వివాహానికి వెళ్లి వస్తూ.. విగతజీవులయ్యారు

ప్రధానాంశాలు

Published : 26/10/2021 05:05 IST

వివాహానికి వెళ్లి వస్తూ.. విగతజీవులయ్యారు

కీసర వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
బాహ్యవలయ రహదారి డివైడర్‌ను ఢీకొన్న కారు
సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ ప్రసాద్‌ సతీమణి సహా ముగ్గురి మృతి

ఈనాడు, హైదరాబాద్‌; కీసర, నారాయణగూడ, న్యూస్‌టుడే: ఓ వివాహ వేడుకలో పాల్గొని ఆనందంతో నగరానికి తిరిగి వస్తున్న వారిపై విధి పగబట్టింది. వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవ్వడంతో ఇద్దరు దంపతులు, మరో మహిళ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘోర దుర్ఘటన కీసర అవుటర్‌ రింగు రోడ్డుపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. కీసర సీఐ జె.నరేందర్‌గౌడ్‌ తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ సతీమణి శంకరమ్మ భర్త సోదరుడి(పెదనాన్న కుమారుడు) మనవడి వివాహానికి రెండు రోజుల క్రితం చీరాలకు సమీపంలోని ఈపురుపాలెం వెళ్లారు. పెళ్లయ్యాక ఆదివారం రాత్రి రైల్లో ప్రయాణం చేసి హైదరాబాద్‌కు వద్దామనుకున్నారు. మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌, జైన్‌ మందిర్‌ వద్ద నివాసం ఉండే ప్రసాద్‌ సోదరుడి కుమారుడు బాలకృష్ణమూర్తి(48)..తన భార్య రేణుక(42), కుమారుడు భాస్కర్‌ కారు(టీఎస్‌07ఇజే2473)లో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా మేం ముగ్గురే వెళ్తున్నాం.. మీరూ రండి.. అంతా కలిసే వెళ్దామంటే..శంకరమ్మ కారు ఎక్కారు. ఈ విషయాన్ని ఆమె తన భర్త ప్రసాద్‌కు వివరించారు. వారంతా చీరాల నుంచి ఆదివారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో బయలుదేరారు. కబుర్లు చెప్పుకొంటూ ఆనందంగా వస్తున్నారు. చీరాల నుంచి హైదరాబాద్‌ శివారుకు చేరుకున్న వీరు.. పెద్దఅంబర్‌పేట వద్ద బాహ్యవలయ రహదారి ఎక్కారు. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో కీసర మండలం యాద్గార్‌పల్లి సమీపంలోని డీఆర్‌డీఓ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి అతివేగంతో డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో వెనకాల కూర్చున్న శంకరమ్మ, రేణుక తలలు వెనుక అద్దానికి బలంగా తగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు నడుపుతున్న బాలకృష్ణమూర్తి, పక్కన కూర్చున్న భాస్కర్‌కు గాయాలు కాగా అక్కడికి చేరుకున్న కీసర పోలీసులు వారిని ఈసీఐఎల్‌ చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణమూర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తన భార్య, కోడలు రేణుకలను విగతజీవులుగా చూసి ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. పోలీసులు ఆయనను ఓదార్చారు. శంకరమ్మ హైదరాబాద్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. చికిత్స పొందిన భాస్కర్‌ సాయంత్రానికి అసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు.

ముగ్గురి కళ్లూ దానం..

ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ తన సతీమణి శంకరమ్మ, తన సోదరుడి కుమారుడు బాలకృష్ణమూర్తి ఆయన భార్య రేణుకల కళ్లను దానం చేశారు. అనంతరం ముగ్గురి మృతదేహాలు గాంధీ ఆసుపత్రి నుంచి మూసాపేట్‌లోని తన నివాసానికి తీసుకెళ్లారు. సోమవారం సాయంత్రం ఈఎస్‌ఐ శ్మశాన వాటికలో ముగ్గురి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రసాద్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు విశాఖపట్నంలో వైద్య విద్య అభ్యసిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన