సన్నద్ధమయ్యారు.. సాధించారు
eenadu telugu news
Published : 29/07/2021 04:06 IST

సన్నద్ధమయ్యారు.. సాధించారు

● పాలిసెట్‌లో మెరిసిన జిల్లా విద్యార్థులు

-న్యూస్‌టుడే, జ్యోతినగర్‌, మార్కండేయకాలనీ, పెద్దపల్లి కలెక్టరేట్‌

కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వారి ప్రతిభ మరుగునపడలేదు. పదో తరగతి వార్షిక పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణత సాధించగా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇంజినీరింగ్‌ కోర్సులో చేరాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా పాలిటెక్నిక్‌ కోర్సు ప్రవేశపరీక్షకు సన్నద్ధమయ్యారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మంచి ర్యాంకు సాధించారు. భవిష్యత్తులో గొప్ప ఇంజినీర్‌ కావడమే లక్ష్యమని చెబుతున్నారు. బుధవారం వెల్లడైన పాలిసెట్‌ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకు సాధించి, జిల్లాలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థుల నేపథ్యంపై ప్రత్యేక కథనం.

గురువు ప్రోత్సాహం.. ఐఐటీ లక్ష్యం

గోదావరిఖని తిలక్‌నగర్‌కు చెందిన దోబిల పద్మ, సదానందం దంపతుల కుమారుడు రుషీంద్ర పాలిసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 56వ ర్యాంకు సాధించాడు. సదానందం ఒప్పంద వెల్డర్‌గా పని చేస్తున్నారు. ఖని రెయిన్‌బో ఉన్నత పాఠశాలలో చదివిన రుషీంద్ర పదో తరగతి చదవగా 10/10 జీపీఏ సాధించాడు. చిన్నతనం నుంచి చదువులో ముందుండే అతడిని భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు సంతోష్‌గౌడ్‌ ప్రోత్సహించారు. ప్రత్యేక చొరవ తీసుకుని శిక్షణ తరగతులు నిర్వహించారు. పాలిసెట్‌లో ఇంజినీరింగ్‌ విభాగంలో 120 మార్కులకు గాను 112 మార్కులతో 56వ ర్యాంకు సాధించిన రుషీంద్ర జాతీయ స్థాయి సంస్థలో ఐఐటీ సీటు సాధించడమే లక్ష్యమని చెప్పాడు.

నాన్నను చూసి.. అధ్యయనం చేసి..

ఎన్టీపీసీలో ఇంజినీర్‌గా పని చేస్తున్న వెన్నమనేని మధు కూతురు నిహారిక సెయింట్‌క్లేర్‌ పాఠశాలలో చదివింది. తండ్రి బాటలో ఇంజినీరింగ్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించిన ఆమె పాలిసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంకుతో మెరిసింది. గణితంపై పూర్తి సాధించిన నిహారిక పదో తరగతి పూర్తి కాగానే పాఠ్యపుస్తకాలను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ప్రవేశ పరీక్ష ఏదైనా ఒత్తిడి లేకుండా చదువుపై దృష్టి సారిస్తే ఉత్తమ ర్యాంకు సాధించవచ్చని నిహారిక పేర్కొంటోంది.

పట్టుదలతో రైతు బిడ్డ ప్రతిభ

పెద్దపల్లి పట్టణానికి చెందిన ముత్తునూరి రమేష్‌, సరోజ దంపతుల కొడుకు శ్రీనాథ్‌ పాలిసెట్‌లో రాష్ట్ర స్థాయిలో 60వ ర్యాంకు సాధించాడు. రమేష వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదివిన శ్రీనాథ్‌ 10/10 జీపీఏ సాధించాడు. ఇంజినీరింగ్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పాలిసెట్‌కు పట్టుదలతో సన్నద్ధమయ్యాడు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించడంతో శ్రీనాథ్‌ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

 

శ్రీనాథ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని