బండికి చోటేదీ..!
eenadu telugu news
Published : 26/10/2021 04:23 IST

బండికి చోటేదీ..!

ఈనాడు - అమరావతి

బందరు రోడ్డులో ‘నో పార్కింగ్‌’ బోర్డు వద్ద నిలిపిన వాహనాలు

విజయవాడలో పార్కింగ్‌ సమస్య నానాటికీ తీవ్రమవుతోంది. వాణిజ్య రాజధానిగా ఉన్న నగరంలో వాహనం ఉంచేందుకు స్థలం వెతుక్కోవాల్సి వస్తోంది. ప్రధాన రోడ్ల వెంట పోలీసులు ‘వాహనాలు నిలుపరాదు’ అని బోర్డులు పెట్టేశారు. అటు పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలం ఉండదు.. బయట పెడదామన్నా పోలీసులు చలానాలు వేస్తున్నారు. బందరు, ఏలూరు రోడ్లలో దుకాణాలకు ఉన్న డిమాండ్‌ను యజమానులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నగరపాలికకు ఇచ్చిన ప్రణాళికలో సెల్లార్‌ పార్కింగ్‌కు చూపించిన స్థలాలను సైతం దుకాణాలుగా మార్చి అద్దెకు ఇస్తున్నారు. దీని వల్ల వాహనాలు పెట్టడానికి చోటు కనిపించడం లేదు. నిబంధనలను ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

రోడ్డుపైనే ఆపిన కార్లు

ట్రాఫిక్‌కు అవరోధం
వన్‌టౌన్‌, బీసెంట్‌ రోడ్డు, ఏలూరు రోడ్డు, బందరు రోడ్లలో వేల సంఖ్యలో వాణిజ్య దుకాణాలు వచ్చాయి. వీటిల్లో కొనుగోళ్లకు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు లక్ష మంది పైగా రోజూ నగరానికి వస్తుంటారు. దీనికి తోడు నగర జనాభా కూడా 13 లక్షలకు చేరింది. బీసెంట్‌ రోడ్డులో దుస్తుల దుకాణాలు, ఫ్యాన్సీ షాపులు, గవర్నర్‌పేటలో ఆటోమొబైల్‌ షాపులు ఏర్పాటయ్యాయి. రాజగోపాల్‌రెడ్డి వీధిలో బంగారు దుకాణాలు, ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌, పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్‌ దుకాణాలు వచ్చాయి. వన్‌టౌన్‌లో రోడ్లు నిత్యం కిక్కిరిసిపోయి ఉంటాయి. శివాలయం వీధి, రాంగోపాల్‌ వారి వీధి, వాసవీ మార్కెట్‌, గుడివాడ వారి వీధి, సామారంగం చౌక్‌, తదితర ప్రాంతాల్లో ఎలక్ట్రికల్‌, ఫ్యాన్సీ దుకాణాల్లో రద్దీ ఎక్కువ. నగరంలో మొత్తం సుమారు 44 వేల సముదాయాలు ఉన్నాయి. చాలా వాటిల్లో కనీస నిబంధనలు కూడా పాటించలేదు. దాదాపు 80 శాతానికి పైగా కాంప్లెక్స్‌ల్లో వాహనాలు నిలిపేందుకు కూడా అవకాశం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొనుగోలుదారులు రోడ్డుపైనే పెడుతున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అవరోధం కలుగుతోంది.


మూణ్నాళ్ల ముచ్చటగా స్మార్ట్‌ పార్కింగ్‌

బెజవాడ నగరంలో పార్కింగ్‌ సమస్యకు పరిష్కారంగా గత పాలకులు ‘స్మార్ట్‌ పార్కింగ్‌’ విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీనికి నగరవ్యాప్తంగా 20 ప్రాంతాలను గుర్తించారు. యాప్‌లోనే పార్కింగ్‌ స్లాట్‌ను బుక్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. తొలుత ఏలూరు రోడ్డులో అమల్లో తెచ్చారు. కొన్నాళ్లు బాగానే నడిచింది. తర్వాత గుత్తేదారు చేతులెత్తేయడంతో మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం నగరపాలక సంస్థ ఈ విధానాన్ని కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తోంది.


ప్రత్యేక దృష్టి సారిస్తేనే..

నుమతి కోసం వాణిజ్య సముదాయ ప్రణాళికను నగరపాలికకు ఇస్తున్న సమయంలో పార్కింగ్‌ ప్రదేశాన్ని కూడా చూపించాల్సి ఉంది. ఇది ఉంటేనే అనుమతి వస్తుంది. ప్లాన్‌లో చూపిస్తున్నా తర్వాత దానిని తమకు అనుగుణంగా యజమానులు మార్చేస్తున్నారు. మంచి డిమాండ్‌ గల ప్రాంతాల్లో అయితే చిన్నపాటి దుకాణాలు కడుతున్నారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత, వాటిని నగరపాలక అధికారులు తనిఖీ చేయడం లేదు.

* పశువుల ఆసుపత్రి కూడలి నుంచి బెంజిసర్కిల్‌ వరకు భారీగా వాణిజ్య సముదాయాలు వచ్చాయి. చెన్నై - కోల్‌కతా జాతీయరహదారికి రెండు వైపులా ఉన్న సర్వీసు రోడ్లలోనూ ఇదే పరిస్థితి. చాలా వరకు పార్కింగ్‌ కోసం స్థలం లేకుండానే నిర్మించారు.

* పార్కింగ్‌ వసతి ఉన్న చోట్ల కోర్టు తీర్పు ప్రకారం రుసుం వసూలు చేయకూడదు. నిర్వాహకులు ఉల్లంఘించి యథేచ్ఛగా వాహనదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దీనిని తప్పించుకోవడానికి చాలా మంది రోడ్ల పక్కనే వాహనాలను నిలుపుతున్నారు.

* నగరపాలక సంస్థ అధికారులు కేవలం ఫిర్యాదులు వచ్చినప్పుడే తనిఖీలు చేస్తున్నారు. సెల్లార్‌ పార్కింగ్‌ ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నారు. అనంతరం వాటిపై పర్యవేక్షణ లేకపోవడంతో మళ్లీ వెలుస్తున్నాయి.

* 2002లో నగరంలోని పలు ఉల్లంఘనలపై వీఎంసీ అధికారులు కఠినంగా వ్యవహరించారు. బీసెంట్‌ రోడ్డు, ఏలూరు రోడ్డు, బందరు రోడ్డు, వన్‌టౌన్‌లోని దుకాణ సముదాయాల సెల్లార్‌ పార్కింగ్‌లోని దుకాణాలను కూల్చివేశారు. ఇలాంటి కార్యాచరణ ప్రణాళికతో సాగితేనే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని