Bank loan: రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!

తప్పుడు మార్గంలో బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు యత్నించిన ఓ మహిళ ఏకంగా చనిపోయిన తన బంధువును బ్యాంకుకు తీసుకొచ్చింది.

Updated : 18 Apr 2024 20:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకు రుణం కోసం కొందరు తప్పుడు మార్గాలు వెతుకుతుంటారు. నకిలీ దస్త్రాలు సృష్టించి రుణం పొందేందుకు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. కానీ, ఓ మహిళ మాత్రం ఏకంగా చనిపోయిన వ్యక్తి పేరుపై రుణం పొందేందుకు అతడినే బ్యాంకుకు తీసుకువచ్చింది. మృతదేహాన్ని వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టి అతడు ప్రాణాలతో ఉన్నట్లు నమ్మించే ప్రయత్నం చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

బ్రెజిల్‌ (Brazil)కు చెందిన 42 ఏళ్ల ఎరికా డిసౌజా వియెరా నూనెస్ తన సమీప బంధువు పాలో రాబర్టో బ్రాగా (68)తో కలిసి రియో డి జనీరోని ఓ బ్యాంకుకు వెళ్లింది. అతడిని వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టి లోపలికి తీసుకెళ్లింది. అతడితో మాట్లాడుతున్నట్లు నటిస్తూ.. అధికారులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. 3,250 డాలర్లు (సుమారు రూ.2.70 లక్షలకు పైగా) రుణం పొందేందుకు ఏ మాత్రం కదలిక లేని బ్రాగాతో పత్రాలపై సంతకం చేయించేందుకు ప్రయత్నించింది.

సోషల్‌ మీడియా వెర్రి ముదిరి సంకెళ్లు

సిబ్బందికి అనుమానం రావడంతో ఆమె బండారం బయటపడింది. ఎరికా తీసుకొచ్చింది మృతదేహాన్ని అని తెలిసి అక్కడున్నవారంతా కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని