కనువిందు కరవైన సినిమా క్యాలెండర్‌ - 2020 with out Big Hero movies
close
Published : 23/12/2020 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కనువిందు కరవైన సినిమా క్యాలెండర్‌

స్టార్‌ హీరోల సినిమాల్లేకుండానే ముగియనున్న ‘2020’

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెగాస్టార్‌ స్టెప్పెయ్యలేదు.. నటసింహం తొడకొట్టలేదు.. పవర్‌స్టార్‌.. మెగా పవర్‌స్టార్‌.. యంగ్‌ రెబల్‌స్టార్‌.. యంగ్‌ టైగర్‌.. ఇలా స్టార్‌ హీరోల మెరుపులు కనిపించలేదు. అభిమానుల అరుపులు అసలే వినిపించలేదు. అన్నింటికీ కారణం ఒకటే ‘కరోనా’. ఆయుధం లేకుండా సైనికుడు యుద్ధానికి వెళ్లినట్లు మారింది ‘2020’లో తెలుగు సినిమా పరిస్థితి. విడుదలైన వాటిల్లో ఒకటీ రెండు సినిమాలు మంచి విజయాలు సాధించాయి. కానీ.. ఏడాదికి దాదాపు 250కి పైగా కొత్త సినిమాలతో అలరించే టాలీవుడ్‌కు కచ్చితంగా ఇది ఓ చేదు సంవత్సరమే. అసలు ఒక ఏడాదిలో ఇంతమంది స్టార్‌ హీరోల సినిమాలు లేకుండా ఉండటం ముందెన్నడూ చూడలేదు. ఒక సినిమా సెట్స్‌లో ఉండగానే ఇంకో సినిమా ప్రకటించే స్టార్‌ హీరోల సినిమాలు లేకుండా అభిమానులను నిరాశకు గురి చేసిందీ సంవత్సరం. ప్రస్తుతం మన పెద్ద హీరోలంతా సినిమాలు చేస్తున్నారు. అవన్నీ షూటింగ్‌ దశలో ఉన్నాయి. అయితే.. కరోనా కానీ రాకుండా ఉండి ఉంటే.. అందులో చాలా సినిమాలు మనముందుకు వచ్చేవి.

మెగాస్టార్‌కు టైమ్‌ గ్యాప్‌..

‘జస్ట్‌ టైమ్‌ గ్యాపంతే.. టైమింగ్‌లో గ్యాప్‌ ఉండదు’ అని చెప్పిన మెగాస్టార్‌కూ టైమ్‌ గ్యాప్‌ తప్పలేదు. ఒకానొక సమయంలో ఏడాదికి అరడజనుకుపైగా సినిమాలతో ప్రేక్షకులతో అలరించిన చిరంజీవి నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా రాలేదు. 1978లో సినిమాల్లోకి వచ్చిన ఈ ‘గ్యాంగ్‌లీడర్‌’ 2008 ఆగస్టులో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. అలా సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చారు. 2007లో వచ్చిన ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ తరువాత చాలాకాలం విరామం తీసుకున్నారు. ‘బ్రూస్‌లీ’లో ప్రత్యేక పాత్రలో కనిపించినా  2019లో వచ్చిన ‘సైరా’లోనే హీరోగా ఆయన మళ్లీ తెరపై కనిపించారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ‘ఆచార్య’లో నటిస్తున్నారు. 2021 వేసవిలో అభిమానుల ముందుకు ఈ సినిమా రానుంది. ఇలా ఈ ఏడాది చిరు సినిమా అభిమానుల ముందుకు రాలేదు.

సంక్రాంతి బరిలో దిగని బాలయ్యబాబు

ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా లేకపోతే ఎలా..? ఆ సంవత్సరంలో మరెన్ని సినిమాలు వచ్చినా అభిమానులకు మాత్రం ఏదో వెలితిగానే ఉంటుంది. అందుకే బాలయ్యబాబు సినిమాలు లేని క్యాలెండర్‌ను ఊహించుకోవడం కొంచెం కష్టమే. మరి అలాంటి పరిస్థితి ఎన్నిసార్లు ఎదురైందో తెలుసా..? 1974లో మొదలైన బాలయ్యబాబు సినీ ప్రయాణంలో ఐదు సార్లు మాత్రమే ఆయన సినిమా లేకుండా ఏడాది ముగిసింది. 1976, 78, 81, 2013, 2020ల్లో బాలకృష్ణ నుంచి సినిమాలు రాలేదు. ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో ‘బీబీ3’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దానికి ఇంకా టైటిల్‌ ఖరారు చేయాల్సి ఉంది. వీళ్లిద్దరి మధ్య వస్తున్న మూడో చిత్రం ఇది. ఈ సినిమాలో బాలయ్యను అఘోరా పాత్రలో చూపించబోతున్నారు. దీంతో ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి పెరిగింది.

రావాల్సి ఉన్నా రాలేకపోయిన నాగ్‌

సంవత్సరానికొక సినిమా అయినా విడుదల చేసే యువ సామ్రాట్‌ నాగార్జున నుంచి ఈఏడాది పలకరింపు కూడా కరవైంది. నాగార్జున నటిస్తున్న బాలీవుడ్‌ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ 2020 డిసెంబర్‌ 4 విడుదల కావాల్సింది ఉంది. కానీ.. కరోనా వల్ల అది వాయిదా పడింది. రూ.300కోట్లతో యాక్షన్‌ ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ నటిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా అలరించనుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌లో సినిమా విడుదల చేస్తామని ప్రకటించినా.. అది ఎంతవరకు సాధ్యమవుతుందో వేచి చూడాల్సిందే. కింగ్‌ నాగార్జున  ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమా కూడా ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత తమిళ స్టార్‌ హీరో దనుష్‌తో కలిసి మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. 1986లో హీరోగా కెరీర్‌ ప్రారంభించిన నాగార్జున.. 2009, 2015 మాత్రమే అభిమానులను అలరించలేకపోయారు. తాజాగా కరోనా వల్ల 2020 ఆయనను వెండితెరకు దూరంగా ఉంచింది.

గేరు మార్చినా గ్యాప్‌ తప్పలేదు

ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేశ్‌ గేర్‌ మార్చి మల్టీస్టారర్‌గా అవతారమెత్తారు. హీరో ఓరియెంటెడ్‌ సినిమాలు.. మల్టీస్టారర్లతో ‘మూడు పువ్వులు.. ఆరు కాయలుగా’ సాగిపోతున్నారాయన. ఎఫ్‌2, వెంకీమామలాంటి మల్టీస్టారర్‌ల తర్వాత ఆయన చేస్తున్న సినిమా ‘నారప్ప’. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. తమిళ చిత్రం ‘అసురన్‌’కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రం కార్మికుల దినోత్సవం సందర్భంగా 2020 మే1న విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కరోనా వల్ల అది సాధ్యం కాలేదు. 1986లో హీరోగా తెరంగేట్రం చేసిన వెంకటేశ్‌ కెరీర్‌లో 2011, 2018.. 2020ల్లో కేవలం మూడు సార్లు మాత్రమే సినిమాలు రాలేదు.

పవర్‌స్టార్‌.. ముచ్చటగా మూడేళ్లు

వపర్‌స్టార్‌ వెండితెరపై కనిపించి మూడేళ్లు దాటిందంటే నమ్మగలరా. అవును.. చివరగా ఆయన నటించిన ‘అజ్ఞాతవాసి’ 2018 జనవరిలో విడుదలైంది. అయితే.. ఆ తర్వాత మరో సినిమా రాలేదు. పవన్‌ ప్రస్తుతం ‘వకీల్‌సాబ్‌’లో నటిస్తున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. 1996లో ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ సినిమాతో పరిచయమై పవర్‌స్టార్‌గా ఎదిగిన పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో సినిమాల్లేని సంవత్సరాలు చాలా తక్కువ. కాగా.. 2002, 09, 14, 19, 2020ల్లో పవర్‌స్టార్‌ సినిమాల్లేకుండానే క్యాలండర్‌ మార్చాల్సి వచ్చింది.

పాన్‌ ఇండియా స్టార్‌దీ అదే పరిస్థితి

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ టాలీవుడ్‌ బార్డర్లు దాటిపోయి పాన్‌ ఇండియా స్థాయికి చేరుకున్నారు. కాస్త ఆలస్యంగానైనా గట్టి పంచ్ ఇస్తారు. బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టు తర్వాత ఏడాదికో సినిమా తీయాల్సిందేనని నిర్ణయించుకున్న ప్రభాస్‌కు నిరాశే ఎదురైంది. తన కెరీర్‌లో బాహుబలి సినిమా సమయంలో ఒక ఏడాది, సాహో సినిమా కోసం మరో ఏడాది సినిమాల్లేకుండానే కానిచ్చేశాడు. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో రాధేశ్యామ్‌, ఆది పురుష్‌, సలార్‌ ఉన్నాయి. అందులో ‘ఆది పురుష్‌’ 2022 ఆగస్టు 11న విడుదల చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. రాధేశ్యామ్‌ 2021 అక్టోబర్‌ 23న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ గత చిత్రం సాహో విడుదలైన దాదాపు 26నెలల తర్వాత మరో సినిమా రాబోతుంది. అంటే ప్రభాస్‌ అభిమానులకు రెండేళ్ల ఎదురుచూపులు తప్పవన్నమాట. 2002లో ఈశ్వర్‌ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్‌ నుంచి సినిమాలు లేని సంవత్సరాలు: 2014, 16, 18, 2020.

చిట్టిబాబును అడ్డుకుంది
తమ అభిమాన హీరో సినిమా కాస్త ఆలస్యమవుతుందన్న వార్త వస్తేనే.. ‘అరెరె.. మిగతా హీరోలంతా దూసుకెళుతున్నారే’ అని సగటు అభిమాని ఆవేదనకు గురవుతారు కదా..! ‘రంగస్థలం’ భారీ విజయం సాధించడంతో మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌ స్థాయి మరో రేంజ్‌కు చేరుకుంది. చెర్రీ సినిమాలపై అంచనాలూ భారీగా పెరిగాయి. ‘వినయ విధేయ రామ’ ఆశించిన మేర రాణించకపోవడంతో తర్వాతి సినిమాతో అయినా అదృష్టాన్ని పరీక్షించుకుందామంటే.. కరోనా ఒకటి వచ్చి పడింది. 2007లో ‘చిరుత’గా పరిచయమైన చరణ్‌.. ‘మగధీర’ విజయంతో టాలీవుడ్‌లో అగ్రశ్రేణి కథానాయకుల్లో ఒకరిగా మారారు. ఇప్పుడు మరోసారి జక్కన సారథ్యంలో సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. చరణ్‌ నుంచి సినిమాలకు నోచుకోని సంవత్సరాలు 2008, 11, 17, 20. 

ఎన్టీఆర్‌‌.. ఇలా మూడుసార్లు..
ఒక ఏడాదిలో సినిమా ఇవ్వకుండానే వెళ్లిపోవడం ఎన్టీఆర్‌కు ఇది మూడోసారి. గతంలో రెండుసార్లు వేర్వేరు కారణాల వల్ల సినిమా చేయలేకపోయిన యంగ్‌ యముడు.. ఈసారి కరోనా లాక్‌డౌన్‌ వల్ల మూడోసారి వెండితెరపై చిందేయలేకపోయారు. 2001లో ‘నిన్ను చూడాలని’తో హీరోగా పరిచయమయ్యారు తారక్‌. స్టూడెంట్‌ నెం.1, సింహాద్రి, యమదొంగ సినిమాల తర్వాత నాలుగోసారి జక్కతో కలిసి మరో సినిమా చేస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. 2018లో ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత ఎన్టీఆర్‌ నుంచి మరో సినిమా రాలేదు. తారక్‌ నుంచి సినిమాల్లేని సంవత్సరాలు..(2009, , 19, 2020). ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తారక్‌ నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఈ ఏడాది జులై 30 విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే.. కరోనా వల్ల చిత్రీకరణకు అడ్డుకట్ట పడటంతో విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇంకా చాలా మంది హీరోలు ఈ ఏడాది కరోనా మహమ్మారి వల్ల అభిమానులను అలరించలేకపోయారు. సినిమా థియేటర్లు తెరచుకోకపోవడంతో వచ్చే ఏడాది వరకూ ఎదురుచూడక తప్పేలా లేదు. మరి.. ప్రతి ఏడాది సంక్రాంతి బరిలోకి దూకే స్టార్‌ హీరోలు ఈసారి అంత ఆసక్తి చూపించడం లేదు. చిత్రీకరణలు మొత్తం అనుకున్న సమయానికి పూర్తయితే వచ్చే ఏడాది తెలుగు సినిమా ప్రేక్షకుల దాహం తీరే అవకాశం ఉంది.

ఇదీ చదవండి..  అలాంటి వాడు ఇంకా తారసపడలేదు: నభానటేశ్మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని