46 జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

ప్రధానాంశాలు

46 జిల్లాల్లో కఠిన ఆంక్షలు..

కరోనా పాజిటివిటీ రేటు 10% దాటడమే కారణం

అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం

ఏపీ సహా 10 రాష్ట్రాల్లోని పరిస్థితులపై సమీక్ష

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా నమోదవుతున్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్దేశించింది. 46 జిల్లాల్లో 10%కి పైగా, 53 జిల్లాల్లో 5-10% మధ్య పాజిటివిటీ రేటు నమోదవుతున్నట్లు తెలిపింది. రోజురోజుకీ కరోనా కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతున్న 10 రాష్ట్రాల్లోని పరిస్థితులపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ శనివారం సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అస్సాం, మిజోరం, మేఘాలయ, మణిపుర్‌లలో స్థితిగతులపై ఆయన కూలంకషంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవతో పాటు, జాతీయ ఆరోగ్య మిషన్‌ డైరెక్టర్‌, రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలరాం భార్గవ రాష్ట్రాలను అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో అలసత్వం కారణంగా గత వారం రోజులుగా రోజూ 40 వేలకు పైగా కేసులు నమోదవుతూ వస్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రాలు పరీక్షల సంఖ్య పెంచాలని సూచించారు. జిల్లాస్థాయిలో పరిస్థితులను తెలుసుకొనేందుకు రాష్ట్రాలు స్థానికంగా సీరో సర్వే నిర్వహించాలన్నారు. కొవిడ్‌తో చనిపోతున్న వారిలో 80% మంది 45 ఏళ్లు పైబడిన వారే ఉంటున్నందున ఆ వర్గాలకు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు. అనవసర ప్రయాణాలను, ప్రజలు గుంపులుగా గుమిగూడటాన్ని తక్షణం నియంత్రించాలని రాష్ట్ర అధికారులకు సూచించారు. అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించేందుకు ఇన్సాకాగ్‌ లేబొరేటరీ నెట్‌వర్క్‌ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు.

* 10%కి మించి పాజిటివిటీ రేటు నమోదవుతున్న జిల్లాల్లో ప్రజల కదలికలు, గుంపులుగా చేరడం, పరస్పరం కలుసుకోవడం లాంటి వాటిపై కఠిన ఆంక్షలు విధించాలి. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదు. ఈ రాష్ట్రాల్లో 80% కొవిడ్‌ బాధితులు (క్రియాశీలక కేసులు) గృహ ఏకాంతవాసంలో ఉండటంతో వీరిపై సూక్ష్మమైన నిఘా ఉంచాలి. వారు బయట తిరుగుతూ, ఇరుగు పొరుగు వారితో మాట్లాడకుండా చూడాలి. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆసుపత్రి సేవలు అవసరమైతే వేగంగా తరలించి వైద్యసేవలు అందించాలి.

* పాజిటివిటీ రేటు 10% లోపు ఉన్న జిల్లాల పైనా దృష్టి సారించాలి. ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పించడానికి పూర్తిస్థాయిలో అందరికీ వ్యాక్సిన్‌ అందించడానికి చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 15 రోజుల ముందే వ్యాక్సిన్‌ సరఫరా వివరాలు చెబుతున్నందున అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకోవాలి.

* ప్రైవేటు ఆసుపత్రుల్లో పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయాలి. ఇప్పటికే ఇలాంటి ఆదేశాలు ఇస్తే.. ఆ ప్లాంట్ల ఏర్పాటు ఎంతవరకు వచ్చిందో సమీక్షించి, తక్షణం ప్రారంభమయ్యేలా చూడాలి.

* ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కేసుల మ్యాపింగ్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ఆధారంగా కంటెయిన్‌మెంట్‌ జోన్లను అమలు చేయాలి. గ్రామాల్లో వైద్య సౌకర్యాలను నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం మరణాల లెక్కలను ప్రకటించాలి.


రాష్ట్రాలకు రూ. 1,827 కోట్ల విడుదల
కొవిడ్‌ అత్యవసర స్పందన ప్యాకేజీ

దిల్లీ: కొవిడ్‌-19 అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధత (ఈసీఆర్‌పీ-2) ప్యాకేజీ కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ. 1,827.8 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ శనివారం తెలిపారు. ఈ ప్యాకేజీ కింద కేంద్రం మొత్తం రూ. 12,185 కోట్లు కేటాయించగా తాజాగా 15% నిధులు విడుదల చేసినట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. కొవిడ్‌తో పోరులో భాగంగా రూపొందించిన ఈ ప్యాకేజీ దేశవ్యాప్తంగా ఆరోగ్య వసతుల అభివృద్ధికి దోహదపడతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించిందీ సూచించే ఇన్ఫోగ్రాఫిక్స్‌ను ఆయన పొందుపరిచారు. తాజాగా విడుదల చేసిన నిధుల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.281.98 కోట్లు మంజూరు చేశారు. బిహార్‌ (రూ. 154 కోట్లు), రాజస్థాన్‌ (రూ. 132 కోట్లు), మధ్యప్రదేశ్‌ (రూ. 131 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


క్రియాశీలక కేసులు పైపైకి..
4 రోజులుగా పెరుగుదల
24 గంటల్లో 41,649 మందికి వైరస్‌

దిల్లీ: దేశంలో కొవిడ్‌ రోజువారీ కేసుల సంఖ్య శనివారం కొంత తగ్గినప్పటికీ.. క్రియాశీలక కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 4 రోజులుగా క్రియాశీలక కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. గత 24 గంటల్లో 41,649 కొత్త కేసులు బయటపడగా.. 593 మంది ప్రాణాలు కోల్పోయారు.

* ఒక రోజులో 37,291 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. వరుసగా నాలుగో రోజు కోలుకున్నవారి కంటే కొత్త కేసుల సంఖ్య ఎక్కువ నమోదైంది. దీంతో క్రియాశీలక కేసుల సంఖ్య 4,08,920 (1.29%)కి పెరిగింది. రికవరీ రేటు కూడా స్వల్పంగా తగ్గి 97.37%కి చేరింది.

* దేశవ్యాప్తంగా శుక్రవారం 17,76,315 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34 శాతం నమోదైంది. వారపు పాజిటివిటీ రేటు 2.42%కి చేరింది. దేశంలో ఇంతవరకు మొత్తం 46.64 కోట్లకు పైగా కరోనా పరీక్షలు జరిపారు.

* మహారాష్ట్రలో కొవిడ్‌ మరణాలు క్రితం రోజు కంటే పెరిగాయి. 24 గంటల్లో 231 మంది మృతి చెందారు. కేరళలో 116 మరణాలు సంభవించాయి. ఒడిశా (66) మినహా మిగిలిన రాష్ట్రాల్లో కొవిడ్‌ మరణాల సంఖ్య 35 లోపే ఉంది.

* 12 రాష్ట్రాల్లో క్రియాశీలక కేసులు పెరిగాయి. అత్యధికంగా కేరళలో వీటి సంఖ్య 6 వేలకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని