నిలిపిన వాహనాలు... గాలిలో ప్రాణాలు!

అంతకంతకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన భారీ వాహనాలతో దుర్ఘటనలు పెరుగుతున్నాయి. రహదారుల వెంబడి నిరంతర పర్యవేక్షణ, పటిష్ఠమైన నిఘాతో పాటు వాహన చోదకులకు అవగాహన కల్పించడం తక్షణావసరం.

Updated : 03 May 2024 07:14 IST

అంతకంతకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన భారీ వాహనాలతో దుర్ఘటనలు పెరుగుతున్నాయి. రహదారుల వెంబడి నిరంతర పర్యవేక్షణ, పటిష్ఠమైన నిఘాతో పాటు వాహన చోదకులకు అవగాహన కల్పించడం తక్షణావసరం.

దేశంలో దాదాపు అరవై శాతం సరకు రవాణా రోడ్డు మార్గంలోనే జరుగుతోంది. వస్తువులను దేశం నలుమూలలకు వేగంగా, సురక్షితంగా చేరవేయడంలో భారీ ట్రక్కులు, లారీలు, మినీ వ్యాన్లు కీలక భూమిక పోషిస్తున్నాయి. కానీ, ఆయా వాహన చోదకుల ఉదాసీన వైఖరి ఘోర ప్రమాదాలకు దారితీస్తోంది. రద్దీగా ఉండే జాతీయ రహదారుల పక్కన వాహనాలను నిర్లక్ష్యంగా నిలిపి ఉంచడం ఊహించని ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమవుతోంది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తాజా నివేదిక ప్రకారం- రోడ్డుపై నిలిపిన వాహనాల కారణంగా 2021లో 11,611 ప్రమాదాలు జరిగాయి. 2022లో అవి 14,139కి పెరిగాయి. ఆయా దుర్ఘటనల్లో 2021లో 4,925 మంది, 2022లో 6,012 మంది విగతజీవులయ్యారు. గడిచిన దశాబ్ద కాలంలో ఇటువంటి మరణాలు సుమారు 50వేలు ఉండవచ్చని అంచనా.

వాహనాల నిర్లక్ష్య పార్కింగ్‌ కారణంగా తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్‌, బిహార్‌, గుజరాత్‌లతోపాటు పంజాబ్‌, హరియాణాల్లోనూ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. భారీ ట్రక్కులను నడిపేవారి నిర్లక్ష్యంతో జరిగే ప్రమాద మరణాల్లో సగానికి పైగా వాటా- దిల్లీ, ఇందౌర్‌, చెన్నై, బెంగళూరు, భోపాల్‌, జైపుర్‌, హైదరాబాద్‌, కొచ్చి వంటి నగరాలదే. అపసవ్య దిశలో ప్రయాణాలు, రోడ్డు పక్కన వాహన పార్కింగ్‌లే 40శాతం ప్రమాదాలకు కారణమని పలు నివేదికలు తేల్చాయి. అయినప్పటికీ ప్రభుత్వ వర్గాల్లో కనువిప్పు కలగడంలేదు. కొన్ని రాష్ట్రాలు మాత్రం నష్టనివారణ దిశగా అడుగులు వేస్తున్నాయి. బెంగళూరు హైవేలో వరస ప్రమాదాలతో ఆ రాష్ట్ర పోలీసు శాఖ ఇటీవల అప్రమత్తమైంది. గస్తీ బృందాలతో 24 గంటల పర్యవేక్షణ కొనసాగిస్తోంది. నిర్లక్ష్యంగా పార్కింగ్‌ చేసే వాహనాలపై టోల్‌ ఫ్రీ నంబరుకు సమాచారమిచ్చేలా పౌరుల్ని చైతన్యపరుస్తోంది. బిహార్‌లోని ఓ హైవేలో వారం రోజులు ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగింది. ఆ సమయంలో ఏ ఒక్క వాహనం రోడ్డు పక్కన కనిపించకుండా కట్టడి చేయగలిగారు. వాహనదారుల్లో క్రమశిక్షణను పెంపొందించే ఇలాంటి చర్యలు కొన్నాళ్లకే అటకెక్కకుండా చూడాల్సిన బాధ్యత పాలకులు, యంత్రాంగానిదే. రోడ్డు పక్కన నిలిపి ఉంచే వాహనాల చిత్రాల్ని పంపేవారికి బహుమతులివ్వడం వంటి చర్యలు అవసరం.

జాతీయ రహదారులపై వాహన చోదకుల కోసం ప్రతి 50 కి.మీ. దూరంలో ఇరువైపులా నిర్మించిన విశ్రాంతి గదులు నిరుపయోగంగా మారుతున్నాయి. నిర్వహణపై అశ్రద్ధ, కనీస సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం. దొంగల భయం కూడా ఎక్కువ. వ్యక్తిగతంగా, వస్తువులకు భద్రత శూన్యం. ఇలాంటి సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, ఇతర విభాగాలపై ఉంది. డ్రైవర్లు విశ్రాంతి కోసం రహదారులు, దాబాల పక్కనే వాహనాలు నిలుపుతున్నారు. ఫిట్‌నెస్‌ సరిగాలేని లారీలు, ట్రక్కులు, కంటెయినర్లు నడిరోడ్డుపైనే మొరాయిస్తున్నాయి. అలా నిలిచి పోయినప్పుడు ఇండికేటర్లు, రేడియం స్టిక్కర్లు, తాత్కాలిక బారికేడ్లతో హెచ్చరించే ప్రయత్నం కూడా చేయడంలేదు. దాంతో వెనక నుంచి వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహన చోదకుల్లో అవగాహన పెంచడం, పటిష్ఠ రోడ్డు భద్రతా చర్యలతో ప్రమాదాలను నిలువరించడం సాధ్యమవుతుంది. పబ్లిక్‌ ప్రదేశాలు, మార్కెట్లు, రోడ్డు క్రాసింగ్‌లు, మలుపులు, ఎత్తయిన ప్రదేశాలు, వంతెనలు, కాలిబాటలు, పార్కింగ్‌ ఆంక్షలున్న చోట వాహనాలు నిలుపకుండా అవగాహన పెంపొందించాలి. ముఖ్యమైన మార్గాల్లో ఎల్‌ఈడీ దీపాలు అమర్చాలి. వాహనాలను పక్కకు తొలగించే క్రేన్లు, ఆధునిక యంత్రాలను గస్తీ బృందాలకు సమకూర్చాలి. సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక వ్యవస్థలతో పర్యవేక్షణ వ్యవస్థను పటిష్ఠ పరచాలి. వాహన సామర్థ్య పత్రాలు, లైసెన్సులు మంజూరు చేసే సమయంలో డ్రైవర్ల చోదక నైపుణ్యాలను రవాణా శాఖ పరీక్షించాలి. నిబంధనల్ని ఉల్లంఘించేవారి దూకుడుకు పోలీసు, రవాణా, హైవే శాఖల సమన్వయంతో అడ్డుకట్ట వేయాలి. అంతర్జాతీయ స్థాయి విధానాలు, సాంకేతిక వ్యవస్థతో ప్రభుత్వాలు రహదారి భద్రతకు ప్రాధాన్యమిస్తేనే సురక్షిత ప్రయాణం సుసాధ్యమవుతుంది.

ఎం.గోపయ్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.