Shipwreck: వెయ్యికిపైగా యుద్ధఖైదీలతో మునిగిన నౌక.. 81 ఏళ్లకు ఆచూకీ లభ్యం!

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వెయ్యికిపైగా యుద్ధఖైదీలతో వెళ్తూ మునిగిపోయిన ఓ నౌక ఆచూకీని 81 ఏళ్ల తర్వాత కనుగొన్నారు. ఈ ఘటనలో 979 మంది ఆస్ట్రేలియన్లతోసహా 14 దేశాలకు చెందిన మొత్తం 1,080 మంది జలసమాధి అయ్యారు.

Published : 22 Apr 2023 15:23 IST

కాన్‌బెర్రా: రెండో ప్రపంచ యుద్ధ సమయం (World War  II)లో వెయ్యికిపైగా యుద్ధ ఖైదీలను తరలిస్తుండగా మునిగిపోయిన ఓ జపాన్‌ నౌక ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. ఫిలిప్పీన్స్‌ (Philippines)లోని లుజోన్ ద్వీప తీరంలో దక్షిణ చైనా సముద్రం (South China Sea)లో 4 వేలకుపైగా మీటర్ల లోతులో ‘ఎస్‌ఎస్‌ మాంటెవీడియో మారు (SS Montevideo Maru)’ నౌక ఆచూకీ లభించినట్లు ఆస్ట్రేలియా (Australia) ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ శనివారం వెల్లడించారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆస్ట్రేలియా సమీపంలోని పపువా న్యూగినియాలో పట్టుబడిన వెయ్యికిపైగా యుద్ధ ఖైదీలు, పౌరులతో కూడిన ఓ జపాన్‌ నౌక.. 1942 జూన్‌ 22న అప్పటి జపాన్ ఆక్రమిత హైనాన్ ద్వీపానికి బయల్దేరింది. అయితే, మిత్రరాజ్యాలకు చెందిన పౌరులను తీసుకెళ్తోందన్న విషయం తెలియని ఓ అమెరికా జలాంతర్గామి.. జులై 1న దాడి చేయడంతో ఈ నౌక మునిగిపోయింది. ఈ ఘటనలో 979 మంది ఆస్ట్రేలియన్లతోసహా 14 దేశాలకు చెందిన మొత్తం 1,080 మంది జలసమాధి అయ్యారు. ఆస్ట్రేలియా సముద్ర చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటన ఇది.

ఈ క్రమంలోనే.. మునిగిపోయిన ఈ నౌక ఆచూకీని కనుగొనాలనే డిమాండ్‌ మొదలైంది. ఆస్ట్రేలియా రక్షణ శాఖ, పురావస్తు విభాగం, సైలెంట్‌ వరల్డ్ ఫౌండేషన్‌లు కలిసి.. నెదర్లాండ్‌కు చెందిన సముద్ర సర్వే సంస్థ ‘ఫుగ్రో’ సాయంతో ప్రత్యేక మిషన్‌ను నిర్వహించాయి. అత్యాధునిక పరికరాలు వినియోగించాయి. ఎట్టకేలకు ప్రమాదం జరిగిన 81 ఏళ్ల తర్వాత దక్షిణ చైనా సముద్ర గర్భంలో నౌక ఆచూకీ లభ్యమైంది. దేశ సేవ చేసిన వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామన్న తమ నిబద్ధతను ఇది చాటుతుందని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని