ప్రేమలో పడనని చెప్పలేను
close
Published : 24/02/2020 11:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేమలో పడనని చెప్పలేను

పూజా హెగ్డే అందం చూస్తే కళ్లు తిప్పుకోలేం. ఆమె అభినయానికి ఎక్కడా వంక పెట్టలేం. ఆమె మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయి. ఆమె కళ్లు వేల భావాల్ని పలికిస్తాయి. ఆ హావభావాలు పాత్రలకే కొత్త వన్నెని తీసుకొస్తాయి. అందుకే పూజ కటౌట్‌ బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా సూపర్‌హిట్టు. ఈ బుట్టబొమ్మ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో కుర్రాళ్ల హృదయాల్ని కొల్లగొట్టింది. ప్రస్తుతం ప్రభాస్‌, అఖిల్‌లతో కలిసి ఆడిపాడుతోంది. మరోపక్క బాలీవుడ్‌లోనూ అగ్ర కథానాయకుల సరసన అవకాశాల్ని అందుకొంటోంది. ఈ సందర్భంగా  ‘హాయ్‌’తో చెప్పిన ముచ్చట్లివీ...
* ‘గెలిస్తే అయిపోయినట్టు కాద’ని మీ వాట్సాప్‌ డీపీలో రాసుకున్నారట..  గెలుపుపై మీ అభిప్రాయమేమిటి?
ఏం జరిగినా సరే... విజయం నాదే అనే నమ్మకంతో ఉండటం నాకు ఇష్టం. అదే నన్ను ముందుకు నడిపించే విషయం. అయితే త్రివిక్రమ్‌ ఓ వేడుకలో చెప్పినట్టు గెలిచాక కూడా అంతా అయిపోయినట్టు కాదు. సాధించాల్సింది మన ముందు ఇంకొకటేదో ఉంటుంది. దానిపై దృష్టి పెట్టాల్సిందే. మన ప్రయాణానికి అలాంటి మాటలు చాలా ప్రేరణనిస్తాయి.
* మీ ఎదుగుదలలో స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులు ఎవరు?
మా అమ్మే. స్వశక్తితో ఎదగడం అమ్మ నుంచే నేర్చుకున్నా. పదిమందితో కలిసిపోవడం, కలుపుకోవడం, వాళ్లతో సంబంధాల్ని నెరపడం అమ్మ లతా హెగ్డే నుంచే నేర్చుకున్నా. మంచి విద్యావంతురాలు అమ్మ.
* ‘అల... వైకుంఠపురములో’ యువ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కనిపించారు. వ్యక్తిగత జీవితంలోనూ వ్యాపార రంగంలో రాణించాలనే ఆలోచనలేమైనా వస్తుంటాయా?
వ్యాపార దక్షత మా రక్తంలోనే ఉంటుంది. మా కుటుంబ సభ్యులు చాలామంది రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. నేను సినిమా రంగంలోకి వచ్చా. ప్రస్తుతం నా వ్యాపారం, నా తపన, నా అభిరుచి... అన్నీ సినిమానే.  
* ఈ రంగంలోకి రావాలనే ఆలోచన చిన్నప్పట్నుంచే ఉందా?
ఒక ప్రణాళిక ప్రకారమే వచ్చానో...  అస్సలు కాదో నాకే అర్థం కావడం లేదు. కొన్నాళ్ల కిందట ఈ ప్రశ్న వేస్తే..? లేదనే చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు సినిమాతో పెనవేసుకున్న నా అనుబంధం అలా చెప్పనీయడం లేదు. నిజానికి మా కుటుంబానికి సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేదు.  అబ్బాయిలాగా కటింగ్‌ చేయించుకుని టామ్‌బాయ్‌లా కనిపించేదాన్ని. స్కూల్‌లో మాత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. ఆటలు ఆడేదాన్ని. అనుకోకుండా ఒకరు చూడటం, అందాల పోటీలవైపు ప్రోత్సహించడంతో గ్లామర్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టా. ఒక నటిగా తెరపై నన్ను నేను చూసుకున్నాక జీవితం మొత్తం ఒకసారి కళ్లముందు తిరిగింది. ఇది కలా నిజమా అనిపించింది. ఇప్పుడు మాత్రం నేను సినిమా కోసమే కదా పుట్టిందనే భావనతో ఉంటా.


ప్రతి రోజునీ ఆస్వాదిస్తా

సోషల్‌ మీడియాని బాగా ఇష్టపడతా. మనసులో ఉన్నది సోషల్‌ మీడియా వేదికగా చెప్పేస్తుంటా. ఖాళీ దొరికినప్పుడు పుస్తకాల్ని చదువుతా. సినిమాల్ని బాగా చూస్తుంటా. ప్రయాణాలంటే బోలెడంత ఇష్టం. అదృష్టవశాత్తూ తరచూ ప్రయాణాలు చేయాల్సిన వృత్తిలోకే వచ్చా కాబట్టి ప్రతి రోజునీ ఆస్వాదిస్తున్నా. అమ్మాయిలకి షాపింగ్‌ అంటే ప్రాణం కదా. నాకూ అంతే. విదేశాలకి వెళ్లినప్పుడు నచ్చినవన్నీ కొనేస్తుంటా.


* నటి కాకపోయుంటే ఏ రంగంలో ఉండేవాళ్లు?
నిజంగా ఎప్పుడూ అలాంటి ఆలోచనలు రాలేదు. అందాల పోటీలతోనే  గ్లామర్‌ రంగంలోకి అడుగుపెట్టాను కాబట్టి... ఒకవేళ నటి కాకపోయుంటే ఫ్యాషన్‌ ప్రపంచంలోనే కొనసాగేదాన్నేమో.
* దక్షిణాది అమ్మాయి కావడంతోనే...  తెలుగు ఇంత సులభంగా మాట్లాడేస్తున్నారా?
చూడటానికి మీకు సులభంగానే అనిపిస్తుందేమో. నేను తెలుగు పదాల్ని ఉచ్చరించడానికి చాలా కష్టపడుతుంటా. అర్థం తెలుసుకుని మరీ మాట్లాడుతుంటా. అందుకే భాష వచ్చేసింది. పేరుకే దక్షిణాది అమ్మాయిని కానీ... నేను పుట్టి పెరిగిందంతా ముంబైలోనే. నాన్న,  అమ్మల వృత్తిరీత్యా మా కుటుంబం ఎప్పుడో ముంబై వచ్చేసింది. అయితే మా ఇంట్లో పద్ధతులు, భాష మాత్రం దక్షిణాది వాతావరణాన్నే గుర్తు చేస్తుంటాయి. మంగళూరు దగ్గర ఒక ఊరు మాది. మాతృభాష తుళు. మేమంతా ఇప్పటికీ ఇంట్లో తుళులోనే మాట్లాడతాం. కానీ నాకు తుళుతోపాటు కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌, మరాఠీ, ఇప్పుడు తెలుగూ వచ్చేసింది. నా డబ్బింగ్‌కీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఫ్యాన్స్‌ ఉన్నారు.
* మీ ఎదుగుదలపై కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తుంటారు?
చాలా గర్వపడుతుంటారు. నాలాగే నన్ను తెరపై చూసిన ప్రతిసారీ ఆశ్చర్యపోతుంటారు. నా అభిమానుల్లో వాళ్లుంటారు, నా విమర్శకుల్లోనూ ప్రధానంగా వాళ్లే కనిపిస్తుంటారు. మా నాన్నకి నేను చేసిన సినిమాలన్నీ కూడా ఇష్టమే తెలుసా? అలాగే ఏవైనా తప్పొప్పులున్నట్టు అనిపించినా చెబుతారు.

* మీ సౌందర్య రహస్యం?
క్రమశిక్షణతో కూడిన జీవనశైలి. అవును... ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో చేస్తుంటా. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేస్తా.  అందం గురించి ఆలోచిస్తూ ఉన్నా ఆహారానికి మాత్రం దూరం కాను. నాకు తిండి అంటే చాలా ఇష్టం. దక్షిణాది వంటకాల్ని అమితంగా ఇష్టపడతా. మా మంగళూరు వెళితే... అక్కడ దొరికే సీ ఫుడ్‌, ఇతర వంటకాలన్నీ ఆస్వాదిస్తుంటా.
ప్రేమ ఉంటేనే పెళ్లి
ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో ప్రణాళికలేమీ ఉండవు. సమయం వచ్చినప్పుడు జరిగిపోతుంటాయంతే.  ప్రస్తుతానికి ప్రేమ గురించి ఆలోచించే తీరిక లేదు. అలాగని భవిష్యత్తులో ప్రేమలో పడననీ చెప్పలేను. పెళ్లి గురించి కూడా అంతే. ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోగలం. పెద్దలు కుదిర్చిన సంబంధం అయినా సరే... కాబోయే వ్యక్తితో ప్రేమలో ఉంటానంతే.

- నర్సిమ్‌ ఎర్రకోటమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని