Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

ఆదివార అనుబంధం

Facebook Share Twitter Share Comments Telegram Share

జాహ్నవి కళ్యాణం

- ఉమాబాల చుండూరు

పొద్దున్న తొమ్మిదింటికల్లా లైబ్రరీలోకి వెళ్లి తన సీట్‌లో కూర్చుని హ్యాండ్‌బ్యాగ్‌ లోంచి తాళంచెవి తీసి, టేబుల్‌ డ్రా ఓపెన్‌ చేసి, అక్కడ ఉన్న డస్టర్‌ క్లాత్‌ తీసుకుని టేబుల్‌ తుడిచి ఇంకో అరలోనుండి ల్యాప్‌టాప్‌ తీసి అది కూడా తుడిచి ఓపెన్‌ చేసింది జాహ్నవి. ఇంతలో ఫోన్‌ మోగితే తీసి, ‘ఆ... అమ్మా జాగ్రత్తగానే వచ్చాను నువ్వు టైమ్‌కి మందులేసుకుని తిను’ అని చెప్పి ఫోన్‌ కట్‌ చేసింది.

మణి ప్రభ, సోమశేఖరం గార్లకి జాహ్నవి పెద్దకూతురు. తరువాత శ్రీకరి, ఆదిత్య. సోమశేఖరం గారు ఒక ప్రైవేట్‌ కంపెనీలో అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఆఫీసర్‌గా రిటైరయ్యారు.

ఊళ్లో తండ్రి ఇచ్చిన ఇల్లు అమ్మి తన సేవింగ్స్‌కు తోడు కొంచెం లోన్‌ తీసుకుని చిన్న ఇల్లు ఏర్పరచుకున్నారు ఆయన. ఆ ఇంట్లో ఒక పోర్షన్‌లో వాళ్లు ఉండగా రెండు గదులు ఒక చిన్న కుటుంబానికి అద్దెకి ఇచ్చారు. ఇంటిలోన్‌ అయితే తీర్చారు గానీ, కూతురి పెళ్లీ, మిగతా ఇద్దరు పిల్లల బాధ్యతలూ ఉన్నాయి.

ప్రైవేట్‌ కంపెనీ కాబట్టి ఆయన పీఎఫ్‌ తప్పితే ఏమీ రాలేదు. ఇంటి దగ్గరే కొంతమంది పిల్లలకి ట్యూషన్స్‌ చెబుతూ ఉంటారు.
జాహ్నవి డిగ్రీ తరువాత లైబ్రరీ సైన్స్‌ చదివింది. శ్రీకరి ఇప్పుడు పదో తరగతి, ఆదిత్య ఎనిమిది చదువుతున్నారు.

జాహ్నవికి డిగ్రీ అవగానే సిటీలో సెంట్రల్‌ లైబ్రరీలో లైబ్రేరియన్‌గా ఉద్యోగం వచ్చింది. ఇంకా చిన్నదే కాబట్టి ఇంకో రెండేళ్ల తరువాత పెళ్లి చేద్దామని ఆలోచన ఇంట్లో వాళ్లది.

పిల్లల్ని చాలా పద్ధతిగా సంస్కారంతో పెంచారు. అసలు ఈ రోజుల్లో పిల్లల్లా ఉండదు జాహ్నవి. చాలా ఒద్దికగా తన పని తను చేసుకుని వెళ్లిపోయే మనస్తత్వం. ఎక్కువ తక్కువ మాట్లాడదు. ఇంక ఉద్యోగం కూడా

నిశ్శబ్దంగా ఉండాల్సివచ్చే లైబ్రరీలో కాబట్టి ఇంకా హాయిగా ఉంది జాహ్నవికి.

ఒక్కొక్కళ్లూ లైబ్రరీలోకి రావడం మొదలయ్యింది. జాహ్నవి సెంట్రల్‌ లైబ్రరీలో లేడీస్‌ వింగ్‌లో లైబ్రేరియన్‌గా చేరి మూడు నెలలు అయ్యింది.

పొద్దున్న ఎనిమిదికల్లా బయలుదేరి బస్సులెక్కి వచ్చేటప్పటికి తొమ్మిది అవుతూ ఉంటుంది. ఒక్కోసారి తొమ్మిది దాటుతుంది. బస్‌ లేట్‌గా రావడమో, దిగాకా నడుచుకుంటూ రావడంతో ఎక్కడో కొద్దిగా ఆలస్యమవుతుంది. ఆ రోజు చాలా కంగారు పడిపోతుంది జాహ్నవి. అక్కడ ఎవ్వరూ ఏమీ అనకపోయినా ఏదో టెన్షన్‌గా తప్పు చేసినట్లుగా ఉంటుంది. ఇంతలో ఇద్దరు లేడీ హెల్పర్స్‌ వచ్చారు.

ఒకళ్లు కింద నేలంతా చీపురుతో శుభ్రం చేస్తే, ఇంకొకళ్లు ఆ రోజు దినపత్రికలన్నీ, తెలుగువి ఒకచోట ఇంగ్లీష్‌వి ఒకచోట నీట్‌గా సర్ది, ఒక గుడ్డ తీసుకుని పుస్తకాల రాక్‌లూ, మిగిలిన ఫర్నిచర్‌ తుడుస్తుంటారు. తరువాత అక్కడున్న ప్లాస్క్‌ కడిగి బయట నుంచి టీ తెచ్చి అక్కడున్న స్టాఫ్‌కి ఇచ్చి వాళ్లు తీరికగా తాగడంతో వాళ్ల పని అయిపోతుంది.

ఇంక ఎక్కడో చాటున కూర్చుని గుస గుస లాడుకోవడం, ఫోన్లు మాట్లాడుకోవడంతోనే సరిపోతుంది.

జాహ్నవి కొత్తగా వచ్చిన బుక్స్‌ ల్యాప్‌టాప్‌లో ఎంటర్‌ చెయ్యడం... రాని వాటిని ఫాలో చెయ్యడం... కొత్తవాటికి ఇండెంట్‌ పెట్టడం... అప్రూవ్‌ అయిన ఇండెంట్‌లోని పుస్తకాలు ఆర్డర్‌ ఇవ్వడం... పాడైన పుస్తకాలూ, పాత పుస్తకాలూ తిరిగి నీట్‌గా బైండింగ్‌కి ఇవ్వడం... లాంటి పనులు చేస్తుంది.

సాయంత్రం అయిదు గంటల వరకూ తన పనేదో తను చేసుకుంటూ ఉంటుంది. లంచ్‌ టైమ్‌లో కాస్త టైమ్‌ ఉంటే న్యూస్‌ పేపర్‌ తిరగేస్తుంది. పనివేళలో ఎప్పుడూ ఏ పేపర్‌గానీ పుస్తకంగానీ కన్నెత్తి చూడదు.
అంతా సజావుగా సాగిపోతోంది గానీ ఈ మధ్య చిన్న సమస్య ముల్లులా గుచ్చుతోంది జాహ్నవికి. ఎవరికీ చెప్పుకునేంత సమస్యకాదు అలా అని సర్దుకుపోయే విషయం కాదు.

అదే లైబ్రరీ హాల్‌లో మగవాళ్లకు వేరే వింగ్‌ ఉంది. ఏదో మధ్యలో రెండు మూడు పుస్తకాల ర్యాక్‌లు అడ్డంగా ఉంటాయి గానీ అంతా ఒకటే పెద్ద హాలు. వేరే వేరే ప్రవేశ ద్వారాలు ఉన్నాయి.

మగవాళ్ల సెక్షన్‌లో ఉండే లైబ్రేరియన్‌ పేరు వినోద్‌కుమార్‌. ఒక నెల రోజుల నుంచి ఏదో పని వంకతో జాహ్నవి దగ్గరకి రావడం, తన టేబుల్‌ ముందు కూర్చోవడం, అనవసరమైన డౌట్స్‌ అడగడం చేస్తున్నాడు. పక్కనే నిలబడి, తనకి కొన్ని పనులు రావడం లేదనీ, గైడ్‌ చేయమనీ అడుగుతుంటాడు. జాహ్నవి ర్యాక్‌ ముందు నిలబడి ఎవరో అడిగిన పుస్తకం కోసం చూస్తుంటే అక్కడికీ వచ్చేస్తాడు, ఏదో వంకతో. అక్కడ నిలబడితే వాళ్లిద్దరూ బయటి వాళ్లకి కనపడరు. జాహ్నవికి భయం వేసి అతను రాగానే గబగబా తన సీట్‌కు వచ్చేస్తుంది.

ఇంక లంచ్‌ అయ్యాక హాయిగా కాసేపు పేపర్‌ చూసే భాగ్యం కూడా జాహ్నవికి ఉండడం లేదు ఈ మధ్య. వినోద్‌ తను తొందరగా తినేసి వచ్చి జాహ్నవి దగ్గర కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుతున్నాడు. ఒక్కోసారి జాహ్నవి ఇంకా తింటుండగానే వచ్చేస్తున్నాడు. జాహ్నవికి అతని ముందు తినడం మొహమాటంగా ఉండి అతను రాగానే తినకుండా బాక్స్‌ మూసేస్తోంది.

‘అయ్యో తినండి’ అంటాడు గానీ కదలడు. అతను అలా తన ముందు కూర్చుంటే ఎవరు ఏమనుకుంటారో అని భయపడుతూ ఉంటుంది జాహ్నవి.

ఒకటి రెండుసార్లు అక్కడ పనిచేసే ఇద్దరు లేడీస్‌ అన్నారు కూడా... ‘‘ఏందయ్యా వినోదూ, బయటికి పోయి సిగరెట్టు కాల్చి లేటుగా వచ్చేవాడివి, ఈ మధ్య జల్దీ వచ్చేస్తున్నావు’’ అని. దానికి అతను ‘‘సిగరెట్టు కాల్చడం ఎప్పుడో మానేశాను. జాహ్నవిగారు కొత్తగా వచ్చారు కదా ఆవిడకి మన లైబ్రరీలో తెలియని విషయాలు చెబుతున్నా’’ అనేవాడు.

సాయంత్రం లేడీస్‌ వింగ్‌ తొందరగా మూసేసేవారు. ఆడవాళ్లు వచ్చేది 11 గంటల నుండి 4:30 వరకే. 5 గంటలకల్లా ఇంటికి బయలుదేరేది జాహ్నవి.

ఒకరోజు బస్‌స్టాప్‌లో బస్‌ కోసం నిలబడి ఉండగా వచ్చాడు వినోద్‌. ‘హాయ్‌’ అని పలకరించి ‘‘ఈరోజు పర్మిషన్‌ తీసుకుని వచ్చాను కాఫీ తాగుదాం రండి’’ అన్నాడు.

జాహ్నవి ‘‘వద్దండీ, నేను వెళ్లిపోవాలి’’ అంటే ‘‘రోజూ వెళ్లే ఇల్లే కదండీ. ఒక కప్పు కాఫీ తాగుదాం పదండి’’ అన్నాడు. ఇంతలో జాహ్నవి ఎక్కే బస్‌ రావడంతో, జాహ్నవి చటుక్కున బస్‌ ఎక్కేసి లోపలికి వెళ్లిపోయింది. వెంటనే బస్‌ స్టార్ట్‌ అవడంతో బతుకుజీవుడా అనుకుంది. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా విసిగించేవాడు. జాహ్నవికి ఇబ్బందిగా ఉన్నా ఎవరికీ చెప్పలేని పరిస్థితి. ఇంట్లో చెప్తే ఉద్యోగం మానేయమంటారు. తన ఉద్యోగం తన కుటుంబానికి ఎంత అవసరమో జాహ్నవికి తెలుసు. అందుకని మౌనంగానే ఈ బాధని సహిస్తోంది.

ఇంటికెళ్లి ఫ్రెష్‌ అయ్యి తల్లి ఇచ్చిన కాఫీ తాగి కొంచెం రిలాక్స్‌ అయ్యాక తల్లికి కూరలు తరిగి ఇవ్వడం లాంటి చిన్న చిన్న పనుల్లో సహాయం చేస్తుంది జాహ్నవి. అన్నం తిన్నాక అమ్మానాన్నతో కాసేపు మాట్లాడి పడుకుంటుంది.

మర్నాడు లైబ్రరీకి వెళ్లాకా ఒక పది నిమిషాలకి పురుషుల విభాగంలో చిన్న అలజడి వినబడింది. ఎవరో పెద్దాయన వినోద్‌ని ఏదో అడుగుతున్నాడు.

వినోద్‌ ఎదో అంటున్నాడు.

పెద్దాయన ‘ప్లీజ్‌ ప్లీజ్‌’ అంటున్నాడు.

చివరికి ఆ పెద్దాయన గట్టిగా ‘నీమీద కంప్లైంట్‌ ఇస్తాను’ అంటున్నాడు. జనం మూగారు. ఈలోపులో జాహ్నవి వాష్‌రూమ్‌కి వెళ్లింది. బయటకి వచ్చేటప్పటికి సరిగ్గా ఆ పెద్దాయన ఎంట్రన్స్‌ నుండి బయటకు వెళ్లబోతున్నాడు విసురుగా.

జాహ్నవికి ఎందుకు అనిపించిందో... ‘సార్‌ సార్‌’ అని పిలిచింది.

ఆయన ఆగాడు. దగ్గరికి వెళ్లి ‘‘సార్‌ నేను లేడీస్‌కి సంబంధించిన వింగ్‌లో పని చేస్తున్నాను. మీకు నేనేమైనా హెల్ప్‌ చేయగలనా’’ అని అడిగింది.

ఆయన తన కళ్లజోడులోంచి తేరిపార చూసి, ‘‘చేయగలిగితే చేస్తారా’’ అని అడిగాడు.

‘‘మీరు చెప్పండి. ఈ లైబ్రరీకి సంబంధించినది అయితే తప్పకుండా చేస్తాను’’ అంది.

‘‘అయితే నాకు పదమూడేళ్ల క్రితం ఒక న్యూస్‌ పేపర్‌లోని ఒక ప్రకటన కావాలి. తారీఖు 20 ఫిబ్రవరి 2008. అది నాకు చాలా చాలా అవసరం. అతను వెతికి ఇవ్వలేడట. ‘అన్నీ దుమ్ము కొట్టుకుపోయి ఎక్కడో ఉన్నాయి. నాకు తెలీదు, పైగా డస్ట్‌ పడదు. కావాలంటే ఎవరికైనా కంప్లైంట్‌ చేసుకోండి’ అంటున్నాడు. నాకు అది చాలా అవసరం. నేను దాని గురించి యూ.ఎస్‌ నుండి వచ్చాను. ఇంటికెళ్లి ఏమి చెయ్యాలో ఆలోచిద్దాం అనుకుంటున్నాను’’ అన్నాడు జాహ్నవిని చూస్తూ.

‘‘మీరిక్కడే ఉండండి సార్‌’’ అని చెప్పి లోపలికి వెళ్లి యాదమ్మని తీసుకుని చేతిలో తాళం చెవుల గుత్తితో వచ్చింది జాహ్నవి. ‘‘రండి సార్‌’’ అని ఆయనని పిలిచి రెండంతస్తులు ఎక్కి మేడమీదికి తీసుకెళ్లింది.  యాదమ్మ ఒక రూమ్‌ తలుపు తాళం తీసింది. అంతా చీకటిగా ఉంది. లోపలికి వెళ్లి లైట్‌ ఆన్‌ చేస్తే వెలగలేదు. కిటికీ తలుపు తీసింది అప్పుడు వెలుగు వచ్చింది. అక్కడ ర్యాక్స్‌ నిండా పాత వార్తా పత్రికలు ఉన్నాయి. నిజంగానే దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి.

ఆయన చూస్తూ ‘‘అయ్యో చాలా కష్టమేనమ్మా. కానీ నాకు చాలా అవసరం. నేను వెతుకుతానమ్మా మీరు అక్కడ కూర్చోండి’’ అన్నాడు. జాహ్నవి ‘‘ఫర్లేదులెండి’’ అంటూ చున్నీతో ముక్కుకి అడ్డుగా కట్టుకుంది. యాదమ్మ చీరకొంగు అడ్డు పెట్టుకుంది. ర్యాక్‌లకి ఏ సంవత్సరం పేపర్లో చిన్న కాగితం మీద రాసి అతికించి ఉంది. తెలుగు పేపర్‌ పేరు చెప్పడంతో ఆ సంవత్సరం పేపర్‌ కట్టలని మొదట వెతికితే ఒక ఇరవై నిమిషాల తరువాత దొరికాయి. మళ్లీ అందులో ఫిబ్రవరి నెలకోసం ఇంకో ఇరవై నిమిషాలు వెతికారు. ఆ నెల వార్తా పత్రికలను ఆయన టేబుల్‌ మీద పెట్టి వెతుకుతుంటే జాహ్నవి సహాయం చేసింది. మొత్తానికి 20వ తారీఖు పేపర్‌ దొరికింది. ఆయన సంతోషంగా ఆ పేపర్‌ తీసి కళ్లజోడు సవరించుకుని అన్ని పేజీలూ తిప్పి చూశారు. ఆయనకి కావలసింది దొరకగానే సంతోషంగా ఫోన్‌ తీసి తనకి కావలసిన విషయాన్ని ఫొటో తీసుకున్నాడు. తరవాత పేపర్లు మూసేసి, ‘‘అమ్మా అన్ని పేపర్సూ నేనే పెట్టేస్తాను ర్యాక్‌లో. ఈ ఒక్క పేపర్‌ ఈ కట్టపైన పెడతాను. మళ్లీ అవసరం వస్తే వాడుకోవడానికి’’ అని, ‘‘చాలా థాంక్స్‌ అమ్మా, నువ్వు చేసిన ఈ సహాయం నాకు ఎంతో విలువైనది’’ అంటూ జేబులోంచి 500 రూపాయలు తీసి ఇవ్వబోతే జాహ్నవి పక్కకి తప్పుకుని ‘‘తనకి ఇవ్వండి ఇస్తే’’ అంది యాదమ్మని చూపిస్తూ.

ఆయన యాదమ్మకి ఇచ్చి ‘‘ఇంట్లో పిల్లలకి ఏదైనా కొని తీసుకెళ్లమ్మా ఇది నేను సంతోషంగా ఇస్తున్నాను’’ అన్నాడు. యాదమ్మ భయంగా జాహ్నవిని చూసింది. జాహ్నవి ‘తీసుకో’ అని కళ్లతో చెప్తే తీసుకుని నమస్కారం పెట్టింది ఆయనకి.

యాదమ్మ మళ్లీ రూమ్‌కి తాళం వేయగా ముగ్గురూ కిందకి వచ్చారు. ఆయన వెళ్లబోతూ ‘‘చాలా థ్యాంక్స్‌ అమ్మా. నీలాగా ఓపికతో సహాయం చేసేవాళ్లు ఇంకా ఉన్నారు. గాడ్‌ బ్లెస్‌ యూ’’ అని జాహ్నవి తలమీద చెయ్యి వేసి వెళ్లిపోయాడు.
జాహ్నవీ యాదమ్మా వాష్‌రూమ్‌కి వెళ్లి చేతులు బాగా కడుక్కుని తమ సీట్లకి వెళ్లారు.
ఇది జరిగిన ఓ నెల రోజులకి జాహ్నవి లైబ్రరీకి వచ్చేశాక జాహ్నవి ఇంటికి ఒక కారు వచ్చి ఆగింది. కారులోంచి ఒకాయన దిగి గేటు తీసుకుని సందేహంగా ఇంట్లోకి వెళ్లారు.
వసారాలో పడక కుర్చీలో కూర్చుని పేపర్‌ చదువుతున్న సోమశేఖరంగారు అలికిడి విని పేపర్‌ తీసి లేచి నిలబడ్డారు. వచ్చినాయన ‘‘నమస్తే అండీ, నా పేరు శంకర నారాయణ. మీతో మాట్లాడొచ్చా’’ అన్నారు. వెంటనే సోమశేఖరంగారు ‘‘అయ్యో రండి రండి’’ అని అక్కడున్న కుర్చీని చూపించి కూర్చోమన్నారు.

ఆయన కూర్చుని ఇచ్చిన మంచినీళ్లు తాగి... ‘‘నేను యూ.ఎస్‌ నుండి వచ్చాను. చాలా వ్యాపారాలు ఉన్నాయి. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి పెళ్లి అయ్యి యూ.ఎస్‌లోనే స్థిరపడింది. నేను పిల్లల చిన్నప్పుడే వెళ్లాను అక్కడికి. అక్కడ గ్రీన్‌ కార్డు కూడా ఉంది. ఇక్కడ నేను పదమూడేళ్ల క్రితం కొండాపూర్‌లో ఒక అయిదువందల గజాల స్థలం కొన్నాను. అప్పటికి అక్కడ కొండలూ గుట్టలూ ఉండేవి. అప్పట్లో ఇరవై అయిదు లక్షలకు కొన్నాను. నాకు ఇక్కడ కూడా వ్యాపారాలు ఉన్నాయి. మా ఆవిడ ఇక్కడికి వచ్చేద్దామని అంది. నాక్కూడా వచ్చేయాలనిపించింది. మా అబ్బాయి కూడా సరే అన్నాడు. ఇక్కడ ఫ్లాట్స్‌ ఉన్నా మా అభిరుచికి తగ్గట్టు ఇల్లు కట్టుకుందామని మా ప్లాట్‌లో ఇల్లు మొదలుపెట్టాం.

ఇంతలో ఇంకెవరో వచ్చి అది తను కొన్నానని పేపర్స్‌ చూపించాడు. ఇప్పుడు అక్కడ స్థలం కోట్లలో ఉంది. నేను కొన్నప్పుడు అగ్రిమెంట్‌ చేసిన లాయర్‌ ఇప్పుడు లేరు. కొత్త లాయర్‌ దగ్గరికి వెళ్తే ‘అప్పట్లో పేపర్‌లో ఫలానా స్థలం ఫలానా వ్యక్తి కొంటున్నట్టు ప్రకటించిన ప్రకటన ఉంటే మీరే ముందు కొన్నట్టు ప్రూఫ్‌ ఉంటుంది. ముందు ఎవరు కొన్నారు అన్నది కావాలి’ అని చెప్పాడు.

పదమూడేళ్ల నాటి పేపర్‌ ఎక్కడ దొరుకుతుంది! ఎవరో సలహా ఇస్తే మీ అమ్మాయి పనిచేసే లైబ్రరీకి వెళ్లాను. నిరాశతో వెనక్కి వస్తున్న నాకు అదృష్టవశాత్తూ మీ అమ్మాయి సహాయం చేసింది. నేను ఆ స్థలం కొంటున్నాననీ అభ్యంతరం ఉన్నవాళ్లు చెప్పమనీ ఇచ్చిన ఆ ప్రకటన దొరికింది. ఆ ప్రూఫ్‌ వలన నా స్థలం నాకు వచ్చింది.

మీ అమ్మాయి చేసిన సహాయం చాలా విలువైనది. మీ అమ్మాయికి అక్కడే కృతజ్ఞతలు చెప్పాను. కానీ ఇంత వివరంగా మాట్లాడలేను కదా ఇంటికొచ్చి చెప్దామని వచ్చా. అమ్మాయి ఇంట్లో ఉండదని తెలుసు అందుకే తీరిక చేసుకుని మీ ఇంటి అడ్రస్‌ తెలుసుకుని వచ్చాను. ‘‘నిజంగా ఎంత ఓపిక ఉన్న అమ్మాయండీ... ఎంత సంస్కారవంతంగా పెంచారు’’ అన్నారు చేతులు జోడించి.

‘‘అయ్యో... తన పనే అది కదా, భలేవారే మీరు’’ అన్నారు సోమశేఖరంగారు.

‘‘పోతే ముఖ్యంగా మీకో విషయం చెప్పాలని వచ్చాను. ఏంటంటే- మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని మా కోడలిగా చేసుకోవాలని మా కోరిక. మా ఇంట్లో కూడా చెప్పాను. మా అబ్బాయి నేను చెప్పాక ఆ లైబ్రరీకి వెళ్లి మీ అమ్మాయికి తెలియకుండా రెండు మూడు సార్లు చూశాడు. మా అబ్బాయికూడా ఇష్టపడ్డాడు. మా ఆవిడకి నేను ఎంత చెప్తే అంత. మీరు మీ అమ్మాయితో కూడా చెప్పి తనకి కూడా ఇష్టమయితేనే ముందుకు వెళదాం. లేకపోతే ఇంతటితో వదిలేద్దాం. మీరు ఆలోచించుకుని చెప్తే మా ఆవిడనీ అబ్బాయినీ తీసుకుని వస్తాను’’ అన్నారు.

‘‘మాది మధ్య తరగతి కుటుంబం. ఈ ఇల్లు తప్ప నాకంటూ ఏమీ ఆస్తి లేదు. మిగిలిన ఇద్దరు పిల్లలూ చిన్నవాళ్లు. మేము మీ స్థోమతకి తగిన వాళ్లం కాదు. ఒక రెండేళ్లలో మాకు తగిన సంబంధం చూసి అమ్మాయికి పెళ్లి చేద్దామని ఉంది’’ అని సోమశేఖరంగారు సందేహంగా అంటుండగానే శంకర నారాయణగారు అందుకుని, ‘‘స్థోమత, అంతస్తు మాకు ప్రధానం కాదు. బాధ్యతగా ప్రేమగా ఉండే సంస్కారవంతమైన అమ్మాయి కావాలి మాకు. మా దగ్గర మాకు సరిపడా ఉంది. మాకు వేరేవాళ్ల దగ్గరనుండి డబ్బు ఆశించే అవసరం లేదు.

ఎందుకో మీ అమ్మాయి చేతుల్లో మా కుటుంబాన్ని పెట్టాలని ఉంది. మీ గురించీ, మీ భవిష్యత్తు గురించీ ఆందోళన వద్దు. మీ అమ్మాయి మా కోడలయితే లాభపడేది మేము. అయితే మీకు వంద శాతం స్వేచ్ఛ ఉంటుంది ఈ విషయంలో. మీరు ‘నో’ చెప్పినా మేము ఏమీ అనుకోము. మీకు ఎలాంటి ఇబ్బందీ కలిగించమని హామీ ఇస్తున్నాను. కానీ మీ నుండి ఆశాజనకమైన సమాధానం రావాలని నా ఆశ. ఇదిగో నా కార్డ్‌’’ అని, తన విజిటింగ్‌ కార్డ్‌ ఇచ్చి వెళ్లిపోయారాయన.

సోమశేఖరంగారు చాలాసేపు ఒకలాంటి షాక్‌లో నిశ్శబ్దంగా ఉండిపోయారు. కలో నిజమో అర్థంకాని పరిస్థితి. ఒప్పుకుంట తప్పు నిర్ణయమా... కాదంటే తప్పు నిర్ణయమా... అన్న డోలాయమాన పరిస్థితి. తన కూతురు చేసిన ఒక చిన్న పనికి, ఇంతటి ప్రతిఫలం ఇచ్చాడా దేవుడు అని ఆశ్చర్యపడిపోయారు ఆయన.

విషయం విని తెల్లబోయింది జాహ్నవి. తను ఆ సంఘటన చాలా మామూలుగా తీసుకుని ఎప్పుడో మరిచిపోయింది. కానీ ఇలా మళ్లీ తన ముందుకు రావడం ఆశ్చర్యంగా ఉంది.
సోమశేఖరంగారు ఒక్కటే చెప్పారు... ‘‘నీ ఇష్టమమ్మా. నీకు ఇష్టమయితేనే ఇది జరుగుతుంది. నీ జీవితం ఇది. మేము ఏమాటా ఇవ్వలేదు. నువ్వు ఆలోచించుకుని చెప్పు’’ అన్నారు.
జాహ్నవి ‘‘నాన్నా, నేను నిర్ణయం తీసుకునే ముందు అతనితో ఒకసారి మాట్లాడాలి. నాకు చాలా సందేహాలు ఉన్నాయి. మాట్లాడాక గానీ నేను ఏ విషయం చెప్పలేను’’ అంది.
‘‘అలాగే అమ్మా, వాళ్ల ముగ్గురినీ మనింటికి రమ్మనమందాం వచ్చే శనివారం. ఆరోజు నీకు సెలవు కదా. నువ్వు ఆ రోజు అతనితో మాట్లాడు. నీకు నచ్చితేనే మనం ఓకే అందాం

నాకెందుకో తండ్రి మాటకి గౌరవం ఇచ్చి నీకు తెలియకుండా చూసి ఒప్పుకున్నాడంటే, అతను మంచి అబ్బాయేమో అనిపిస్తోంది’’ అన్నారు.

‘‘సరే నాన్నా, మీ ఇష్టం’’ అంది జాహ్నవి.

సోమశేఖరంగారు శంకర నారాయణగారికి ఫోన్‌ చేసి చెప్పారు. ఆయన ఆ మాటకే ఉబ్బితబ్బిబ్బయిపోయారు.

శనివారం సాయంత్రం శంకర నారాయణగారు కొడుకూ, భార్యతో జాహ్నవి ఇంటికి వచ్చారు. కొడుకు శివచరణ్‌ని అందరికీ పరిచయం చేశారు. శంకర నారాయణగారి భార్య జాహ్నవిని చూసి కొడుకు పక్కన జాహ్నవి చాలా బాగుంటుందని మనసులో మురిసిపోయింది. ప్రేమతో భుజంమీద చేయివేసి దగ్గరికి తీసుకుంది. కొద్దిసేపటి తరువాత, వాళ్లిద్దరినీ బయటకు వెళ్లి మాట్లాడుకోమన్నారు.

‘‘అవసరం లేదు, మేమిద్దరం ఎప్పుడో మాట్లాడేసుకున్నాం’’ అన్నాడు శివచరణ్‌ నవ్వుతూ.

ఈసారి అందరూ నోళ్లు వెళ్లబెట్టారు ఆశ్చర్యంతో... సోమశేఖరంగారు ‘అవునా’ అన్నట్లు కూతురువైపు చూశారు. కూతురు అవునన్నట్లు నవ్వుతూ తల ఊపింది.

‘‘మూడు రోజుల క్రితం జాహ్నవి లైబ్రరీలో ఉండగా ల్యాండ్‌లైన్‌కి ఫోన్‌ చేసి మాట్లాడాడు శివచరణ్‌. తనెవరో చెప్పి సాయత్రం పర్సనల్‌గా కలవాలని ఉందన్నాడు.
జాహ్నవి సరేనంది.

సాయంత్రం జాహ్నవి బయటకి వచ్చే టైమ్‌కి బయట వెయిట్‌ చేసి, తన కార్‌లో ఎక్కించుకుని ‘‘కాఫీ డే’’ కి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక తన గురించి అంతా చెప్పాడు. జాహ్నవి సందేహాలని అడగమన్నాడు.
జాహ్నవి తన కుటుంబ పరిస్థితీ, తన బాధ్యతలూ అన్నీ వివరంగా చెప్పింది. ఈ పరిస్థితుల్లో తను పెళ్లి చేసుకుని తన తల్లిదండ్రులనీ, తమ్ముడినీ చెల్లెల్నీ అలా వదిలేయలేనంది.

దానికి శివ ఒకటే చెప్పాడు. ‘‘చూడండీ... నేను శాశ్వతంగా ఇండియాలో ఉండిపోదామనే వచ్చాను. అమ్మానాన్నగారి కోరిక కూడా అదే. ఇక మీ బాధ్యతలంటారా... వాటికి నేనెప్పుడూ అడ్డురాను సరికదా నాకు వీలైన సాయం నేనూ చేస్తాను. మీ స్వాభిమానాన్ని గౌరవిస్తాను అని మీకు ప్రామిస్‌ చేస్తున్నాను. మీరు నాకు నచ్చారు. మీరు మీ పేరెంట్స్‌నే కాదు మమ్మల్నీ చూసుకోవాలి. మా కుటుంబ బాధ్యత కూడా మీ చేతుల్లో ఉంది. మీకు ఇష్టమైతేనే నేను మా అమ్మా నాన్నతో మీ ఇంటికి వస్తాను. లేకపోతే ఇక్కడి నుండే స్నేహంగా విడిపోదాం’’ అన్నాడు.

జాహ్నవి అతను మాట్లాడే విధానానికి ముగ్ధురాలయ్యింది. అతని మీద విశ్వాసం కూడా కలిగింది. జాహ్నవి అంగీకారం అప్పుడే ఆమె మొహంలో తెలిసిపోయింది శివాకి.

ఇద్దరికీ మంచి కాఫీ ఆర్డర్‌ ఇచ్చి తాగాక, జాహ్నవి బస్‌ ఎక్కేవరకూ ఉండి వెళ్లిపోయాడు శివచరణ్‌.

‘‘జాహ్నవి అంగీకారంతోనే మీ ఇంటికి వచ్చాం ఇప్పుడు’’ అన్నాడు శివ నవ్వుతూ...

‘‘ఇకనేం... శుభం’’ అన్నారు శంకర నారాయణగారు నవ్వుతూ...

సోమశేఖరంగారి మొహంలో కూడా ఆనందం వెల్లివిరిసింది.


మరిన్ని

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.