెల్‌లోనూ గుర్తించారు.

Updated : 18 Aug 2023 15:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 (Corona Virus) వ్యాప్తి, తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ కొత్త వేరియంట్లు కలవరపెడుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో కొవిడ్‌ 19కి చెందిన కొత్త రకాన్ని గుర్తించారు. ఈ వేరియంట్‌ను బీఏ.2.86గా పేర్కొన్నారు. దీనిని అమెరికాతోపాటు డెన్మార్క్‌, ఇజ్రాయెల్‌లోనూ కనుగొన్నారు. దీంతో అప్రమత్తమైన అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం (CDC).. దీన్ని ట్రాక్‌ చేసే పనిలో నిమగ్నమైంది. ఈ రకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని.. కరోనా నుంచి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది.

సంప్రదాయ ఔషధాలకు భారత్‌ మూలం: డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ డా.టెడ్రోస్‌

ఈ బీఏ.2.86 కొత్త రకానికి సంబంధించి అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా స్పందించింది. ఇందులో భారీ సంఖ్యలో ఉత్పరివర్తనాలు చోటుచేసుకుంటున్నందున.. ప్రస్తుతం దీన్ని ‘వేరియంట్‌ అండర్‌ మానీటరింగ్‌’గా పేర్కొన్నామని తెలిపింది. ఈ రకానికి చెందిన సీక్వెన్స్‌లు కొన్ని దేశాల్లోనే వెలుగు చూశాయని.. ప్రస్తుతం మూడు వేరియంట్‌ ఆఫ్‌ ఇంటెరెస్ట్‌లతోపాటు ఏడు వేరియంట్స్‌ అండర్‌ మానిటరింగ్‌లను ట్రాకింగ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్‌ వ్యాప్తి, తీవ్రతను అర్థం చేసుకునేందుకు మరింత సమాచారం అవసరమని.. దీనిపై ప్రపంచ దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటున్నట్లు తెలిపింది.

ప్రపంచానికి ముప్పే..!

కొవిడ్‌-19 ఆరోగ్య అత్యయిక స్థితి కాకున్నా ప్రపంచానికి ఇదొక ముప్పేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ ఘెబ్రెయేసస్‌ పేర్కొన్నారు. ఇక కొత్తగా గుర్తించిన బీఏ.2.86 వేరియంట్‌ను ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నామన్నారు. గుజరాత్‌లో జరుగుతోన్న జీ20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో పాల్గొన్న టెడ్రోస్‌.. ప్రారంభోపన్యాసం చేశారు.

‘కొవిడ్‌-19 మనందరికీ నేర్పిన ముఖ్యమైన పాఠం ఏంటంటే.. ఆరోగ్య ముప్పు ఉంటే ప్రతీదీ ముప్పేనని. మహహ్మారి నుంచి బాధాకరమైన పాఠాలను ప్రపంచదేశాలు నేర్చుకుంటున్నాయి. ప్రస్తుతం కొవిడ్‌-19 అంతర్జాతీయ ఆరోగ్య అత్యయికస్థితి కానప్పటికీ దీని నుంచి ఇంకా ముప్పు పొంచి ఉంది. కొత్తగా వెలుగుచూసిన వేరియంట్‌లో ఎన్నో పరివర్తనాలు ఉన్నాయి. దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఇటువంటి కొత్త వేరియంట్లు ఎత్తిచూపుతున్నాయి. ఈ క్రమంలో ‘మహమ్మారి ఒప్పందం’ (Pandamic Accord) ఖరారు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నా. తద్వారా వచ్చే ఏడాది జరిగే ప్రపంచ ఆరోగ్య సమావేశం (World Health Assembly)లో దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది’ అని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని