Gaza: తీరానికి చేరిన ఆహారం చేజారి..! గాజావాసులపై ఇజ్రాయెల్‌ ‘దాడి’ ఎఫెక్ట్‌

గాజాకు ఆహారాన్ని చేరవేస్తోన్న ‘వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌’ సంస్థ సిబ్బందిపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో ఆరుగురు మృతి చెందారు. దీంతో తక్షణమే తమ సహాయ కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. 

Published : 02 Apr 2024 18:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యుద్ధం (Israel Hamas War) కారణంగా ఇప్పటికే ఆకలితో అల్లాడుతోన్న గాజావాసుల పాలిట ఇజ్రాయెల్‌ దుందుడుకు చర్య శాపంగా మారింది. ఆ దేశం జరిపిన గగనతల దాడిలో ‘వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌ (WCK)’ స్వచ్ఛందసంస్థకు చెందిన ఆరుగురు విదేశీ సహాయకులు, ఓ స్థానిక డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. గాజా(Gaza)కు సముద్ర మార్గం ద్వారా వేల టన్నుల ఆహారాన్ని చేరవేస్తోన్న ‘డబ్ల్యూసీకే’.. తాజా పరిణామంతో తక్షణం తమ సహాయ కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేసిన ఇజ్రాయెల్‌ స్వతంత్ర దర్యాప్తును చేపడతామని తెలిపింది.

ఇరాన్‌ టాప్‌ కమాండర్లు మృతి.. ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్‌కు హెచ్చరిక!

‘‘సంబంధిత సహాయక సిబ్బంది తమ మూడు వాహనాల రూట్‌మ్యాప్‌ వివరాలను ఇజ్రాయెల్‌ సైన్యంతో పంచుకున్నారు. అయినప్పటికీ.. మధ్య గాజాలోని దీర్ అల్ బలాహ్‌లో ఉన్న ఆహార గిడ్డంగి నుంచి బయలుదేరిన సమయంలో ఈ దాడి జరిగింది. అంతకుముందే వారు 100 టన్నులకు పైగా ఆహార సామగ్రిని అక్కడ దించారు’’ అని డబ్ల్యూసీకే తెలిపింది. మృతుల్లో ముగ్గురు బ్రిటన్‌వాసులతోపాటు ఆస్ట్రేలియా, పోలండ్‌, అమెరికా- కెనడాకు చెందిన వారున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ దాడి ఆమోదయోగ్యం కాదని, దీనిపై ఇజ్రాయెల్‌ నుంచి వివరణ కోరినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌ చెప్పారు.

సహాయక నౌకలు వెనక్కి..!

‘‘ఇది కేవలం మా సంస్థపై జరిగిన దాడి కాదు. ఆహారాన్నే ఆయుధంగా మలచుకొని సాగిస్తోన్న యుద్ధంలో మానవతా సంస్థలపై చేపట్టిన దాడి. ఇది క్షమించరానిది’’ అని సంస్థ సీఈవో ఎరిన్ గోర్ వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. ‘డబ్ల్యూసీకే’ గత నెలలో సైప్రస్‌ నుంచి సముద్ర మార్గంలో తొలిసారి 200 టన్నుల ఆహారాన్ని చేరవేసింది. తాజాగా మరో మూడు నౌకలు దాదాపు 400 టన్నుల సామగ్రితో గాజా తీరానికి చేరుకున్నాయి. అయితే.. సంస్థ సహాయ కార్యకలాపాల నిలిపివేతతో ఆ నౌకలు వెనక్కి వచ్చేస్తున్నట్లు సైప్రస్‌ అధికారులు తెలిపారు. అప్పటికే 100 టన్నుల సరకును దించినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని