Justin Trudeau: చట్ట పాలన కోసం ఎప్పుడూ పనిచేస్తా: జస్టిన్‌ ట్రూడో

కెనడా ప్రధాని ట్రూడో మరోసారి భారత్‌పై ఆరోపణలు చేశారు. వియన్నా ఒప్పందాన్ని న్యూదిల్లీ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. తమ దేశం చట్టబద్దపాలన కోసం పనిచేస్తుందన్నారు. 

Published : 13 Nov 2023 02:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో మరోసారి ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తాజాగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ హత్య కేసులో నిజానిజాలను తేల్చేందుకు భారత్‌, మిత్రదేశాలైన అమెరికాతో కలిసి పనిచేసేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. ‘‘ఈ సారి మేము దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. లా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు వాటి పని అవి చేస్తుంటే.. మేము మా భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం. మా దేశం చట్ట పాలనకు కట్టుబడి ఉంటుంది. పెద్ద దేశాలు చట్టాలను ఉల్లంఘించినా.. ఎటువంటి పరిణామాలు ఎదుర్కోకపోతే భవిష్యత్తులో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రమాదంలో పడతారు’’ అని పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన కెనడా పార్లమెంట్‌ సభ్యుడు చందన్‌ ఆర్యా ఇటీవల భారత హైకమిషనర్‌ సంజీవ్‌ కుమార్‌ వర్మను ఆహ్వానించినప్పుడు జరిగిన ఘటనపై అడగ్గా ట్రూడో ఇలా స్పందించారు.

స్ట్రైకర్‌.. శత్రు భయంకర్‌!

భారత్‌ వియన్నా ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించిందని ట్రూడో ఆరోపించారు. తమ దౌత్యవేత్తలను అన్యాయంగా వెనక్కి పంపిందన్నారు. ‘‘ఆ ఘటన నన్ను నిరాశపర్చింది.  మా వైపు నుంచి ఒక్కసారి ఆలోచించండి. నిజ్జర్‌ హత్య కేసులో భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందని నమ్మడానికి మాకు బలమైన కారణాలున్నాయి. కానీ, దీనికి భారత్‌ స్పందిస్తూ.. వియన్నా ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ మా దౌత్యవేత్తలను వెళ్లగొట్టింది. ప్రపంచ దేశాలకు అది ఆందోళన కలిగిస్తోంది. మా దౌత్యవేత్తల భద్రతపై  ఆందోళన నెలకొంది. ఇది అంతర్జాతీయ సంబంధాల్లో తీవ్రమైంది. కానీ, ప్రతి అడుగులోనూ మేము భారత్‌తో సానుకూలంగా కలిసి పనిచేయాలని అనుకున్నాం. భవిష్యత్తులో కూడా భారత్‌, ఆ దేశ దౌత్యవేత్తలతో కలిసి పనిచేస్తాము. మేము ఎప్పుడు చట్టబద్దపాలన కోసం  పనిచేసే దేశం’’ అని ట్రూడో వెల్లడించారు.

ఈ నెల మొదట్లో భారత రాయబారి సంజీవ్‌ వర్మ ఓ పత్రికతో  మాట్లాడుతూ కెనడా ఉన్నతాధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  జూన్‌లో నిజ్జర్‌ హత్య తర్వాత కెనడా పోలీసులు చేపట్టిన దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆ దేశ అత్యున్నత స్థాయిలో అధికారులు బహిరంగ ప్రకటనలు చేశారని ఆరోపించారు.  ఈ కేసు దర్యాప్తులో వారికి భారత్ సహకరించడానికి అవసరమైన ఆధారాలను మాత్రం ఇప్పటి వరకు సమర్పించలేదన్నారు. ‘‘ఆధారాలు ఎక్కడున్నాయి..? విచారణలో ఏమి తేలింది..? నేను ఒక అడుగు ముందుకేసి చెబుతున్నాను.. కేసు దర్యాప్తు మొత్తాన్ని తారుమారు చేశారు. ఈ హత్యలో భారత్‌.. ఆ దేశ ఏజెంట్లు ఉన్నట్లు చెప్పాలని కెనడాలోని అత్యున్నత స్థాయి అధికారుల నుంచి సూచనలు జారీ అయ్యాయి’’ అని వర్మ  వెల్లడించిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని