Cough Syrup: ‘ఆ దగ్గు మందు వినియోగం సురక్షితం కాదు’.. భారత్‌లో తయారైన సిరప్‌పై WHO హెచ్చరికలు

భారత్‌లో ఓ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు ప్రమాదకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఇరాక్‌లో ఉపయోగిస్తున్న ఈ దగ్గ మందు నమూనాల్లో నాణ్యతా లోపాన్ని గుర్తించామని తెలిపింది.

Published : 08 Aug 2023 14:26 IST

జెనీవా: భారత్‌లో తయారైన దగ్గు మందు వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేసింది. జలుబు, దగ్గు నివారణ కోసం ‘కోల్డ్‌ అవుట్‌’ (Cold Out) పేరుతో రూపొందించిన సిరప్‌లో పరిమితికి మించి డైథిలీన్‌, ఇథలీన్‌ గ్లైకాల్‌లు ఉన్నట్లు తెలిపింది. చెన్నైకి చెందిన ఫోర్ట్స్‌ లేబోరేటరీస్‌ (Fourrts Laboratories) ఇరాక్‌లోని డాబిలైఫ్‌ ఫార్మా కోసం ఈ దగ్గు మందును తయారుచేసింది. ఇరాక్‌లో ఉపయోగిస్తున్న కోల్డ్‌ అవుట్ నమూనాల్లో డైథిలీన్‌, ఇథలీన్‌ గ్లైకాల్‌లు పరిమితికి మించి ఉన్నట్లు గుర్తించామని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. దీని వినియోగం ఏ మాత్రం సురక్షితం కాదని సూచించింది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ సిరప్‌ను ఉపయోగిస్తే తీవ్ర అస్వస్థతకు గురై మరణం సంభవించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. 

జలుబు సిరప్‌లో డైథిలీన్‌, ఇథలీన్‌ వినియోగానికి 0.10 శాతం పరిమితి ఉంటే.. కోల్డ్‌ అవుట్‌లో 0.25 శాతం డైథిలీన్‌, 2.1 శాతం ఇథలీన్‌ గ్లైకాల్‌లు ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈ సిరప్‌ భద్రత, నాణ్యత గురించి డబ్ల్యూహెచ్‌వో అడిగిన వివరాలను సైతం కంపెనీ సమర్పించలేదని ఆరోపించింది. ఇటీవలి కాలంలో భారత్‌లో తయారైన సిరప్‌ గురించి డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేయడం ఇదే ప్రథమం. ప్రస్తుతం కోల్డ్‌ అవుట్‌ సహా భారత్‌లో తయారైన ఐదు దగ్గు మందులు డబ్ల్యూహెచ్‌వో పరిశీలనలో ఉన్నాయి. 

గుండెకు మూడు సర్జరీలు.. అయినా గిన్నిస్‌ రికార్డు..!

గతంలో భారత్‌లో తయారైన దగ్గు మందులను ఉపయోగించడం వల్ల ఉజ్బెకిస్థాన్‌లోని గాంబియాలో 89 మంది చిన్నారులు మృతి చెందారు. దీంతో సిరప్‌ను ఉజ్బెకిస్థాన్‌కు సరఫరా చేసిన మరియోన్‌ బయోటెక్‌ అనుమతులను భారత్‌ ప్రభుత్వం రద్దు చేసింది. అంతకముందు కామెరూన్‌లో చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందు తయారు చేసిన రీమాన్‌ ల్యాబ్స్‌ కూడా సిరప్‌ తయారీలో నాణ్యత పాటించలేదని విచారణలో తేలింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని