close

సోమవారం, అక్టోబర్ 21, 2019

ప్రధానాంశాలు

బోటు విహారం.. దైవాధీనం

● అలంకార ప్రాయంగా లైఫ్‌ జాకెట్లు!!

● వరద సమయంలోనూ ఇష్టారాజ్యంగా విహార యాత్రలు

● కానరాని తనిఖీలు, అప్రమత్తం

పచ్చని కొండల మధ్య ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మికతల కలబోత శ్రీశైలం. ఇక్కడ స్వయంభువులుగా కొలువుదీరిన భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనం అనంతరం భక్తులు, పర్యాటకులు జల విహారానికి మొదటి ప్రాధాన్యమిస్తుంటారు. జలాశయం వెనుకజలాల పరిధిలోని గ్రామాల ప్రజలకు పడవ ప్రయాణం అనివార్యం. ఈ విహారం, ప్రయాణం ఎంతవరకు సురక్షితం అన్నది ప్రశ్నార్థకమే..

న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం: శ్రీశైలంలో పర్యాటకులు నదిలో విహారం చేసేందుకు ఏపీ టూరిజం, స్థానిక మత్స్యకార సంఘాలకు చెందిన మరబోట్లు అందుబాటులో ఉన్నాయి. డ్యాం లోకల్‌ ట్రిప్పు, 16 కి.మీ దూరం కలిగిన అక్కమహాదేవి గుహల వరకు రెండు కొండల మధ్య ప్రవహించే నదిలో బోటు విహారం సాగుతుంది. బోట్లను ఆయా యాజమాన్యాలు ఎప్పటికప్పుడు స్వీయ తనిఖీలు నిర్వహించుకుంటూ ఆదాయార్జన సాగిస్తున్నాయి. ఇదే క్రమంలో బోట్లకు లైసెన్సులు, లైఫ్‌ జాకెట్లను అందుబాటులో ఉంచుతున్నాయి. బోట్లను నడిపేందుకు అనుభవం కలిగిన డ్రైవర్లను నియమించుకుంటున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి ప్రమాదం జరగనంత వరకు పర్వాలేదు. చిన్న తేడా వచ్చినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

గతంలో జరిగిన భారీ ప్రమాదాలు

1976లో కొత్తపల్లి మండలం కపిలేశ్వరం నుంచి సింగోటం జాతరకు భక్తులతో కృష్ణా నదిలో వెళుతున్న పడవ మునిగిపోయింది. 58 మంది మృతి చెందారు.

2007లో పగిడ్యాల మండలం నెహ్రూనగర్‌ నుంచి 65 మందితో సింగోటం జాతరకు వెళుతున్న బోటు తిరగబడింది. ఈ ఘటనలో 61 మంది జలసమాధి అయ్యారు.

లైఫ్‌ జాకెట్ల అమలులో నిర్లక్ష్యం!

బోటు విహారంలో తప్పని సరిగా లైఫ్‌ జాకెట్లను ధరించాల్సి ఉంటుంది. ఈ నిబంధన అమలు కావడం లేదు. బోటు నిర్వాహకులు ఖచ్ఛితమైన నిబంధనలను అమలు చేయడం వల్ల పర్యాటకుల ప్రాణాలకు భరోసా కల్పించే అవకాశం ఉంది.

ప్రవాహానికి ఎదురుగా ప్రయాణాలు

నదిలోకి వరద ప్రవాహం వస్తుందంటే బోట్ల నిర్వాహకులు కాసుల పంటగా భావిస్తారు. ఈ క్రమంలో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించి తమ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. వర్షాకాలం ఆరంభమయిన తర్వాత జూన్‌, జులై, ఆగస్ట్టు, సెప్టెంబర్‌ నెలల్లో నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం ఉంటుంది. భారీగా వరద ప్రవాహం ఉన్న సమయంలోనూ ప్రభుత్వ, ప్రైవేటు బోట్లు ఇష్టారాజ్యంగా తిప్పుతున్నారు. ప్రవాహ వేగం, అంచనా అంతా దైవాధీనమే! కాకపోతే బోటు నడిపే డ్రైవర్‌ ప్రవాహ వేగాన్ని అంచనా వేసుకుంటూ నడుపుతున్నారు. వాస్తవానికి నదిలో ప్రవాహ సమయంలో బోటు ప్రయాణించేటప్పుడు డ్రైవరుకు, ప్రయాణికులకు వేగం తెలిసే విధంగా అప్రమత్తం చేసుకోవాల్సి ఉంది. అక్కమహాదేవి గుహలకు వెళ్లేటప్పుడు బోట్లు నీటి ప్రవాహానికి ఎదురుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బోటు నిర్వాహకులు ప్రవాహ వేగానికి అనుగుణంగా బోటు వేగాన్ని నియంత్రించడం, జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆదివారం తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రవాహ సమయంలో నదిలో బోట్లను నడపకపోవడంతో సురక్షితం.

ఎవరికి వారే యమునా తీరే!!

స్థానికంగా సాగుతున్న బోటింగ్‌ నిర్వహణ తీరుపై దేవస్థానం, రెవెన్యూ, పోలీసు, మత్స్యశాఖ, పర్యాటకశాఖలు సంయుక్తంగా తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఈ శాఖలు అన్ని ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నాయి. ఉమ్మడిగా బోట్లను తనిఖీ చేసిన ఉదంతాలు శూన్యం. నదిలో బోట్ల ప్రయాణాలపై షరతులు, నిబంధనలను జలవనరులశాఖ, మత్స్యశాఖలు రెండింటిలో ఏవి అమలు చేస్తున్నాయో తెలియని పరిస్థితి ఉంది. ఏదో ప్రమాదాలు జరిగినప్పుడు ఆర్భాటం చేయడం తప్ప ఆ తర్వాత బోట్ల నిర్వహణను ఏ శాఖ తరఫున తనిఖీ చేయడం లేదన్న విమర్శలు బాహాటంగా వ్యక్తమవుతున్నాయి.

సాగర్‌ నుంచి శ్రీశైలానికి బోటు ప్రయాణం

గత కొన్నేళ్లుగా నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలానికి బోటు ప్రయాణం సాగుతోంది. శ్రీశైలం దిగువన వరద ప్రవాహం పెరిగినప్పుడు ఈ యాత్ర మొదలవుతుంది. ఈ బోటు ప్రయాణాల్లో పర్యాటకులు లైఫ్‌ జాకెట్లు ధరించి వస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన టూరిజం బోట్లు కావడంతో అనుమతులు వచ్చిన తర్వాతనే ప్రయాణిస్తున్నాయి. ఈ ప్రయాణాలకు ఆయా పర్యాటకశాఖలే బాధ్యత వహిస్తున్నాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

*●నదిలో ప్రయాణించే ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు బోటు లైసెన్సు కలిగి ఉండాలి. కండీషన్‌లో ఉన్న బోటునే నది ప్రయాణానికి అనుమతించాలి.

*●అనుభవం, ధ్రువపత్రం ఉన్న డ్రైవర్లు మాత్రమే బోట్లను నడపాలి. డ్రైవర్లకు తరచూ శిక్షణ, అవగాహన కల్పించాలి

*●బాధ్యత కలిగిన ఆయా ప్రభుత్వశాఖల అధికారులను కమిటీగా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలి.

*●బోట్ల సామర్థ్య సంఖ్యను బహిర్గతం చేయడంతో పాటు అమలు చేయాలి.

*●బోటు ప్రయాణం చేయాలంటే లైఫ్‌జాకెట్‌ ధరించాలన్న నిబంధన తప్పని సరి చేయాలి.

*●బోటింగ్‌ పాయింట్ల వద్ద తనిఖీఅధికారులు, శాఖల సంబంధిత ఫోన్‌ నంబర్లను ప్రదర్శించాలి.

*●బోట్లలో తప్పనిసరిగా డ్రైవర్‌, క్లీనర్‌, మెకానిక్‌ నైపుణ్యం కలిగిన వారితోపాటు అవసరానికి అనుగుణంగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.